Breaking News

వికసిత్ భారత్‌లో భాగంగా ప్రపంచంలో మన దేశం అగ్ర స్థానంలో ఉంటుంది… : కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వికసిత్ భారత్‌లో భాగంగా ప్రపంచంలో మన దేశం అగ్ర స్థానంలో ఉంటుందని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఉద్ఘాటించారు. విజయవాడలో ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ నూతన కార్యాలయం ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వ్యాఖ్యానించారు. కాంప్లెక్స్‌ కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. విజయవాడలోనే పాస్‌పోర్ట్‌ ప్రింటింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. విజయవాడలో ఏర్పాటు అయిన రీజనల్ పాస్ పోర్ట్ కేంద్రం నుంచి ప్రజలు మరిన్ని‌సేవలు పొందాలని సూచించారు. రోజుకు వెయ్యి స్లాట్లు ఇచ్చేలా ఆధునీకరణ చేశామని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వెల్లడించారు.

ఇటీవల యువత అవసరాలను దృష్టిలో ఉంచుకుని చాలా సేవలు అందుబాటులోకి తెచ్చామని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ అన్నారు. నేడు ఉద్యోగ, వ్యాపారం పరంగా చాలా అవకాశాలు వచ్చాయని అన్నారు .దేశంలోనే చాలా రాష్ట్రాల్లో అనేక అవకాశాలు ఉన్నాయని వివరించారు. హార్డ్‌వర్క్ చేసే వారికి ఎప్పుడూ అవకాశాలు లభిస్తాయన్నారు. కరోనా సమయంలో మనమే అందరికీ అండగా నిలిచామని చెప్పారు. విజయవాడలో మంగళవారం ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ నూతన కార్యాలయాన్ని కేంద్రమంత్రి కీర్తివర్ధన్‌సింగ్‌ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని), ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ మోదీ సారధ్యంలో ఏపీ ఎకనామిక్ గ్రోత్ పెరిగిందని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు. మోదీ నాయకత్వాన్ని, ఆయన పని తీరును ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయని చెప్పారు. మోదీ ముందు చూపు, సంస్కరణల అమలు కారణంగా భారత్ అభివృద్ధి దిశగా పయనిస్తోందని తెలిపారు. 2047 వికసిత్ భారత్‌లో భాగంగా ప్రపంచంలో మన దేశం అగ్ర స్థానంలో ఉంటుందని ఉద్ఘాటించారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేయడానికే ఉన్నారని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం కోసం తాము ఎప్పుడూ పని‌చేస్తూ ఉంటామని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పేర్కొన్నారు.

ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసిందంటే ప్రధాని మోదీనే కారణమని ఆయన అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, ఐటీ పరంగా కూడా దేశం అభివృద్ధి చెందిందని తెలిపారు. మన దేశం అమలు చేస్తున్న టెక్నాలజీని ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకున్నాయన్నారు. ప్రపంచంలో మన దేశం గ్లోబల్ ఎకానమీ పరంగా మూడోస్థానంలో నిలిచిందన్నారు .గుజరాత్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు వృద్ధి రేటులో ముందంజలో ఉన్నాయని తెలిపారు. గుంటూరు నుంచి జర్మనీ, నెల్లూరు నుంచి న్యూయార్క్ వరకు ప్రపంచం మొత్తం మన వాళ్లు ఉన్నారని చెప్పుకొచ్చారు. రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయంలోనే ప్రింటింగ్, ఇతర అన్ని రకాల సేవలు ఇక్కడ నుంచే అందిస్తారని తెలిపారు. ఒకరోజులో 500 దరఖాస్తుల నుంచి 1000 దరఖాస్తులకు పెరిగాయని అన్నారు. పాస్ పోర్ట్‌లను సకాలంలో బట్వాడా చేస్తున్న పోస్టల్ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక సెంట్రల్ కార్యాలయం నిర్మాణం కోసం రెండు ఎకరాలు కేటాయించారని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు.

ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది: ఎంపీ‌ శివనాధ్
విజయవాడలో ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఎంపీ‌ కేశినేని శివనాధ్ తెలిపారు. కార్పొరేట్ ఆఫీస్ తరహాలో పాస్ పోర్ట్ కార్యాలయం ఆధునీకరించారని చెప్పారు. విశాఖపట్నంతో పాటు ఇప్పుడు విజయవాడలో రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ద్వారా సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. 600 నుంచి 2 వేల మంది నేడు దరఖాస్తులు చేసుకుంటున్నారని అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్‌లో భాగంగా ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అమరావతిలో కూడా ఒక పాస్ పోర్ట్ కార్యాలయం నిర్మాణం జరుగుతుందని అన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు మరింత సరళతరం చేసి సేవలు అందిస్తామని ఎంపీ‌ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.

విజయవాడ నుంచే అన్ని రకాల పాస్ పోర్ట్ సేవలు : ఎమ్మెల్యే సుజనా చౌదరి
రాష్ట్ర విభజన తర్వాత కీలకమైన ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం విజయవాడలో ప్రారంభించడం సంతోషంగా ఉందని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. బందర్ రోడ్ లోని స్టాలిన్ సెంట్రల్ మాల్ లో మంగళవారం ప్రారంభించిన ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం ప్రారంభోత్సవంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ , ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, బొండా ఉమా మహేశ్వరరావు లతో కలిసిసుజనా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ సుష్మా స్వరాజ్ మంత్రిగా ఉన్నప్పటి నుంచి ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం విజయవాడ రావడానికి తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు. ఇప్పుడు అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించారు. యువత విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని విద్యార్థులు, యువత ఇబ్బందులు పడకుండా మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. విశాఖపట్నం వరకు వెళ్లకుండా విజయవాడ నుంచే అన్ని రకాల సేవలు పొందవచ్చని స్పష్టం చేశారు. మొబైల్ యాప్ ద్వారా కూడా సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు .కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అవసరమైన ప్రణాళికలు సిద్ధంగా అన్ని రకాల సేవలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంపై అందరూ అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి సూచించారు.
రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ శివ హర్ష ను ఎమ్మెల్యే సుజనా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, బోండా ఉమామహేశ్వరరావు, రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ ఆఫీసర్ శివ హర్ష,ఎం ఇ ఎ జాయింట్ సెక్రటరీ డాక్టర్ కె జె శ్రీనివాస, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *