-మామిడికాయల రైతులను ఇబ్బంది పెట్టకండి
-జిల్లా కలెక్టర్ డాక్టర్.ఎస్. వెంకటేశ్వర్
నారాయణవనం, నేటి పత్రిక ప్రజావార్త :
మామిడికాయలు పక్వానికి వచ్చాకే గుజ్జు తయారీ పరిశ్రమల వద్దకు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్. ఎస్.వెంకటేశ్వర్ రైతులకు సూచించారు. మంగళ వారం మధ్యాహ్నం కె.వి.బి.పురం మండల కేంద్రంలోని శ్రీ దేవరాజ ఆగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్,నారాయణవనం లోని టాసా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ,పుత్తూరు మండలం, పరమేశ్వర మంగళం లోని లియోన్ ఫుడ్ ప్రోడక్ట్స్ లకు చెందిన మామిడి పండ్ల గుజ్జు తయారీ పరిశ్రమ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయా పరిశ్రమల కేంద్రాల వద్ద తోతాపురి మామిడికాయలు తీసుకుని వచ్చి వేచి ఉన్న రైతులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,తోతాపురిమామిడికాయలు పక్వానికి వచ్చాకే గుజ్జు తయారీ పరిశ్రమల వద్దకు తీసుకురావాలని రైతులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గుజ్జు పరిశ్రమ తయారీ దారులు ఇచ్చే ధరలతోపాటు ఒక కేజీకి నాలుగు రూపాయల చొప్పున సబ్సిడీని కూడా ప్రభుత్వం రైతులకు అందిస్తుందన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని రైతుల ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతుందన్నారు. అలాగే పరిశ్రమల యాజమాన్యం సైతం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతులు తీసుకువచ్చిన తోతాపూరి మామిడి కాయలను ముందుగా తీసుకు వచ్చిన వారికి ముందుగా టోకెన్లు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎకరాలతో సంబంధం లేకుండా రైతులు పండించిన మామిడికాయలను పూర్తిగా మామిడి గుజ్జు తయారు చేసే పరిశ్రమలు రైతుల నుండి తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రతి పరిశ్రమ వద్ద ఉద్యానవన శాఖ అధికారులను, రెవెన్యూ అధికారులను షిఫ్టుల వారీగా పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు.అలాగే పండ్ల పరిశ్రమల వద్ద రైతులు తీసుకువచ్చిన కాయలకు పూర్తిస్థాయి భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. కొన్ని పరిశ్రమల యాజమాన్యాలు తమ వద్ద సరుకును తీసుకుంటున్నారని, కానీ వారు కేజీకి ఇచ్చే ధరను తెలపడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంలో ప్రతి కేజీకి ₹8 రూపాయలు చొప్పున ధరను చెల్లించాలని రాష్ట్రప్రభుత్వం మామిడిపండ్ల గుజ్జు తయారీ పరిశ్రమ దారులకు తెలియజేసిందని అయితే వారు ప్రస్తుతం ప్రతి కేజీకి ₹6 రూపాయలు చొప్పున ఇస్తున్నారని మరి కొన్ని రోజులలో ప్రభుత్వం చెప్పే ధరకు వారు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.మామిడిపండ్ల గుజ్జు తయారీ పరిశ్రమ దారులవద్ద గత సంవత్సరంలో సేకరించిన మామిడి పండ్ల గుజ్జు నిల్వలు అలానే ఉన్నాయని,అయితే రైతుల ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత పరిశ్రమ యాజమాన్యాలతో మాట్లాడి రైతుల నుండి మామిడికాయలు సేకరించేలా వారిని ఒప్పించిందన్నారు.
ఈ కార్యక్రమంలో కేవీబి పురం ఎంపీడీవో మాలతి, డిటి వసంత రాజ్,ఆర్.ఐ కరుణాకర్, విఆర్వోలు గురు ప్రసాద్, లోకేశ్వరమ్మ,చెంగల్ రాయులు నారాయణవనం మండల ఎంపీడీవో అరుణ,తహసిల్దార్ జయ రాములు, అగ్రికల్చర్ అధికారి శోభారాణి,విఎఏ విష్ణు ప్రియ, విహెచ్ఎ మోహన్ రాజ్,విఆర్వోలు ఓంకార్, పురుషోత్తం, పుత్తూరు ఎంపీడీవో కే. రమేష్,తహసిల్దార్ వెంకటేశ్వర్లు, హార్టికల్చర్ అధికారి సౌజన్య, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News