Breaking News

ఆహార ప‌దార్థాల‌ కల్తీపై కఠినంగా వ్యవహరిస్తాం

-కీల‌క పోస్టుల‌ను గ‌త ప్ర‌భుత్వం భ‌ర్తీ చేయ‌లేదు
-సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఉంది
-అసెంబ్లీ ప్ర‌శ్నోత్త‌రాల్లో వైద్య, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆహార పదార్థాల్ని కల్తీ చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ చట్టాల మేరకు రాష్ట్రంలో ఆహార కల్తీని నిరోధించటానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. బుధవారం శాసనసభలో ఆహార ప‌దార్థాల కల్తీపై స‌భ్యుల‌డిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

మానవ వినియోగానికి సంబంధించిన వస్తువుల అమ్మకం, నిల్వ, పంపిణీ, దిగుమతుల వంటివాటి నియంత్రణ, పర్యవేక్షణకు సంబంధించి 2006 నాటి ఆహార భద్రత, ప్రమాణాల చట్ట నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర స్థాయిలో ఆహార భద్రతా కమీషనర్, జిల్లాల్లోని అధికారులు, ఇతర చట్టబద్ధమైన కార్యనిర్వాహక అధికారులు, అడ్జుడికేటింగ్ అధికారి, ఫుడ్ సేఫ్టీ ట్రిబ్యునల్, ప్రత్యేక కోర్ట్ వంటి విభాగాలు ఈ చట్టం అమలును పర్యవేక్షిస్తున్నాయన్నారు. ఆహార భద్రతకు నియమించిన అధికారులు తినుబండారాలను, తయారీదారుల‌ను, హోల్ సేలర్లు, రిటైలర్ల వంటి వారిని క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నారని స‌భ‌కు మంత్రి వివ‌రించారు. ఆహార నమూనాలను సేకరించి సమీప ప్రయోగశాలల్లో పరిశీలిస్తున్నారని, సివిల్, క్రిమినల్ కేసుల్ని నమోదు చేస్తున్నారన్నారు. 2019-2024 మధ్య కాలంలో మొత్తం 45,509 ఆహార నమూనాలను సేకరించి విశ్లేషించారని, అందులో 2,473 నమూనాలకు సంబంధించి నిబంధనలను ఉల్లంఘించినట్లు, అలాగే
654 నమూనాలు సురక్షితమైనవి కావ‌ని, 1,779 నమూనాల విష‌యంలో నాణ్యత లేకుడా తప్పుడు బ్రాండింగ్, లేబులింగ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలిందని మంత్రి మరో ప్రశ్నకు సమాధానంగా వివరించారు.

2006 ఆహార భద్రతా చట్టం సెక్షన్ 59 ప్రకారం సురక్షితం కాని ఆహార ప‌దార్థాలు విక్ర‌యిస్తే పెనాల్టీతో పాటు జైలు శిక్ష విధించేందుకు సంబంధిత జిల్లాల మేజిస్ట్రీట్ కోర్టు సమక్షంలో కేసు నమోదు చేశార‌ని మంత్రి తెలిపారు. చిన్న నేరాలకు లక్ష నుండి 10 లక్షల రూపాయల వరకు జరిమానాలను చ‌ట్టం నిర్దేశించిందని, పెద్ద నేరాల విషయంలో కనీస జైలు శిక్ష ఆరు నెలల నుండి ఆరేళ్ల వ్యవధి వరకు ప్రతిపాదించిందని వివరించారు. ఆహారం తినటం వల్ల వ్యక్తి మరణిస్తే జైలు శిక్ష ఏడేళ్ల కంటే తక్కువ ఉండ‌కూడ‌ద‌ని చట్టం చెబుతోంద‌ని, దీనిని జీవిత ఖైదు వరకు పొడిగించేందుకు అవకాశం కల్పిస్తోందని మంత్రి వెల్లడించారు.

క‌ల్తీ ఆహారాన్ని తిన‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ కేసులు కూడా పెరుగుతున్నాయ‌న్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని క‌ర‌ప‌త్రాలు, పోస్ట‌ర్ల ద్వారా ప్ర‌జ‌ల్లో పెద్ద ఎత్తున అవ‌గాహ‌న క‌ల్పించేందుకు వైద్య‌,ఆరోగ్య శాఖ కృషి చేస్తోంద‌న్నారు.
ఆహార భ‌ద్ర‌త‌ను ప‌ర్య‌వేక్షించే ఇన్సిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపిఎం) విభాగంలో 279 పోస్టులు ఖాళీగా ఉండ‌గా, కేవ‌లం ఆరుగురే ప‌నిచేస్తున్నార‌ని, గ‌త ప్ర‌భుత్వం పోస్టుల్ని భ‌ర్తీ చేయ‌కుండా నిర్ల‌క్ష్యం చేసింద‌న్నారు. తాము అధికారంలోకొచ్చాక భ‌ర్తీకి చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని, ఎఫ్ ఎస్ ఎస్ ఎ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఈ పోస్టుల్ని ఎపిపిఎస్‌సి ద్వారానే భ‌ర్తీ చేయాల‌ని, వైద్య ఆరోగ్య శాఖ‌లో పోస్టుల్ని భ‌ర్తీ చేసే ఎపి మెడిక‌ల్ స‌ర్వీసెస్ బోర్డు ద్వారా చేప‌ట్టేందుకు వెసులుబాటు క‌ల్పించాల‌ని ఆర్థిక శాఖ‌ను కోరామ‌న్నారు.

సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఉందిఃమంత్రి స‌త్య‌కుమార్‌

రాష్ట్రంలో సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రుల కొర‌త‌పై స‌భ్యుల‌డిగిన ప్ర‌శ్న‌కు మంత్రి  స‌త్య‌కుమార్ యాద‌వ్ స‌మాధాన‌మిస్తూ… సూపర్ స్పెషాలిటీ విభాగాలలో వైద్య నిపుణుల కొరత ఉంద‌న్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో సూపర్ స్పెషాలిటీ విభాగాలలో మొత్తం 369 అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరం వుండగా ప్రస్తుతం 153 మంది మాత్రమే అందుబాటులో ఉన్నార‌న్నారు. ఇంకా 216 ఖాళీలు అన‌గా 59 శాతం మేర ఖాళీలున్నాయనీ తెలిపారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకొచ్చాక 43 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియ‌మించామ‌న్నారు.
ఖాళీలను వేగంగా భర్తీ చేసేందుకు వీలుగా ఈనెల 26న‌ వాకిన్ ఇంటర్వ్యూ ను చేప‌డుతున్నామ‌ని మంత్రి చెప్పారు. ఇప్పుడు క్రమంగా పరిస్థితి మారుతోందని, వైద్యసేవలను క్రమంగా మెరుగుపర్చేందుకు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌ల్ని తీసుకుంటున్నామన్నారు. వాస్త‌వాలిలా ఉంటే మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కేవ‌లం 4 శాతమే స్పెష‌లిస్గు డాక్ట‌ర్ల కొర‌త ఉంద‌ని అస‌త్యాలు చెప్పార‌ని మంత్రి ఎ త్తి చూపారు. అదే విధంగా కర్నూలు క్యాన్సర్ కేర్ సెంటర్ నిర్మాణానికి సంబంధించి మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి ఈ నెల చివరి నాటికి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నియోజకవర్గానికొక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు ఎయిమ్స్‌లో వైద్యం

ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల‌కు రిఫరల్ వైద్య సౌకర్యాలను కల్పించే అంశాన్ని పరిశీలించాలని మంత్రికి సూచించారు. దీనిపై స్పందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ తాను ఇటీవల ఆస్పత్రి ఇడితో మాట్లాడాన‌ని, త్వరలోనే త‌గు ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *