Breaking News

రాష్ట్రానికి పట్టిన చీడపురుగు జగన్

– నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారి కోసం నారా లోకేశ్ కృషి అభినందనీయం
– తెలుగువారికి ఏ కష్టమొచ్చినా తెలుగుదేశం ముందుంటుంది
– సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ విజయవంతంతో కుట్రలకు తెరలేపాడు
– రైతులకు అవసరం మేరకు ఎరువులు సరఫరా చేస్తున్నాం
– టెండర్లు రద్దు చేస్తాం, కూలగొడతామనడం జగన్ పైశాచికత్వానికి పరాకాష్ట
– ప్రభుత్వంపై జగన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మంత్రి కొల్లు రవీంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండేందుకు కనీస అర్హత కూడా లేదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. మేము అధికారంలోకి వస్తే టెండర్లు రద్దు చేస్తాం. పెట్టుబడుల్ని తరిమేస్తాం. కూల్చేస్తామని జగన్ రెడ్డి వ్యాఖ్యానించడం అత్యంత హేయం. ఇలాంటి కౄర మనస్తత్వం కలిగిన వ్యక్తికి ప్రజా క్షేత్రంలో ఉండే అర్హత లేదన్నారు. జగన్ రెడ్డి నిర్వాకం కారణంగానే అమరావతి, పోలవరం లాంటి పనులు పడకేశాయన్నారు. ఇప్పుడు వాటి వ్యయం పెరిగి రాష్ట్రానికి భారంగా మారిందన్నారు. ఈ మేరకు విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభ సూపర్ డూపర్ హిట్ అయింది. అది చూసి తట్టుకోలేక కూటమి ప్రభుత్వంపై జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు.

తెలుగువారికి ఏ కష్టమొచ్చినా ముందుండేది తెలుగుదేశం జెండా
భారత ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన సి.పి.రాధాకృష్ణన్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్‌లో నెలకొన్న విపత్కర పరిస్థితుల కారణంగా అక్కడ చిక్కుకున్న తెలుగువారిని స్వస్థలాలకు రప్పించేందుకు మంత్రి నారా లోకేశ్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నవారికి భరోసానిస్తూ స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలన్నీ ఫలించాయి. సుమారు 215 మంది తెలుగువారు ఇళ్లకు చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘సూపర్ సిక్స్.. సూపర్ హిట్’ కార్యక్రమాన్ని పక్కన పెట్టి ప్రజలే తనకు ముఖ్యమని కదిలిన విధానం హర్షణీయం. ప్రజల కోసం ఇంతగా తపించిన మంత్రి నారా లోకేశ్, వారి టీం మొత్తానికి హృదయపూర్వక ధన్యవాదాలు.

తెలుగు వారి సంక్షేమమే తెలుగుదేశం పార్టీకి ముఖ్యమని ఇప్పటికే ఎన్నో సార్లు నిరూపించాం. గతంలో ఉత్తరాఖండ్ వరదల సమయంలో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయించి స్వస్థలాలకు రప్పించాం. ఒడిశా తుపాను సమయంలో నిరూపించారు. ఒకప్పుడు హుదూద్, తిత్లీ తుపాన్ల సమయంలో క్షేత్రస్థాయిలో చంద్రబాబు పనితీరును ప్రజలంతా కళ్లారా చూశారు. ఆపదలో ఉన్న తెలుగువారిని ఆదోకోవడంతో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందని తాజా ఘటనతో మరోసారి నిరూపించామని తెలిపారు.

ప్రజలు సంతోషంగా ఉంటే జగన్ రెడ్డికి నచ్చదు
కూటమి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఏడాది కాలంలోనే అమలు చేశాం. ప్రజలు సంతోషంగా ఉండడం నచ్చక.. కూటమి ప్రభుత్వంపై జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడు. పరదాలు అడ్డు పెట్టుకుని, బారికేడ్లు కట్టుకుని నాడు జగన్ రెడ్డి తిరిగితే.. చంద్రబాబు, కూటమి నాయకులు ప్రజల మధ్యన తిరుగుతున్నారు. కూటమి గురించి మాట్లాడే కనీస అర్హత కూడా జగన్ రెడ్డికి లేదు.

ఎరువుల పేరుతో రైతుల్లో భయాందోళనలు రేకెత్తించేందుకు జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. గతేడాది సెప్టెంబర్‌లో 5.06 లక్షల మెట్రిక్ టన్నులు వినియోగిస్తే. ఈ సంవత్సరం ఇప్పటికే 6.12 లక్షల మెట్రిక్ టన్నులు పంపిణీ చేశాం. మరో 80వేల మెట్రిక్ టన్నులు అవసరమని, ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయన్నారు. సాగుకు ముందే రైతులకు ఎరువులు పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. జగన్ రెడ్డికి, వారి బులుగు బ్యాచ్ మొత్తానికి ప్రతి విషయంలో రాజకీయం చేయడం తప్ప ఇంకేమీ తెలియదని ఎద్దేవా చేశారు. గతంలో మామిడి, మిర్చి, పొగాకు రైతుల నుండి పంట మొత్తాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచాం.

సంక్షేమ పథకాలన్నీ హామీ మేరకు అమలు చేశాం. పెన్షన్లు, ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం లాంటి పథకాలన్నీ అమలు చేశాం. దసరా నాటికి ఆటో సోదరులకు రూ.15 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించబోతున్నాం. మహిళలను ఆర్ధికంగా భరోసా కల్పించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలు రచిస్తున్నాం.

రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో అడుగులు వేస్తున్నాం. 16,800 మందికి ఉపాధ్యాయ పోస్టులు కల్పించాం. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఐటీ, పర్యాటక రంగాల్లో ప్రత్యేకంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు తిరగబడి కొడతారని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

పీపీపీ మోడల్‌లో మెడికల్ కాలేజీలు అభివృద్ధి చేస్తాం
మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తుంటే దాన్ని అమ్మేస్తున్నారంటూ వైసీపీ నేతలు నీచమైన రాజకీయానికి తెరలేపారు. రాష్ట్రంలో 22 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు గారిదే. 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశానని చెబుతున్న జగన్ రెడ్డి.. అవి ఎక్కడున్నాయో చూపించడానికి సిద్ధమా? ఒక్క కాలేజీని కూడా పూర్తి చేయకుండా.. అంతా మేమే చేశామని చెప్పుకోవడానికి సిగ్గుచేటు. మచిలీపట్నం మెడికల్ కాలేజీని ఐదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలి. కనీసం పునాదులు కూడా లేని మెడికల్ కాలేజీలను పూర్తి చేశానని చెప్పుకోవడానికి జగన్ రెడ్డి వారి బ్యాచ్ సిగ్గుపడాలి.

పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేసి.. అక్కడ పేదలకు నాణ్యమైన వైద్య విద్య, ఉచిత వైద్యం అందించడం కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. మెడికల్ కాలేజీలను అడ్డం పెట్టుకుని రూ.6000 కోట్లు అప్పులు చేసి కాలేజీ పనుల్ని గాలికొదిలేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. సేవా భావంతో ముందుకు వచ్చే వారికే ఈ పనులు అప్పగించేలా ఆలోచన చేస్తుంటే విమర్శలు చేయడానికి బుద్ధి ఉందా అని నిలదీశారు.

గతంలో పీజీ సీట్లను దూరం చేసింది, పీజీ సీట్ల పేరుతో నిధులు దారి మళ్లించిన హీనమైన చరిత్ర జగన్ రెడ్డిదే. ప్రజల్ని రెచ్చగొట్టాలనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని గుర్తుంచుకోవాలి. నూతిలో తోయాలని మాట్లాడుతున్న జగన్ రెడ్డికి చెబుతున్నా.. ప్రజలు ఇప్పటికే వైసీపీని గోతిలో పడేసి పూడ్చిపెట్టారు. ఇలాంటి నీచమైన ఆలోచనలు చేస్తే మరింత కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

దేవాలయ ఆస్తులపై జగన్ రెడ్డి నీచ రాజకీయం
మచిలీపట్నంలోని గొడుగుపేట వెంకటేశ్వర స్వామివారి భూముల్ని ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తోందని వైసీపీ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటు. విజయవాడ ఫెస్ట్ కోసం దేవాలయ భూములను 40రోజులు వాడుకుంటామని, అందుకు సొమ్ము చెల్లిస్తామని ముందుకొచ్చారు. దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలోనే జరిగిన ఒప్పందంపైనా బురద జల్లేలా వ్యాఖ్యానించడం దుర్మార్గం.

చెప్తే వినరు.. గిల్లితే ఏడుస్తారు అనేలా వైసీపీ నేతల వైఖరి ఉంది. పవన్ కల్యాణ్ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసిన వారిని అడ్డుకోవాల్సింది పోయి.. వారి అభిమానులు తిరగబడితే ఏదో జరిగిపోతోందని రాద్దాంతం చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై రౌడీలతో దాడి చేయించి బీపీ పెరిగి చేశారన్నారు. కూటమి నాయకులంతా సమన్వయంతో ఉండడం కారణంగానే వైసీపీ నేతలు ఇంకా రోడ్లపై తిరుగుతున్నారు. ప్రజలు చీత్కరించినా వైసీపీ నేతలకు ఇంకా సిగ్గు రాలేదు.

గతంలో అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పేరుతో మద్యం డిపోలను తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్ల వరకు జగన్ రెడ్డి అప్పులు తెచ్చాడు. నాటి పాపాల ఫలితంగానే నేడు ఎక్సైజ్ శాఖ ఇబ్బందులు ఎదుర్కొంటోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *