Breaking News

నాతవరం మండలంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు 

అనకాపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
అనకాపల్లి జిల్లా, నాతవరం మండలం, గునుపూడి గ్రామంలో శుక్రవారం పింఛన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్వయంగా లబ్ధిదారులవద్దకు వెళ్లి, తమ చేతులమీదుగా పింఛన్లు అందజేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఏ ఇతర రాష్ట్రంలో జరగని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  నాయకత్వంలో మన రాష్ట్రంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతోంది” అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి విషయాన్ని ప్రస్తావిస్తూ, రెండు రోజుల క్రితం రూ.11 కోట్లు బయటపడిన ఉదాహరణను సూచించారు. మద్యం కుంభకోణంలో మొత్తం రూ.10వేల కోట్ల వరకు నిధులు దారి మళ్లించబడ్డాయని ఆరోపించారు. గత ప్రభుత్వ కాలంలో రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో, నూతన ప్రభుత్వం ఆర్థికంగా కష్టపడాల్సి వస్తోందని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 14 వేల పంచాయతీల్లో పింఛన్లు పంపిణీ జరుగుతున్నాయని, ఈ నెలలో మొత్తం 64 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.2,750 కోట్లు ఖర్చు చేస్తోందని వివరించారు. నర్సీపట్నం నియోజకవర్గంలో 41,882 మంది లబ్ధిదారులకు రూ.18 కోట్లు, నాతవరం మండలంలో 11,093 మందికి రూ.4.62 కోట్లు ఖర్చవుతోందన్నారు. ప్రత్యేకంగా గునుపూడి గ్రామంలోనే 716 మందికి రూ.27.63 లక్షలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల వితంతు మహిళలకు రూ.700 కోట్లు, కొత్తగా అర్హత పొందిన 1.08 లక్షల మందికి రూ.43.40 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. ఈ కొత్త లబ్ధిదారుల్లో నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన 750 మందికి రూ.30 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు.

ఇదిలా ఉండగా, అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో మొత్తం రూ.20 వేలు జమ అవుతాయని చెప్పారు. ఇందులో రూ.14వేలు రాష్ట్ర ప్రభుత్వం, రూ.6వేలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇది మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుందన్నారు. జిల్లాలో మొత్తం 2.31 లక్షల మందికి రూ.161 కోట్లు, నాతవరం మండలంలో 10,596 మందికి రూ.7.42 కోట్లు అందజేస్తున్నట్లు వివరించారు.

గ్రామ అభివృద్ధి కోణంలో కూడా స్పీకర్ స్పష్టమైన హామీలు ఇచ్చారు. గునుపూడిలో రోడ్ల నిర్మాణానికి ఇప్పటికే రూ.49.55 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. తాండవ ప్రాజెక్టుకు ఈ ఏడాది రూ.8 కోట్లు మంజూరు చేయించామని, మరిన్ని నిధులు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అనంతరం స్పీకర్ గారు అకస్మికంగా గునుపూడి జడ్పీ హైస్కూల్‌ను సందర్శించి, పాఠశాల పరిస్థితిని పరిశీలించారు. విద్యార్థులకు కావలసిన వాలీబాల్ కోర్టు, కబడ్డీ కోర్టు, ఆట వస్తువులు తానే స్వయంగా అందిస్తానని చెప్పారు. స్కూల్ టాయిలెట్లకు అవసరమైన 16 తలుపులు, స్కూల్ పెయింటింగ్ కోసం నిధులు, విద్యార్థుల కోసం 10 స్టడీ టేబుల్స్ మంజూరు చేస్తానని ప్రకటించారు. తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ, గ్రామస్తుల సహకారంతో మరో 10 టేబుల్స్ అందించనున్నట్లు తెలిపారు.

స్పీకర్ తన ప్రసంగం చివరిలో, “ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడం ప్రతి నాయకుని బాధ్యత” అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ,నందిపల్లి వెంకట రమణ , నియోజకవర్గం జన సేన ఇంచార్జ్ నాయకులు సూర్య చంద్ర,నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణ, నాతవరం తహసీల్దారు వేణుగోపాల్ ,నాతవరం మండల అభివృద్ధి అధికారిని,మాజీ ఎంపీపీ లు కొండబాబు ,విజయ్ కుమార్ గునుపూడి గ్రామ టీడీపీ అధ్యక్షులు ఎస్ స్వామి నాయుడు తెలుగు యువత మండల అధ్యక్షులు శెట్టి లోవ,వెలగల వెంకటరమణ ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య వివిధ గ్రామాలనుండి టీడీపీ నాయకులు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *