ఆత్కూరు(ఉంగుటూరు), నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గవర్నర్ జిల్లా పర్యటనకు పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. ఈ నెల 24వ తేదీన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉంగుటూరు మండలం, ఆత్కూరు గ్రామంలోని స్వర్ణ భారత్ ట్రస్టులో జరగనున్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ 57వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఏఎస్పీ సత్యనారాయణ, రాష్ట్ర గవర్నర్ ఎడిసి మేజర్ అమన్ దీప్ సింగ్, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ జి రామచంద్రరావు ఇతర అధికారులతో కలసి పరిశీలించారు. ఆ రోజు రాష్ట్ర గవర్నర్ స్వర్ణ భారత్ ట్రస్టు వెలుపల పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆడిటోరియంలోనికి ప్రవేశిస్తారని, అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద విశ్వవిద్యాలయ ఉపకులపతి, బోర్డు సభ్యులు, ప్రొఫెసర్లు, ముఖ్యఅతిథి తదితరులతో గ్రూప్ ఫోటో దిగుతారని తెలిపారు. అనంతరం ఆయన అక్కడ నుంచి బ్యాండ్ మేళంతో ఊరేగింపుగా ప్రధాన వేదిక వద్దకు చేరుకుంటారని, డిగ్రీలు పూర్తి చేసుకున్న పీజీ, యూజీ విద్యార్థులకు పట్టాలు అందించడం, రాష్ట్ర గవర్నర్, ముఖ్య అతిథి ప్రసంగం ఉంటాయన్నారు.
కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ, గవర్నర్కు గ్రీన్ రూమ్ ఏర్పాటు, వేదికపైన సీటింగ్, వేదిక అలంకరణ, పిఏ సిస్టం, ఎల్ఈడి స్క్రీన్లు, లైవ్ కవరేజ్, ఇంటర్నెట్ తదితర అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమానికి ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ట్రస్టు ఆవరణలో వైద్య శిబిరంతో పాటు అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఆడిటోరియం వెలుపల విద్యార్థుల తల్లిదండ్రులు కార్యక్రమాన్ని వీక్షించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఈ సందర్భంగా సూచించారు.
జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వెంట గుడివాడ ఆర్డిఓ జి బాలసుబ్రమణ్యం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ శర్మిష్ఠ, అగ్నిమాపక శాఖ అధికారి యేసురత్నం, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి షేక్ షాహిద్ బాబు, డీఎస్పీ శ్రీనివాసరావు, ఇతర శాఖల అధికారులు, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News