విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన వార్షిక ఆదాయ అవసరాలు మరియు రిటైల్ ధరలపై వ్యక్తిగతంగా మరియు వీడియో కాన్పరెన్స్ ద్వారా బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ రెండవ రోజు విజయవాడలోని ఓ ప్రైవేట్ పంక్షన్ హాల్ లో బుధవారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్, మెంబర్ పి. వెంకట రామ రెడ్డిలు విద్యుత్ టారీఫ్ తదితర అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. రెండవ రోజు 59 మంది తమ అభిప్రాయాలను విన్నవించుకోవడానికి నమోదు చేసుకోగా, ప్రత్యక్షంగా 14 మంది, 25 మంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ అభ్యర్థనలను సభ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే మొదటి రోజు 27 మంది నమోదు చేసుకోగా 11 మంది ప్రత్యక్షంగా, 10 మంది వీడియో కాన్పరెన్స్ ద్వారా తమ అభ్యర్థనలను సభ దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం రెండు రోజుల్లో 60 మంది తమ అభ్యంతరాలను, అభిప్రాయాలను, సూచనలను ఏపీఈఆర్సీ దృష్టికి తీసుకురాగా ఏపీఈఆర్సీ ఛైర్మన్ ఠాకూర్ రామ సింగ్ మాట్లాడుతూ వినియోగదారులు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రతి అంశాన్ని పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని తెలిపారు.
రెండవ రోజు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ఎవరూ బాగుచేయలేని దుస్థితికి చేరుకుందని, విద్యుత్ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఏపీఈఆర్సీ పై ఎంతైనా ఉందన్నారు. ఎలక్ట్రిసిటీ రెగ్యూలేటరీ కమీషన్ పై వినియోగదారులకు నమ్మకం రోజు రోజుకు సడలిపోతుందన్నారు. ట్రూఅఫ్ ఛార్జీల పేరుతో పదే పదే భారం మోపటం అన్యాయమన్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సెకీ, అదాని ఓప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని కోరారు. విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక కన్వీనర్ ఎంవీ ఆంజనేయులు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ ల ఏర్పాటు తో వినియోగదారులకు లాభం కలుగుతుందని చెప్తున్నారని, ఇది ప్రజలను మభ్యపెట్టడమేనని అన్నారు. మన దేశంలోనే బొగ్గు లభిస్తున్నా విదేశీ బొగ్గును ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని దీంతో వినియోగదారులపై భారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్ పి సి ఏ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలన్నారు.
ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధి పి. కోటి రావు మాట్లాడుతూ గ్రీన్ పవర్ ను ఎంకరేజ్ చేయాలన్నారు. విద్యుత్ టారీఫ్ లు ఏడాదికి ఏడాదికి పెరిగిపోతున్నాయని, దీనికితోడు అదనపు ఛార్జీల భారంతో వినియోగదారులు అల్లాడిపోతున్నారన్నారు. డిస్కంల ఉన్నతాధికారుల్లో సర్వీస్ మోటివ్ ఉండటం లేదని అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా కు చెందిన పారిశ్రామికవేత్త రాజేష్ బాబు మాట్లాడుతూ పరిశ్రమలకు విద్యుత్ బిల్లులపై సబ్సిడీ ఇవ్వాలని, అప్పుడే పారిశ్రమల స్థాపన జరుగుతుందని సూచించారు. క్రింది స్థాయి సిబ్బంది విచక్షణారహితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మా పరిశ్రమకు మూడేళ్లలో రూ. 3.5 కోట్లకు పైగా బిల్లులు చెల్లించానని వివరించారు. అలాగే తాతా సుబ్రమణ్యం, కుమార స్వామి, తాతినేని వేంకటేశ్వరరావు, పి. సాంబశివరావు, జీవా, గణేష్, హనుమయ్య తదితరులు తమ అభ్యర్థనలను ఏపీఈఆర్సీ ఛైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు.
అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పులను నేడు వినియోగదారులు కట్టాల్సిరావడంతో మా ప్రభుత్వంకు చెడ్డపేరు వస్తుందన్నారు. అదనపు ఛార్జీలు కట్టలేని పేద, మధ్యతరగతి వినియోగదారులకు సమయం ఇవ్వకుండ కనెక్షన్ కట్ చేస్తున్నారని ఛైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఏటువంటి చర్యలు తీసుకోని అధికారులు, సిబ్బంది ఇప్పుడు మాత్రం స్పీడ్ గా చర్యలు తీసుకోవడంలో అర్థం ఏమిటన్నారు. విద్యుత్ ప్రమాద బీమాను పెంచాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాల్లో ఇళ్లు దగ్ధం అయిన బాధితులకు త్వరగా న్యాయం చేయాలని కోరారు. అలాగే ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి కండక్టర్ల ను కూడా మార్చాలన్నారు. వ్యవసాయ కనెక్షన్ లకు ధరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోపే కనెక్షన్ లు ఇవ్వాలని, సిబ్బంది కొరత సమస్యను తీర్చాలన్నారు. తిరుపతి నుంచి గురుస్వామి నాయుడు మాట్లాడుతూ కనీసం వంద యూనిట్ల వరకు ఒక స్లాబ్ ఉండేలా మార్పు చేయాలన్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న స్లాబ్ విధానంతో పేద, మధ్యతరగతి ప్రజలు అధిక బిల్లుల పోటు భరించలేకపోతున్నారన్నారు. అలాగే వ్యవసాయానికి నిరంతరాయంగా 9 గంటల విద్యుత్ ను సరఫరా చేయాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పీవీఎస్ గోపాల కృష్ణ మాట్లాడుతూ చేపల చెరువుల సాగు నష్టాలను మిగుల్చుతుందని, 5 ఎకరాల లోపు చెరువులు ఉన్న వారికి అమలు చేస్తున్న విద్యుత్ సబ్సిడీని అన్ని చేపల చెరువులకు అమలు చేయాలన్నారు. అలాగే సిగ్మా సీఈవో గోపీనాథ్, ఎంఎస్ శర్మ, హర్ష కుమార్, హిమాన్ష్ చావ్లా, డీవీ లక్ష్మీనారాయణ, చీకటి శ్రీనివాస్ తదితరులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అధికారులు, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్ అధికారులు, వినియోగదారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News