నగరి, నేటి పత్రిక ప్రజావార్త :
నగరి నియోజకవర్గం, పుత్తూరు మండలం, తోరూర్ గ్రామంలోని ఎంపీఎస్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ క్లస్టర్ లో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర హస్తకళల నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని క్లస్టర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా క్లస్టర్ వ్యవస్థాపకురాలు చంద్రకళ, ఆమె కుమారులు వంశీకృష్ణ, పవన్ కృష్ణ లతో పాటు మహిళా కళాకారులు, ఇతర కళాకారులను కలిసారు. ప్రస్తుతం ఈ క్లస్టర్ ద్వారా దాదాపు 100 కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది. వంశీకృష్ణ, పవన్ కృష్ణలు ఉన్నత విద్య (MBA, ఇంజనీరింగ్) పూర్తి చేసుకున్నా కూడా విదేశాలకు వెళ్లకుండా స్వగ్రామంలోనే స్థిరపడి తండ్రి వృత్తిని కొనసాగిస్తూ, స్థానికులకు ఉపాధి కల్పించడం విశేషం. కళాకారులు కలపను సరసమైన ధరలకు ప్రభుత్వం అందించాలి, లేపాక్షి ద్వారా తమ ఉత్పత్తులకు మరింత ప్రమోషన్ ఇవ్వాలని తమ సమస్యలను చైర్మన్ కి వివరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ “ప్రస్తుతం 100 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఈ వృత్తి 500 నుండి 1000 కుటుంబాలకు విస్తరించేలా ప్రభుత్వం సహకరించాలి. హస్తకళలను పరిరక్షించడం, కళాకారులను ఆదుకోవడం, వారి కళాఖండాలను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేయడం అత్యంత అవసరం” అని పేర్కొన్నారు. వీరు రూపొందిస్తున్న చెక్క కళాఖండాలు, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందుతున్నాయి. తొరూరు గ్రామంలో తయారైన ఈ కళాఖండాలు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి బహుమతులుగా అందజేయబడ్డాయి. కళాకారుల సమస్యలపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్, “అటవీ శాఖ ద్వారా అవసరమైన కలపను సరఫరా చేస్తాం. త్వరలో ‘వుడ్ బ్యాంక్’, ‘బాంబూ బ్యాంక్’లను ఏర్పాటు చేసి ఏటికొప్పాక, కొండపల్లి, తిరుచానూరు, మాధవమాల వంటి హస్తకళా కేంద్రాలకు కూడా ముడిసరుకు అందేలా చర్యలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు.
“పదవి ఒక అలంకారం కాదు, బాధ్యత. చైర్మన్ హోదాలో కళాకారుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాను. జనసేన పార్టీ, ఎన్డీయే ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు మంచి పేరు తెచ్చేలా కృషి చేస్తాను” అని అన్నారు. విజయదశమి సందర్భంగా, క్లస్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కళాకారులందరికీ బోనస్ పంపిణీ చేశారు. ఈ బోనస్‌ను డాక్టర్ హరిప్రసాద్ దంపతుల చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో పుత్తూరు దగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ మెరుపుల మహేష్, జగదీష్ ముని గోపిరాయల్, శివలింగ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News