Breaking News

లాం ఫారం లో మిరప విత్తనాలు అమ్మకానికి సిద్ధం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానము, లాం ఫారంలో జూన్ నెల 16 వ తేది (సోమవారం) నుండి ఎల్.సి ఎ–625, ఎల్.సి ఎ–657 మరియు ఎల్.సి.ఎ-643 మిరప రకాల ఫౌండేషన్ విత్తనం అమ్మనున్నట్లు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్. సి. వెంకట రమణ తెలియజేశారు.

ఎల్. సి ఎ–643 రకం పచ్చిమిర్చికి, ఎండు మిర్చికి అనువైన రకము. కాయలు లేత ఆకుపచ్చ రంగులో పొడవుగా (13-14 సెం.మీ) ఆకర్షణీయంగా ఉంటాయి. కాయలు ఎండిన తరువాత కొంచెం ముడత కలిగి ఆకర్షణీయమైన ఎరుపు రంగు కలిగి, బ్యాడగి రకం వలె ఉంటాయి. బాగా బెట్టను తట్టుకొంటుంది, కొంతవరకు జెమిని వైరస్ ను కూడా తట్టుకొంటుంది. అంతే కాక నల్లతామర పురుగు ఉధృతి ఉన్న కూడా, కొద్ధి పాటి పురుగు మందుల పిచికారితో, అధిక దిగుబడినివ్వ కలిగిన రకము.

ఎల్. సి ఎ–625 రకము ఎండు మిరపకు అనువైన ఈ రకం, మొక్కలు బలిస్టమైన కొమ్మలతో ఎత్తుగా పెరుగుతాయి. కణుపులు దగ్గరగా ఉండి, కాపు చిక్కగా ఉంటుంది. ప్రధాన పొలంలో నేరుగా ఎద పెట్టడానికి మిక్కిలి అనువైన రకం. కాయలు సన్నగా, మధ్యస్థ పొడవుతో (8-10 సెం. మీ ) ఉంటాయి. తేజ రకాన్ని పోలి ఉంటాయి. పచ్చి కాయలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. సూటి రకాలలో కెల్లా అధిక ఘాటు (45000–50000 ఎస్. హెచ్. యు) మరియు మంచి ఆకర్షణీయమైన ఎరుపు రంగు (60-65 ఎ.ఎస్.టి.ఏ) కలిగిన రకం. కాయ తోలు పలచగా ఉండి, అధిక ఘాటు వలన కాయకుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకొని, తాలు కాయలు చాలా తక్కువుగా వస్తాయి.

ఎల్. సి ఎ–657 రకము తొలకరి తరువాత నేరుగా ఎద పెట్టుకోవడానికి అనువైన జెమిని వైరస్ ను తట్టుకునే రకం. మొక్కలు ఎత్తుగా, దృఢ మైన కాండంతో నిటారైన కొమ్మలు కలిగి, బలమైన వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. కాయలు పొడవుగా (11-12 సెం.మీ), ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి పండినప్పుడు ముదురు ఎరుపు రంగుతో తెల్లటి తొడిమ కలిగి ఆకర్షణీయంగా ఉంటాయి. కాయలు అధిక ఘాటు (50,000-55,000 ఎస్. హెచ్. యు), మంచి రంగును కలిగి ఉంటాయి. అధిక బెట్టను తట్టుకునే రకం.

విత్తనాలు కొనదలచిన రైతులు నేరుగా ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానము, లాం ఫారంలో జూన్ 16 వ తేదీ మొదలు, ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు విత్తనము లభ్యత వున్నంత వరకు పొందవచ్చును. ( రెండవ శనివారం, ప్రతి ఆదివారం శెలవు దినములు). కిలో విత్తనము ధర రూ!! 1,200/- (అక్షరాల ఒక వెయ్యి రెండు వందలు మాత్రమే).

ఈ సందర్బంగా ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానము అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్. సి. వెంకట రమణ గారు మాట్లాడుతూ, పైన తెలియజేసిన మిరప విత్తనాలు కేవలం ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం, లాం ఫారం నందు మాత్రమే పొందగలరని, అవే పేర్లతో బయట ఎవరైనా ఈ విత్తనాలు అమ్మజూపినట్లైతే రైతులు వాటిని ఖరీదు చేసి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు : 99898 09554 / 9440592982.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *