-విధివిధానాల్ని మార్చాలని ఆదేశించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు ఉచితంగా సరఫరా చేసే మందులకు సంబంధించి ఎటువంటి కొరత లేకుండా చూడాలని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారంనాడు స్పష్టం చేశారు. మందుల కొనుగోలు, వివిధ ప్రభుత్వాసుపత్రులకు వాటిని అందజేసే విషయానికి సంబంధించి పలు అంశాల్ని మంత్రి నేడు రెండు గంటల పాటు మంగళగిరిలోని ఎపిఎంయస్ ఐడిసి కార్యాలయంలో సమీక్షించారు. వివిధ ప్రభుత్వాసుపత్రుల డిమాండ్ మేరకు మందుల కొనుగోలు, వాటిని సరఫరా చేసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఎపిఎంఎస్ ఐడిసి) అనుసరిస్తున్న విధానాలపై ఆయన విస్తృతంగా చర్చించారు.
మందుల సరఫరాలో మెరుగుదల
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు పలు కారణాల వల్ల 150కి పైగా మందుల లభ్యతలో కొరత ఉండేదని , తాజాగా కేవలం 9 మందుల విషయంలోనే కొంత కొరత ఎదురవుతోందని అధికారులు మంత్రికి వివరించారు. మందుల డిమాండ్ పై రోగుల వైఖరిలో మార్పు వచ్చిందని, ఈ కారణంగా కొంత కొరత ఎదురవుతోందని అధికారులు చెప్పారు. మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులకు సంబంధించి రోగులు విడివిడి మందులను కాకుండా ఎక్కువగా కాంబినేషన్ మందుల్ని కోరుతున్నారని వారు వివరించారు. ఆసుపత్రుల డిమాండ్ మేరకు మందులు కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నామని, అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిల్లో వాటి వినియోగం మరియు నిల్వలకు సంబంధించి సరైన సమాచారం అందించడంలో జాప్యం జరుగుతోందని, స్టాకు రిజిస్టర్లను బట్టి వైద్యాధికారులు మందులు రాయకుండా వేరే మందుల్ని రాయడం కూడా కొరత ఉందన్న వాతావరణం ఏర్పడుతోందని అధికారులు మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు వివరించారు. రోగులు ఎక్కువగా వాడే సిట్రజిన్ వంటి మందుల స్థానంలో లివోసిట్రజిన్ వంటి రోగుల అనుకూల మందుల్ని డిఎంఇ అధికారులు చేసిన సూచనల మేరకు సరఫరా చేస్తున్నామని, అయితే వైద్యాధికారులు పాత మందుల్నే సూచించడంతో కూడా కొంత మేరకు కొరత ఉందన్న భావన ఏర్పడుతోందని అధికారులు తెలిపారు.
ప్రభుత్వాసుపత్రుల్లో మొత్తం 712 రకాల మందుల అవసరాల్ని గుర్తించగా, ఎపిఎంయస్ ఐడిసి 650 మందుల్ని కొనుగోలు చేస్తోందని, తక్కువ మోతాదులో అవసరమయ్యే 56 రకాల మందుల్ని ఆసుపత్రుల స్థాయిల్లో సమీకరించుకుంటున్నారని అధికారులు మంత్రికి వివరించారు.
మంత్రి ఆదేశాలు
ఆయా ఆసుపత్రుల అధికారులు తమ అవసరాల్ని సూచించడం, ఆమేరకు ఎపిఎంయస్ఐడిసి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించి వాటిని ఆసుపత్రులకు అందించే వరకూ ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రక్రియను మంత్రి వివరంగా సమీక్షించారు. ఈ ప్రక్రియలో ఎట్టి జోక్యానికీ తావులేకుండా ప్రతి త్రైమాసికానికి అవసరమయ్యే మందుల్ని సరైన సమయంలో కొనుగోలు చేసి, సరఫరా చేసే విధంగా చర్యల్ని చేపట్టాలని మంత్రి ఆదేశించారు. రోగుల డిమాండ్ మేరకు మందుల సూచీ పట్టికలో మార్పులు చేసి వారు కోరుకుంటున్న మందులు లభ్యమయ్యేలా విధివిధానాల్ని మార్చాలని మంత్రి సూచించారు. వివిధ స్థాయిల్లో మందుల నిల్వల సమాచారం, అవసరాల్ని నిరంతరం పరిశీలిస్తూ తగు విధంగా మందుల్ని కొనుగోలు చేయాలని మంత్రి అధికారుల్ని ఆదేశించారు. కారణాలేవైనా ప్రజలు నిత్యం వాడే మందుల సరఫరాలో ఎటువంటి కొరతా ఉండకుండా తగు పటిష్టమైన చర్యల్ని చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
మౌలిక వసతుల కల్పన
రాష్ట్రంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల భవనాల నిర్మాణం, వివిధ ఆసుపత్రుల విస్తరణ మరియు అభివృద్ధి పనులు, పాత మరియు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల పనుల పురోగతికి సంబంధించిన విషయాల్ని కూడా మంత్రి చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లుల చెల్పింపులో ఆలస్యం వల్ల పనుల్లో జాప్యం జరిగిందని, ప్రస్తుతం పరిస్థితి చాలా మెరుగుపడడంతో పనుల్ని పునప్రారంభించడానికి కాంట్రాక్టర్లు ముందుకొస్తున్నారని అధికారులు వివరించారు.
ఈ సమావేశంలో ఎపి ఎంఎస్ఐడిసి ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, మేనేజింగ్ డైరెక్టర్ గిరీశ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News