Breaking News

అల్బెండ‌జోల్‌తో నులి పురుగుల ఆట‌క‌ట్టు

– ఆదిలోనే నిర్మూలన‌కు సుర‌క్షిత‌మైన మార్గం
– అందుకే చిన్నారులు, కిశోర బాల‌లు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి
– నులి పురుగుల‌తో ర‌క్త‌హీన‌త‌, పోష‌కాల లోపాలు
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నులి పురుగులు పిల్ల‌లు, కిశోర బాల‌ల్లో ర‌క్త‌హీన‌త‌, పోష‌కాల లోపాల‌కు కార‌ణ‌మ‌వుతాయ‌ని.. అందుకే అల్బెండ‌జోల్ మాత్ర‌ను తీసుకోవ‌డం ద్వారా ఆదిలోనే వాటిని నిర్మూలించ‌వ‌చ్చ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.
విజయవాడ పటమటలంకలోని కొమ్మా సీతారామయ్య జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూల‌న కార్య‌క్ర‌మం జ‌ర‌గ్గా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారుల‌తో క‌లిసి చిన్నారుల‌కు స్వ‌యంగా అల్జెండ‌జోల్ మాత్ర‌లు పంపిణీ చేశారు.
ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ నులి పురుగులు శారీర‌క ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్యాన్నీ దెబ్బ‌తీస్తాయ‌ని.. ఈ ప‌రిస్థితి చ‌దువుపైనా స‌మ‌గ్ర వికాసంపైనా ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంద‌ని పేర్కొన్నారు. అనేక రకాల అనారోగ్యాలకు కారణమవుతున్న నులి పురుగులను కేవలం ఒకే ఆల్బెండజోల్ మాత్రతో నివారించ వచ్చ‌ని.. నులిపురుగుల నిర్మూల‌న ద్వారా పోష‌కాల లోపం, అల‌స‌ట‌, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టొచ్చ‌న్నారు. అందువ‌ల్ల ఒక సంవత్సరం నిండిన పిల్లల నుంచి 19 సంవత్సరాల వ‌ర‌కు అంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా అల్బెండ‌జోల్ మాత్ర‌లు తీసుకోవాల‌ని సూచించారు. మంగ‌ళ‌వారం అల్బెండ‌జోల్ మాత్ర‌లు పంపిణీ చేశామ‌ని.. ఇంకా ఎవ‌రైనా వివిధ కార‌ణాల వ‌ల్ల మాత్ర తీసుకోకుండా ఉండిపోతే వారికి ఈ నెల 20 వ తేదీన స్పెష‌ల్ డ్రైవ్ చేప‌ట్టి మాత్ర‌లు ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. నులిపురుగుల సంక్ర‌మ‌ణాన్ని త‌గ్గించేందుకు డీవార్మింగ్‌కు అద‌నంగా పాటించాల్సిన విష‌యాల‌ను కూడా వివ‌రించారు. శుభ్ర‌మైన నీటిని తాగ‌డం, చేతుల‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవ‌డం వంటివాటిని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ చిన్నారుల‌కు తెలియ‌జెప్పారు.
రాష్ట్ర ఆర్‌కేఎస్‌కే, ఐఈసీ ప్రోగ్రామ్ అధికారి డా. నిర్మ‌లా గ్లోరి, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని.. అల్బెండ‌జోల్ మాత్ర‌ల ప్ర‌యోజ‌నాల‌ను వివ‌రించారు. ఏడాదికి రెండుసార్లు పిల్ల‌లు, కిశోర బాల‌ల‌కు అల్బెండ‌జోల్ మాత్ర‌ల‌ను పంపిణీ చేస్తున్న‌ట్లు తెలిపారు. పీహెచ్‌సీలు, అంగ‌న్వాడీ కేంద్రాలు, విద్యాసంస్థ‌ల్లో గోడ‌ప‌త్రిక‌ల ద్వారా నులి పురుగుల నిర్మూల‌న కార్య‌క్ర‌మంపై అవ‌గాహ‌న క‌ల్పించి.. పాఠ‌శాల‌లు, జూనియ‌ర్ క‌ళాశాల‌లు, ఐటీఐ, పాలిటెక్నిక్‌, న‌ర్సింగ్ త‌దిత‌ర విద్యార్థుల‌కు నులి పురుగుల మాత్ర‌ల‌ను ఉచితంగా పంపిణీ చేయ‌డం జ‌రుగుతోందని వివ‌రించారు.
కార్య‌క్ర‌మంలో ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రామ్ అధికారి డా. మాధ‌వి, పీడియాట్రిష‌న్ డా. ర‌వితేజ‌, ల‌బ్బీపేట యూపీహెచ్‌సీ మెడిక‌ల్ ఆఫీస‌ర్ డా. భార్గ‌వి, హైస్కూల్ హెచ్ఎం పద్మ‌ల‌త త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *