-రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (విపత్తుల నిర్వహణ) అర్ పి సిసోడియా
-రసాయన కర్మాగారాల వద్ద గాలి నాణ్యత పర్యవేక్షణ పరికరాలు
-డ్రోన్ టెక్నాలజీ వినియోగం – వాట్స్ యాప్ ద్వారా విపత్తుల నిర్వహణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విపత్తుల నిర్వహణలో అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలు అత్యవసరమని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (విపత్తుల నిర్వహణ, భూపరిపాలన, స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ , సర్వే సెటిల్మెంట్) , ఆంధ్ర ప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ ఆర్.పి. సిసోడియా పేర్కొన్నారు. తీరప్రాంతాల్లో ఎమ్మార్వో స్థాయి నుండి జిల్లా కలెక్టర్ వరకు ప్రతి అధికారికి శాటిలైట్ ఫోన్లు అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. తద్వారా విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రాణనష్టం నివారించవచ్చని చెప్పారు. శనివారం విపత్తుల నిర్వహణ కార్యాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లలో కొనుగోలు చేసిన పరికరాల వినియోగ స్థితి, రాబోయే వర్షాకాలానికి అవసరమైన సన్నద్ధత, బడ్జెట్, తీవ్ర ఉష్ణప్రవాహాల (హీట్ వేవ్స్) కోసం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను సమీక్షించారు. జిల్లాల స్థాయిలో మానవ వనరులు, పరికరాల అందుబాటు పరిస్థితులను అంచనా వేసి, తుపానుల హెచ్చరికా కేంద్రాల పనితీరును సమీక్షించారు.
సమావేశంలో హానికర, రసాయన కర్మాగారాల సమీపంలో గాలి నాణ్యత పర్యవేక్షణ పరికరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాయు కాలుష్యం లేదా రసాయన గ్యాస్ లీకేజీ వంటి ప్రమాదాలను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలానికి ముందుగా జి ఐ ఎస్ ప్లాట్ఫారమ్ను సిద్ధం చేయడంతో పాటు, ఐ ఒ టి పరికరాలను వినియోగించి ఆన్లైన్ డేటాను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సిసోడియా మాట్లాడుతూ, విపత్తుల నిర్వహణలో డ్రోన్ టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, అవసరమైన డ్రోన్ పైలెట్లను ఎంపానల్ చేసి సిద్ధంగా ఉంచాలని సూచించారు. నైట్ విజన్ డ్రోన్ల ప్రాముఖ్యతను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం వాట్స్ అప్ ఆధారిత సేవలను అందుబాటులోకి తెచ్చిందని, అదే విధంగా విపత్తుల నిర్వహణలో వినియోగించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
వాట్స్ అప్ ఆధారిత సమీకృత విపత్తుల నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విపత్తుల నిర్వహణ విధానాన్ని రూపొందించాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేయాలని తెలిపారు.
సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం
ప్రపంచ బ్యాంకు నిధులతో అమలవుతున్న ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ పరిధిలో కొనుగోలు చేసిన పరికరాలు, అందుబాటులో ఉన్నవి, ప్రస్తుతం వినియోగంలో ఉన్నవి అనే అంశాలపై పూర్తి స్థాయి నివేదిక అందించాలని సిసోడియా అధికారులను ఆదేశించారు. విపత్తుల నిర్వహణ కోసం ఇప్పటికే ఉన్న యాప్ను మరింత మెరుగుపరచాలని, కొత్త ఫీచర్లు జోడించి ప్రజలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని సూచించారు. విపత్తు సమయంలో ప్రజలకు తక్షణమే సమాచారం అందించేలా ఈ యాప్ను ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రొనంకి కుర్మనాథ్ పాల్గొని నిర్వహణ విధానాలను బలోపేతం చేసే దిశగా తన సూచనలు అందించారు.
Prajavartha Online Telugu News