-నేత్రదాన ప్రతిజ్ఞాపత్రం పై సంతకం చేసిన జిల్లా కలెక్టర్
-జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛందంగా నేత్రదానం చేయడానికి ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా గురువారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ వారి ఛాంబర్లో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి జాతీయ నేత్ర దాన పక్షోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేత్రదానానికి సంబంధించిన ప్రతిజ్ఞా పత్రం పై నేత్రదానానికి స్వచ్ఛందంగా అంగీకారం తెలుపుతూ సంతకం చేసి ఎస్వీ మెడికల్ కాలేజ్ మరియు రుయా ఆసుపత్రి నేత్ర విభాగపు అధిపతికి అందించారు. జిల్లా కలెక్టర్ తో పాటు వారి తండ్రి గారి నేత్రాలను సైతం వారి మరణాంతరం అందించేలా ప్రతిజ్ఞా పత్రం పై సంతకం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ..నేత్రదానం చేయడం ద్వారా మరో ఇద్దరికి కంటిచూపు లభిస్తుందన్నారు. అందుకనే తాను,తన తండ్రి గారి నేత్రాలను సైతం తమ మరణానంతరం ఐ బ్యాంకుకు అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగిందన్నారు. పోగొట్టుకున్న కంటి చూపును చికిత్స చేయడం ద్వారా తిరిగి పొందవచ్చునని, ఇందుకుగాను దానం చేయబడిన నేత్రం ద్వారా కార్నియా మార్పిడి చేయబడుతుందన్నారు. కావున నేత్రదానానికి సంబంధించి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వవచ్చునన్నారు. అలాగే నేత్రదానాన్ని కుటుంబం సంప్రదాయంగా చేసుకోవాలని తద్వారా మరో ఇద్దరికి కంటి చూపును అందించే అవకాశాన్ని కల్పించినట్లు అవుతుందని కలెక్టర్ తెలిపారు. ఈనెల 25 వ తేదీ నుండి సెప్టెంబర్ 8వ తేదీ వరకు నిర్వహిస్తున్న జాతీయ నేత్ర దాన పక్షోత్సవాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని నేత్రదాన విశిష్టతను తెలుసుకుని, తాము నేత్ర దానం చేయడమే కాకుండా తమ తోటి వారిని సైతం మరణానంతరం వారి నేత్రాలను దానం చేసేలా ప్రోత్సహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ ఓ డాక్టర్. బాలకృష్ణ నాయక్, ఎస్.వి.ఆర్.ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాధా, ఎస్వి మెడికల్ కాలేజ్ మరియు రుయా ఆస్పత్రి కంటి విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్. పి ఏ ఎస్ చలపతి రెడ్డి, ఐ బ్యాంక్ టెక్నీషియన్ రమేష్, ఇతర అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News