-శుద్ధి, సరఫరా వ్యవస్థలో ఎక్కడా లోపాలు ఉండకూడదు
-కలుషితం కాకుండా పటిష్ట పర్యవేక్షణ ముఖ్యం
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షాకాలం నేపథ్యంలో నగర ప్రజలకు సరఫరా చేసే తాగునీటి శుద్ధి, నాణ్యతా ప్రమాణాలు, సరఫరా వ్యవస్థలో ఎక్కడా లోపాలు ఉండకూడదని, ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ లక్ష్మీశ విజయవాడ నగరపాలక సంస్థ డా. కేఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్‌ను సందర్శించి నీటి శుద్ధి, పంపిణీ విధానాన్ని పరిశీలించారు. సమర్థ నిర్వహణ వివరాలతో పాటు ఆధునిక మౌలిక వసతులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. 5 ఎంజీడీ ఇన్‌టేక్ వెల్, ఫిల్టరేషన్ ప్లాంట్, క్లారిఫ్లోక్యులేటర్, క్లోరినేషన్ ప్లాంట్, పంప్ హౌజ్ తదితరాల పనితీరును పరిశీలించారు. రెసిడ్యూల్ క్లోరిన్ పరీక్ష తీరుతెన్నులను పరిశీలించారు. నీటి శుద్ధికి కలుపుతున్న ఆలం పరిమాణం వంటి విషయాలను అధికారులు వివరించారు. రోజుకు 210 ఎంఎల్‌డీ తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సురక్షిత తాగునీరు ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత కీలమని.. తాగునీరు శుద్ధి, సరఫరా వ్యవస్థలో ఎక్కడా నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. పైపుల లీకేజీ వంటివాటివల్ల నీరు కలుషితమైతే డయేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదముందని.. ప్రత్యేక బృందాలు నిరంతర తనిఖీలతో మొత్తం నీటి సరఫరా వ్యవస్థను పర్యవేక్షించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. పర్యటనలో కలెక్టర్ వెంట విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ ఇంజనీర్ ఆర్.శ్రీనాథ్ రెడ్డి, పర్యవేక్షణ ఇంజనీర్ పి.సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి ఉన్నారు.
Prajavartha Online Telugu News