-అందుకే 16 నెలల్లో 5 సార్లు రాష్ట్రంలో పర్యటన
-రూ.లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
-వికసిత భారత్‌లో ఏపీని కీలకంగా మార్చాలన్నదే పీఎం ఆశయం
-ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది
-పీఎంకి ధన్యవాదాలు
-వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమన్నా, ప్రజలన్నా అమితమైన ప్రేమ ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కర్నూలులో జరిగిన పర్యటన సందర్భంగా ప్రధాని ఈ విషయాన్ని మరోమారు చాటిచెప్పారని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ కర్నూలు పర్యటన విజయవంతమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఏపీ అభివృద్ధి పథంలో భాగమైనందుకు ప్రధాని మోదీకి సత్య కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలన్నిటికంటే కూడా ప్రధాని మోదీ హృదయంలో ఏపీకి ప్రత్యేక స్థానముందన్నారు. మోదీ మూడో పర్యాయం ప్రధాని మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్క ఏపీలో మాత్రమే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి 5 సార్లు పర్యటించారని, మరే ఇతర రాష్ట్రంలోనూ ఆయన ఇన్ని సార్లు పర్యటించలేదని తెలిపారు. తాను ప్రధాని కార్యాలయంలో ఈ విషయం గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నానని చెప్పారు.
ప్రతి పర్యటనకు ఓ విశేషం
మోదీ మూడో పర్యాయం ప్రధాని అయ్యాక 2024 జూన్ 12న తొలిసారిగా ఏపీలో కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చారని, రెండోసారి ఈ ఏడాది జనవరి 8వ తేదీ విశాఖపట్నం నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రూ.2.10లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని తెలిపారు. మే నెల 1, 2వ తేదీల్లో అమరావతిలో పర్యటించి రూ.58 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారన్నారు. తదుపరి నాలుగో పర్యాయం జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. లక్షలాది మందితో ఒకేసారి 3 లక్షల మందితో యోగాసనాలు వేయడం ద్వారా ఏపీ గిన్నెస్ రికార్డు నమోదు చేసిన ఈ కార్యక్రమంలో మోదీ స్వయంగా పాల్గొనడoతో ప్రపంచం మొత్తం ఏపీవైపు చూసేలా చేశారన్నారు. ఇప్పుడు ఐదో సారి కర్నూలులో పర్యటించి రూ.13,430 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని తెలిపారు.
ఏపీనే కీలకం
2047 వికసిత భారత్ లో ఆంధ్రప్రదేశ్‌ను కీలకంగా మార్చాలన్నదే ప్రధాని మోదీ ఆశయమన్నారు. మోదీ ఆశయ సాధనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు. మోదీ సహకారంతో దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీ అవతరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
Prajavartha Online Telugu News