గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడా సెప్టిక్ ట్యాంక్ వ్యర్ధాలను రోడ్ల పక్కన, డ్రైన్లలో వేయడానికి వీలు లేదని, అలా వేసే ట్యాంకర్లను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ ఎస్ఈ నాగ మల్లేశ్వరరావు స్పష్టం చేశారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశాల మేరకు నగరంలోని సెప్టిక్ ట్యాంకర్ల యజమానులు, కాంట్రాక్టర్లతో శనివారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రత్యెక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ సఫాయి కర్మచారి చట్టం 2013 ప్రకారం సెప్టిక్ ట్యాంకర్ల వద్ద పని చేసే సిబ్బంది తప్పనిసరిగా పిపిఈ కిట్ లు ధరించే విధులు నిర్వహించాలన్నారు. జిఓ 134 మేరకు ప్రతి సెప్టిక్ ట్యాంకర్ యజమాని లేదా కాంట్రాక్టర్ తప్పనిసరిగా స్థానిక సంస్థల్లో రిజిస్టర్ చేసుకొని, తగిన లైసెన్స్ తీసుకొని, నిర్దేశిత ఫీజులు వసూళ్ళు చేసుకోవాలని తెలిపారు. నగరంలోని సెప్టిక్ ట్యాంకర్లు తప్పనిసరిగా సుద్దపల్లి డొంకలోని నగరపాలక సంస్థ ఎఫ్ఎస్టీపికే వ్యర్ధాలను తరలించాలని, అక్కడ శాస్త్రీయ పద్ధతిలో నిర్వహణ చేయడం జరుగుతుందన్నారు. నగరపాలక సంస్థ తరుపున ప్రత్యేక రిజిస్టేషన్ చేస్తామని, రిజిస్ట్రేషన్ లేకుండా ఉండే వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
సిఎంఓహెచ్ డాక్టర్ అమృతం మాట్లాడుతూ సెప్టిక్ ట్యాంక్ వ్యర్ధాలను ఆరుబయట వదలడం ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ప్రమాదమన్నారు. వ్యర్దాల్లో ఉండే సూక్ష్మ క్రిములు భూమిలోకి ఇంకడం ద్వారా నీటి కాలుష్యం, గాలిలో కలిసి వాయు కాలుష్యం జరుగుతుందన్నారు. కనుక నిర్వహకులు తప్పనిసరిగా నిర్దేశిత విధానంలో వ్యర్ధాలను తరలించాలన్నారు. సమావేశంలో ఈఈ కోటేశ్వరరావు, డిఈఈ నాగభూషణం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News