గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో కమర్షియల్ సంస్థలు, చికెన్ స్టాల్స్ నుండి అనధికార వ్యర్ధాల సేకరణ తక్షణం నిలిపివేయాలని, ప్రతి కమర్షియల్ సంస్థ డి&ఓ ట్రేడ్ లైసెన్స్ కల్గి ఉండాలని, రోడ్లు, డ్రైన్ ఆక్రమణలను స్వచ్చందంగా తొలగించుకోవాలని, లేకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. బుధవారం గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ చేపట్టనున్న పలు చర్యలపై జిఎంసి ప్రధాన కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్మాట్లాడుతూ నగరంలో కమర్షియల్ సంస్థల నుండివ్యర్ధాల సేకరణకు గతంలో 2 సంస్థలకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని, ఇప్పటికే ఆయా సంస్థల కాంట్రాక్ట్ గడువు ముగిసిందన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉందని, కోడ్ అనంతరం నూతన టెండర్ పిలుస్తామని తెలిపారు. కానీ కొంత మంది జిఎంసి నుండి ఏ విధమైన అనుమతులు లేకుండా అనధికారికంగా ఆయా సంస్థల నుండి వ్యర్ధాలు సేకరణ చేసి, అధిక మొత్తంలో నగదు వసూళ్లు చేస్తున్నారని ఫిర్యాదులు అందాయని, వారు వసూళ్లు నిలిపివేయాలని లేకుంటే చట్టపరంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే నగరంలో చికెన్ స్టాల్స్ నుండి వ్యర్ధాల సేకరణను టెండర్ ద్వారా కాంట్రాక్టర్ కి కేటాయించామని, క్షేత్ర స్థాయిలో ఆయా స్టాల్స్ నిర్వాహకులు సదరు కాంట్రాక్టర్ కి వ్యర్ధాలను ఇవ్వకుండా అనధికారిక వ్యక్తులకు ఇస్తున్నారన్నారు. అనధికారికంగా స్టాల్స్ నుండి చికెన్ వ్యర్ధాలు సేకరించి, చేపల చెరువులకు తరలిస్తునారని, వారిపై స్వచ్చ సర్వేక్షణ్, ప్రజారోగ్య రక్షణ రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గుంటూరు నగరంలో డి&ఓ ట్రేడ్ లైసెన్స్ లు ఉండాల్సిన సంఖ్య కన్నా తక్కువగా ఉన్నాయని గుర్తించామని, వచ్చే శనివారం నాటికి నూరు శాతం ట్రేడ్ లైసెన్స్ లు విధించడం, పాత వాటిని రెన్యువల్, ఫీజుల వసూళ్లు చేయాలని ప్రజారోగ్య విభాగ అధికారులను, కార్యదర్శులను ఆదేశించామన్నారు. శనివారం అనంతరం ట్రేడ్ లైసెన్స్ లేకుండా ఉండే కమర్షియల్ సంస్థలను సీజ్ చేస్తామన్నారు. శంకర్ విలాస్, ఇన్నర్ రింగ్ రోడ్ గడ్డిపాడు రైల్వే గేటు వద్ద కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చొరవతో మంజురైన ఆర్ఓబిలు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం అవుతాయని, సంజీవయ్య నగర్, శ్యామలా నగర్ దగ్గర కూడా ఆర్ఓబిలు మంజూరు అయ్యే అవకాశం ఉన్నందున నగరంలో ప్రజల రాకపోకలకు వీలుగా రోడ్ల విస్తరణ, ఆక్రమణల తొలగింపు చేపట్టాల్సిన అత్యావశ్యకమన్నారు. డ్రైన్లు, రోడ్లు ఆక్రమణదారులు స్వచ్చందంగా తొలగించుకోవాలని, లేకుంటే జిఎంసి సిబ్బందే తొలగిస్తారని స్పష్టం చేశారు. నగర ప్రజల సౌకర్యార్ధం, మౌళిక వసతుల కల్పనకు కోసం జిఎంసి చేపట్టే చర్యలుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
Prajavartha Online Telugu News