గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 2 నుండి జులై 31 వరకు “ డయేరియా ను ఆపండి ” క్యాంపెయిన్ జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ వైద్య శాఖాధికారులను ఆదేశించారు. సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో అతిసార వ్యాధిని అరికట్టేందుకు రూపొందించిన ప్రచార పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ , డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి, డిఆర్ఓ ఎన్.ఎస్.కే.ఖాజావలి , ఆర్డిఓ శ్రీనివాస రావు , డియం అండ్ హెచ్ ఓ డా. విజయలక్ష్మీ , జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డా. శ్రావణ్ బాబు , ఈడి ఎస్.సి కార్పొరేషన్ శ్రీనివాస్ వైద్య ఆరోగ్య అధికారులతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ మాట్లాడుతూ జిల్లాలో అతిసార వ్యాధిని అదుపు చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధులలో ప్రమాదకరమైన అతిసార వ్యాది పై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. డయేరియాపై అవగాహన కల్పించడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 5 ఏళ్ల లోపు వున్న పిల్లలందరికి ఉచితంగా రెండు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు , 14 జింక్ మాత్రలను పంపిణీ చేయాలన్నారు. జిల్లాలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు , పట్టణ ప్రాంత ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఆశా వర్కర్లు , ఎ ఎన్ ఎం ల ద్వారా పంపిణీ చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అవసరమైన వారికి ఓఆర్ ఎస్, జింక్ మాత్రలను పంపిణీ చేయడంతో పాటు వారికి పరిశుభ్రత , ఆరోగ్య పరి రక్షణ పట్ల అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ఎక్కడా త్రాగునీరు కలుషితం అవ్వ కుండా చూడాలని అధికారులను కోరారు. అనంతరం అంగన్ వాడీ చిన్నారులకు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ జింక్ మాత్రలు , ఓ ఆర్ ఎస్ ప్యాకెట్స్ ను అందిచారు.
ఈ కార్యక్రమంలో డీడీ గ్రౌండ్ వాటర్ వందనం , సిపిఓ శేషశ్రీ , ఎస్.ఈ పంచాయితీ రాజ్ బ్రహ్మయ్య , ఏ.డి హార్టికల్చర్ రవీంద్ర బాబు , జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయి , డిపిఓ బి.వి.నాగ సాయి కుమార్ , కొందారావుపేట యూపీహెచ్సి డా. హమీద్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News