-బహిరంగ సభ
-కార్మిక సంఘాల నిర్ణయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా జూలై 9 సమ్మెలో భాగంగా విజయవాడ నగరంలోని వన్ టౌన్ రథం సెంటర్ నుంచి లోబ్రిడ్జి మీదుగా, ఏలూరు రోడ్డు మీదగా, లెనిన్ సెంటర్ వరకు కార్మికుల, రైతుల భారీ ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు సోమవారం బిఆర్ టిఎస్ రోడ్ లోని సిఐటియు నగర కార్యాలయంలో జిల్లా కార్మిక సంఘాల నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని యూనియన్లు కలిసి సంయుక్తంగా వేలాదిమంది కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, వివిధ చేతి వృత్తులు, ఉపాధి హామీ కూలీలతో పెద్ద ఎత్తున వేలాది మందితో ప్రదర్శన అనంతరం బహిరంగ సభ నిర్వహించాలని జిల్లా నాయకత్వం నిర్ణయించింది. ఉదయం 9 గంటలకు రధం సెంటర్లో ప్రదర్శన ప్రారంభమవుతుందని, అన్ని యూనియన్లు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. నాలుగు లేబర్ కోడ్లు, నూతన వ్యవసాయ మార్కెట్ విధానానికి వ్యతిరేకంగా, కౌలు రైతు చట్టం, రుణ విమోచన చట్టం, అన్ని పంటలకు కనీస గిట్టుబాటు ధర చట్టం, కనీస వేతన చట్టం తదితర అంశాలు చట్టబద్ధం చేయాలని కోరారు. బడా కార్పొరేట్ కంపెనీలకు లాభాలు దోచి పెట్టేందుకు చట్టాలు చేయడం కాదని, కార్మిక, రైతు, కౌలు రైతు, వ్యవసాయ కూలీల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం పాటుపడాలని, వారి జీవనోపాధి కోసం, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వాలు పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో బిజెపి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తన నిజస్వరూపాన్ని బట్టబయలు చేసిందని స్వదేశీ, విదేశీ బడా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తుందని, పెట్టుబడిదారుల సేవలో పునీతమైపోయిందని విమర్శించారు. కార్మికుల చట్టాలను, కనీస వేతనం 26 వేలు, రైతులకు పంటలకు కనీస గిట్టుబాటు ధరను గాలికి వదిలేసిందని విమర్శించారు. ప్రజల శ్రమతో, సృష్టించబడిన సంపదని, ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటుకరించడాన్ని, కారు చౌకగా బడా కంపెనీలకు కట్టబెట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కానీ 10 గంటల పని విధానం అమలు చేయటానికి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఒక అడుగు ముందుకు వేయటాన్ని తప్పు పట్టారు. పని గంటల పెంచడం, అదనపు గంటలు కూడా పని చేయవచ్చని, మహిళలు కూడా రాత్రులు విధులు నిర్వహించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయటాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పై ప్రజా వ్యతిరేక, రైతు, ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జులై 9న సమ్మె చేపట్టాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని వివరించారు. ఈ సమావేశంలో ఏఐటియూసి నగర ప్రధాన కార్యదర్శి మూలీ సాంబశివరావు, నగర అధ్యక్షులు ఆంజనేయులు, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎ. వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కే దుర్గారావు, ఇఫ్టూ నగర కార్యదర్శి మునిశంకర్, టీయుసిఐ రాష్ట్ర అధ్యక్షులు మరీదు ప్రసాద్ బాబు, ఏఐసీసీటిటుయు నగర నాయకులు ఈశ్వర్, ఇఫ్టూ జిల్లా ఉపాధ్యక్షులు రవీంద్ర, ఏఐఎఫ్ టియు(న్యూ) నగర నాయకులు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News