Breaking News

వర్ష ప్రభావిత జిల్లాల పరిస్థితులపై సమీక్షించిన ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా కలెక్టర్లు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. రాష్ట్రంలో ఎటు వంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాలు పలువురు మంత్రులు వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల పరిస్థితిపై సంబందిత జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్షలు నిర్వహించి అప్రమత్తం చేయడం జరిగింది.

దుబాయ్ నుంచి సీఎం సమీక్ష……
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ నుంచి అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల పరిస్థితిపై సీఎస్ మరియు ఆర్టీజీ అధికారుల నుంచి సమాచారం సేకరించి, యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలను పంపించాలని సూచిస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, కాలువలు మరియు చెరువుల గట్లు బలహీనంగా ఉన్న చోట్ల పటిష్ట పరచాలని ఆదేశించారు. అంతేకాక, అంటువ్యాధులు వ్యాపించకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు.

రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష…..
ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో మంత్రి డా. పి. నారాయణ మున్సిపల్ కమిషనర్లను అప్రమత్తం చేశారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ, వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కాకుండా అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ కాకుండా చూడాలని, నీటి పారుదలకు అడ్డంకులను తొలగించాలని, ఇంజనీరింగ్ మరియు పారిశుధ్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని, తాగునీరు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని మున్సిపాలిటీల్లో 24 గంటల కాల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ మినరల్ వాటర్ ప్లాంట్లను తనిఖీ చేయాలని మరియు పోలీస్, వైద్యారోగ్య శాఖ సిబ్బందితో సమన్వయంతో వ్యవహరిస్తూ ప్రజలకు ఎటు వంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.

రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష…..
రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత విజయవాడలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైందని తెలిపారు. లోతట్టు ప్రాంతాలు మునిగే అవకాశం ఉండటంతో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణాల్లో డ్రైనేజీలను క్లియర్ చేసి వర్షపు నీరు సకాలంలో వెళ్లేలా చూడాలని, ఇరిగేషన్ అధికారులు కట్టల వెంబడి ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వచ్చే వారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున మొత్తం యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. పిడుగులతో కూడిన వర్షాలు పడేటప్పుడు రైతులు పంట పొలాల్లో ఉండరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయ స్వామి సమీక్ష…….
ప్రకాశం జిల్లాలో భారీ వర్షాల పరిస్థితిపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయ స్వామి కలెక్టరేట్ నుండి మండల స్థాయి స్పెషల్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక పరిస్థితులు, సన్నద్ధతపై వివరాలు పరిశీలించి, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు. అవాంఛనీయ పరిస్థితులు జరగకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు వర్ష ప్రభావిత మండలాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించామని, వాగులు పొంగుతున్న ప్రాంతాల్లో పోలీసు, రెవెన్యూ అధికారులతో గస్తీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నెల్లూరు జిల్లా కలెక్టర్ సమీక్ష….
నెల్లూరు జిల్లాలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అక్టోబర్ 22 నుంచి 25 వరకు భారీ పిడుగులు, గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రజలకు హెచ్చరించారు. లోతట్టు, తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదు, ఇప్పటికే ఉన్నవారు త్వరగా తీరానికి చేరుకోవాలి అని సూచించారు. జిల్లా యంత్రాంగం అంతా ఎంతో అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించడం జరిగిందని, 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూం (0861-2331261, 7995576699) ఏర్పాటు చేయబడిందన్నారు. వర్షాలు, గాలులు, ఉరుములు, విద్యుత్ ప్రమాదాలు, చెరువులు, కాలువల గండ్ల విషయంలో ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని తక్షణ సహాయం కోసం వెంటనే జిల్లా కంట్రోల్ రూం ను సంప్రదించాలని జిల్లా ప్రజలను ఆయన కోరారు.

గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరు నగరంలో మున్సిపల్ అధికారులు సమర్థవంతంగా సేవలు అందించారని, మురుగునీరు, డ్రైనేజ్ సిస్టంను సరిచేయడం, ప్రధాన కాలువల్లో సిల్ట్ తొలగించడం, నీరు నిలకడగా పారే విధంగా డైవర్షన్ చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారని కలెక్టర్ ప్రశంసించారు.

బాపట్ల జిల్లా కలెక్టర్ సమీక్ష……
బాపట్ల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ మండల, గ్రామ స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి భారీ వర్షాల నేపథ్యంలో ఎటు వంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా తగు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్ల కుండా చూడాలని, శిథిలావస్థలో ఉన్న గృహాల్లో నివసిస్తున్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలాలని, వర్షంలో విద్యుత్ స్థంభాలను తాకరాదు అని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 0864-3220226 నంబర్‌లో కాంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

చెరువు గట్లను పటిష్టపర్చాలని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మైనర్ ఇరిగేషన్ చెరువుల వద్ద అధికారులు నియమించి, సముద్రంలో వేటకు వెళ్లిన 42 మంది జాలర్లను సురక్షితంగా తిరిగి ఇంటికి చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని, ఎరువుల నిల్వలను యాప్‌లో అప్డేట్ చేయించాలని, ఇ. పంటల నమోదు పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే, గృహ నిర్మాణ శాఖ ద్వారా నిర్మించిన గృహాలను త్వరలో ప్రారంభించడానికి సిద్ధం చేసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పంచాయతీ, వ్యవసాయ, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లా కలెక్టర్ సమీక్ష…..
జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు జిల్లాలోని పరిస్థితులను సమీక్షిస్తూ భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని సింగరాయకొండ, టంగుటూరు, కొత్తపట్నం, ఒంగోలు, నాగులుప్పలపాడు మండలాల పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాలకు నేడు సెలవు ప్రకటించబడం జరిగిందన్నారు. పామూరు మరియు సి.ఎస్. పురం మండలాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైన కారణంగా ఆయా ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించడం జరిగిందన్నారు. ఏ ప్రాంతంలో వాగులు పొంగిపొర్లునంటే, సంబంధిత మండల అధికారులు స్థానికంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించవచ్చని ఆయన సూచించారు. ప్రజలు భారీ వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు.

కర్నూలు జిల్లా కలెక్టర్ సమీక్ష……
కర్నూలు జిల్లాలో వాయుగుండం ప్రభావంతో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రిజర్వాయర్లు, చెరువులు, లోతట్టు, నదీతీర ప్రాంతాలను పరిశీలించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ప్రజలకు హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం ఉండాలని సూచించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, పంచాయతీ రాజ్, విద్యుత్ శాఖల అధికారుల సమన్వయంతో పని చేయాలని సూచించారు. పంట నష్టం నివారించేందుకు వ్యవసాయ, ఉద్యాన శాఖలు రైతులకు సూచనలు ఇవ్వాలి. జిల్లా కేంద్రం మరియు ప్రతి మండలంలో 24/7 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, షెల్టర్‌లు, ఆహార పదార్థాలు అందించే విధంగా సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

చిత్తూరు జిల్లా కలెక్టర్ సమీక్ష……..
చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆ జిల్లాలోని పరిస్థితులను సమీక్షిస్తూ వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లడం, చెరువులు మరియు కుంటలు నిండకపోవడం వంటి పరిస్థితులు ఏర్పడినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్ కంట్రోల్ రూమ్ నంబర్లు (9491077325, 08572-242777) సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) సూచనల మేరకు అధికారులు అతి భారీ వర్షాలకు తగు జాగ్రత్తలు చేపట్టి, ప్రత్యేకంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సీజనల్ వ్యాధుల నియంత్రణకు దృష్టి పెట్టాలని సూచించారు. పిల్లలను ప్రమాద స్థలాలకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని తల్లిదండ్రులకు సూచించారు.

కాకినాడ జిల్లా కలెక్టర్ సమీక్ష……
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రైతులను ముందస్తుగా హెచ్చరించి, అవసరమైన సూచనలు మరియు సహాయక చర్యలు అందించాలని, కూలిపోయే భవనాల దగ్గర ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్‌లో 24 గంటల పాటు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయగా (నంబర్: 0884-2356801), ఎటువంటి ఇబ్బంది, రోడ్డు, చెట్టు కూలడం, ట్రాఫిక్ సమస్యలు ఎదురైనప్పుడు సిబ్బంది వెంటనే స్పందించాలని ఆదేశించారు. రెవెన్యూ డివిజనల్ మరియు తాసిల్దార్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయబడ్డాయని, వాటిని ప్రజలు ఉపయోగించవచ్చని కలెక్టర్ కోరారు.

వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ సమీక్ష……
వైఎస్ఆర్ కడప జిల్లాలో రాబోయే భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ఉంది. కలెక్టరేట్‌లో అత్యవసర సహాయ సమాచారానికి 08562-246344 నంబర్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది. వాతావరణ హెచ్చరికల మేరకు నేడు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించడం జరిగింది. జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్ అన్ని శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేసి, అధికారులు మరియు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా కుందూ, పెన్నా నదీ పరివాహక ప్రాంతాలు మరియు లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వాగులు, వంకలు, చెరువులు, నదీ పరివాహక ప్రాంతాల్లో రెవెన్యూ, ఇరిగేషన్, వైద్య శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు, రైతులు పంటలు, ధాన్యం, పశు సంపదను సురక్షితంగా ఉంచుకోవాలని, ఏవైనా అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనప్పుడు కంట్రోల్ రూమ్ లేదా మండల తహసీల్దార్ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు.

తిరుపతి జిల్లా…….
తిరుపతి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ మరియు ప్రైవేట్ (Unaided) పాఠశాలలు, అంగన్‌వాడీలు, జూనియర్ కళాశాలలకు నేడు సెలవు ప్రకటించబడింది. జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.ఎన్. కుమార్ సూచనల మేరకు, డివైఈఓలు, ఎంఈఓలు మరియు ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఈ సమాచారాన్ని వెంటనే తెలియజేయాల్సిందిగా ఆదేశించారు.

ఉదయం 6.30 గంటలకు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక సందేశం …..
అక్టోబర్ 23 ఉదయం 6:30 గంటలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం, ఉత్తర అంతర్గత తమిళనాడు మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, ఇవాళ అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. మిగతా జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు సంభవించే అవకాశం ఉంది. ప్రజలు చెట్ల క్రింద నిలబడకూడదని, అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

ఉదయం 9.30 గంటలకు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక సందేశం …..
అక్టోబర్ 23 ఉదయం 9:30 గంటలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసిన సమాచారం ప్రకారం, బలహీనపడిన తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం ఉత్తర తమిళనాడు మరియు దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో దక్షిణ అంతర్గత కర్ణాటక దిశగా కదులుతూ మరింత బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా మరియు రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడవచ్చు. తీరం వెంబడి గంటకు 30-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *