-అఖిల భారత మాల సంఘాల జేఎసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవిప్రసాద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్సీ వర్గీకకరణను, రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను ఆమోదించిన కేబినెట్ తక్షణమే దానిని వెనక్కి తీసుకోవాలని అఖిల భారత మాల సంఘాల జేఎసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవిప్రసాద్ డిమాండ్ చేశారు. బుధవారం, గురునానక్‌కాలనీలో తమ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ అలంకార్ సెంటర్లో ఉన్న ధర్నా సెంటర్‌లో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్నా చేయటానికి, పిలుపునిస్తే పోలీసులు హౌస్ అరెస్టులు, చేయటం దారుణమని ఖండిరచారు. కూటమి ప్రభుత్వం మాలలపై కక్ష కట్టిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాలలపై వ్యతిరేక ధోరణిలో ఉన్నారని ఆరోపించారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను రద్దు చేసి, హైకోర్టు జడ్జీలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి, న్యాయ విచారణ జరిపించాలని అన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. ఎవర్ని సంతృప్తిపర్చడానికి ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుందని ప్రశ్నించారు. 2011 జనాభా లెక్కలను ఆధారం చేసుకొని ఒకపక్క సరైన సమాచారం లేదని ప్రభుత్వం చెబుతూనే మరో పక్క జిల్లా యూనిట్‌గా చేస్తానన్న ప్రభుత్వం నేడు రాష్ట్ర యూనిట్‌గా చేస్తున్నామంటోందని విమర్శించారు. 15 శాతంగా ఉన్న రిజర్వేషన్ 25 శాతంగా పెంచడంతోపాటు ప్రైవేటురంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలే తప్ప దళితుల మధ్య విభజన తేవొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News