– ప్రకృతితో మమేకమవుతూ పండగను జరుపుకునేలా ప్రోత్సహించేందుకే
– ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్లు భాగస్వామ్యం కావాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ హితంగా పండగలను జరుపుకునేలా ప్రజలను జాగృతం చేసే లక్ష్యంతో ఈ నెల 26న మంగళవారం మట్టి, ఇతర ఎకో ఫ్రెండ్లీ వినాయక ప్రతిమల తయారీతో ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సోమవారం కలెక్టరేట్లో సమన్వయ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని.. దాదాపు అయిదు వేల పర్యావరణ హిత వినాయక ప్రతిమలను తయారు చేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. వినాయక చవితి ఉత్సవాల్లో మట్టి ప్రతిమలు, ఎకో ఫ్రెండ్లీ ప్రతిమలను పూజించి ప్రకృతి శోభతో ఆధ్యాత్మిక వాతావరణంలో పండగను జరుపుకునేలా ప్రోత్సహించేందుకు కాలుష్య నియంత్రణ మండలి, విజయవాడ నగరపాలక సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ రికార్డుకు సన్నద్ధమవుతున్నట్లు వివరించారు. మన మనుగడతోపాటు భావితరాలకు మేలుచేసే ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ అసోసియేషన్లు భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు.
ఇగ్నైట్ యాప్‌లోనూ అప్లోడ్ చేయొచ్చు:
ప్రజలు కూడా తమ ఇళ్లవద్దే మట్టి లేదా ప్రకృతిలో సహజసిద్ధంగా లభ్యమయ్యే వాటితో వినాయక ప్రతిమలను తయారుచేసి వాటి ఫొటోలను NTR IGNITE యాప్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకొని అప్లోడ్ చేయొచ్చని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. మెదడుకు పదును పెడుతూ కొందరు సృజనాత్మకంగా రకరకాల గింజలు, ఆకులు, కూరగాయలు వంటివాటిని ఉపయోగించి ప్రతిమలు తయారు చేస్తున్నారని.. వీటి ఫొటోలను కూడా అప్లోడ్ చేయాలని సూచించారు. మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం.. నినాదంతో చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News