•డబుల్ ఇంజన్ సర్కార్ పాలన ఫలితంగా పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూస్తున్నారు
•20 లక్షల ఉద్యోగాల కల్పన హామీకి ఊతం ఇచ్చేలా పెట్టుబడుల ఆకర్షణ
20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మెన్ లంకా దినకర్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అనుకూల వాతవరణం ఉన్నందువల్లే పెట్టుబడులు భారీ స్థాయిలో వస్తున్నాయని 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మెన్ లంకా దినకర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సూపర్ ఫాస్ట్ సర్కార్ పాలన ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూస్తున్నారని, కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ఊతం ఇచ్చేలా పెట్టుబడుల ఆకర్షణ నేడు జరుగుతున్నదని ఆయన తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయంలోని తన చాంబరులో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ 2019 ముందే అదానీ డాటా సెంటర్ అంకురార్పణ జరిగినదని, అయితే 2019 – 24 మధ్య ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం 888.13 మిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మాత్రమే సాధించడం జరిగిందని, అయితే, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ఒక్క గూగుల్ డాటా సెంటర్ నుండి 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి సాధించడం జరిగిందన్నారు. 2024 – 25 సంవత్సరానికి అన్ని రకాల పెట్టుబడులు 4.47 లక్షల కోట్ల రూపాయలు వచ్చినా, అందులో విదేశీ పెట్టుబడులు 233.14 మిలియన్ డాలర్లు మాత్రమే ఉండడానికి గత ప్రభుత్వ పెట్టుబడుల ప్రతికూల వాతావరణమే కారణమన్నారు. 2024 అనంతరం ఒక వైపు కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ జీ నేతృత్వంలోని ప్రభుత్వం సమయోచిత సహాయం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సమన్వయం మరియు పెట్టుబడుల కోసం ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారి నిరంతర కసరత్తు కలిసి నేడు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అతి పెద్ద విదేశీ పెట్టుబడుల గమ్యస్థానంగా అవతరించిందన్నారు.
నేడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి ప్రణాళిక తో ముందుకు దూసుకెళ్తున్నాయన్నారు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర రాష్ట్ర ఆర్ధిక రాజధానిగా దేశీయ మరియు విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, రాయలసీమలో కోపర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్లు, డ్రోన్ పార్క్ వంటి వస్తు తయారీ పరిశ్రమల హబ్ గా మరియు హార్టికల్చర్ జోన్ గా అభివృద్ధి మరియు మధ్య ఆంధ్రలో రాజధాని అమరావతి నిర్మాణం, క్వాంటం వ్యాలీ ఏర్పాటు, రామాయపట్నం మరియు మచిలీపట్నం పోర్ట్ నిర్మాణం మరియు బీపీసీఎల్, ఇండోసోల్ వంటి పరిశ్రమలు ఏర్పాటుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ జీ సహాయ సహకారాలతో దూసుకెళ్తుందన్నారు.
రాష్ట్రంలో 18 నెలల కూటమి ప్రభుత్వం 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం డబుల్ ఇంజిన్ సర్కార్ సాధించిన విజయం అన్నారు. 2047 నాటికి సగటున 15% వృద్ధితో 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవతరించే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ జీ సంకల్పం వికసిత్ భారత్ లో కీలక భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పని చేస్తున్నారన్నారు.
వైజాగ్ నుండి 1 ట్రిలియన్ డాలర్ల జీఎస్డిపి లక్ష్యం అని మంత్రి లోకేష్ అన్నారు, ఆ సంకల్పం సాధ్యమేనన్నారు. ఐటీ మరియు ఐటీ ఆధారిత రంగం, ఫార్మా, హైడ్రో పవర్ వంటి గ్రీన్ ఎనర్జీ, మిట్టల్ వంటి కొత్త ఉక్కు పరిశ్రమలు, ఎగుమతులు మరియు దిగుమతుల కోసం నౌకాయానం, భోగాపురం విమానాశ్రయం మరియు పుష్కలంగా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే పర్యాటక రంగం వంటి అన్నిరకాల హంగులు వైజాగ్ సొంతం కారణంగా వారి సంకల్పం సాద్యమవుతుందన్నారు. 2047 నాటికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లో “ వికసిత్ విశాఖ “ లక్ష్యంతో కార్యాచరణకు 15 బిలియన్ డాలర్ల గూగుల్ పెట్టుబడులు ఒక మంచి ప్రారంభం అన్నారు.
2018 – 2019 లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో మన రాష్ట్రం 5 వ స్థానంలో ఉంటే, గత ప్రభుత్వ రివర్స్ పాలనతో 14 వ స్థానంకి చేరుకుందన్నారు. రాబోయే ఒక సంవత్సరంలో మరల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ని అగ్రస్థానంలో నిలపడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అన్నారు.
గత ప్రభుత్వ పాలనలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లతో, కియా మోటార్స్ వంటి సంస్థలను గత ప్రజా ప్రతినిధుల బెదిరింపులతో, అమరావతి పైన కుట్రలతో దేశీయ మరియు విదేశీయ పెట్టుబడి దారులు రాష్ట్రం వైపు చూడాలంటే బెంబేలెత్తారన్నారు. గత పాలనలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ అదమ స్థానంలో నిలిచిందన్నారు. వైజాగ్ లో జరగబోయే పారిశ్రామిక సదస్సులో గూగుల్, మిట్టల్ స్టీల్, హైడ్రో పవర్ వంటి ప్రాజెక్టుల పెట్టుబడుల ఆకర్షణ ఒప్పందాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేసి చూపుతుందన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ జీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సమన్వయ సహాయ సహకారాలతో రాష్ట్రంలో ఒక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దార్శనికతతో, మరో వైపు పెట్టుబడుల ఆకర్షణ కోసం పట్టుదల తో ముందుకు సాగుతున్న విద్య మరియు ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోడీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ను వికసిత్ భారత్ లో భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.
Prajavartha Online Telugu News