Breaking News

జిల్లాలో ఏ ఒక్క ప్రాణ నష్టము జరగరాదు… : కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మోంత తుఫాన్ కారణంగా జిల్లాలో ఏ ఒక్క ప్రాణ నష్టము జరగరాదని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.

సోమవారం ఉదయం నుంచి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడుతో కలిసి గుడివాడ
నియోజకవర్గంలోని నందివాడ మండలంలో పర్యటించారు.
మండలంలోని పుట్టగుంట కాజువే దగ్గర వరద నీటి ప్రవాహాన్ని వారు పరిశీలించారు.

అనంతరం మండలంలోని జనార్దనాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి తుఫాను సహాయక ఏర్పాట్లపై సమీక్షించారు. పూరిల్లు, బలహీనంగా ఉన్న ఇల్లు ఎన్ని ఉన్నాయని, పునరావాసకేంద్రాన్ని ఏర్పాటు చేశారా లేదా అని కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొదట్లో తహసిల్దార్ గురుమూర్తి విఆర్వోలు సరిగా సమాచారం చెప్పకపోవడంతో జాబితా లేకపోవడంతో జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇకనైనా వెంటనే స్పందించి ఏర్పాట్లు ముమ్మరం చేయాలన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరద వేరు తుఫాను వేరు అని తుఫాను సమయంలో లోతట్టు ప్రాంతాలే కాకుండా అన్నిచోట్ల భారీ వర్షాలు కురిసి ఈదురుగాలులతో బీభత్సం సృష్టిస్తాయన్నారు.
ఇదివరకు బుడమేరు ఉప్పొంగి పుట్టగుంట కాజు వే ప్రాంతంలో రాకపోకలకు చాలా ఇబ్బందులు కలిగాయని, అటువంటి పరిస్థితి మరలా వచ్చే అవకాశం ఉందని చాలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఏ ఒక్క ప్రాణ నష్టము జరగకుండా అధికారులందరూ బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
వరద నీరు రహదారులు, కాజ్వేలపై ప్రవహించి గండ్లు పడే అవకాశం ఉందని కొందరు ప్రయాణికులు వాటిని దాటే ప్రమాదం ఉన్నందున అటు, ఇటు రెండు వైపులా రాకపోకలు జరగకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించి నియంత్రించాలన్నారు.
రెవెన్యూ పంచాయతీ పోలీస్ అధికారులు కలిసికట్టుగా సమన్వయంతో పని చేయాలన్నారు

అధికారులు సిబ్బంది అందరూ కూడా వారి వారి ప్రధాన కార్య స్థానాల్లో అందుబాటులో ఉండాలన్నారు. తుఫాను పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందుకు తగ్గట్టుగా తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
ముఖ్యంగా మంచినీరు ఎక్కడ కూడా కలుషితం కాకుండా చూడాలని అవసరమైతే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సూచించారు.

గ్రామాల్లో 142 పూరి గుడిసెలు ఉన్నాయని అందులో నివసిస్తున్న ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రానికి చేర్చాలన్నారు. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టరాదని అందరినీ తరలించాలని, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ ఒక్క ప్రాణ నష్టం కూడా జరగరాదని స్పష్టం చేశారు.

ఎక్కడైనా రహదారి మార్గాల్లో చెట్లు గాని, విద్యుత్ స్తంభాలు గాని పడిపోతే రాకపోకలకు అంతరాయం కలగకుండా వెంటనే వాటిని తొలగించే ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ సౌకర్యాన్ని కూడా వెంటనే పునరుద్ధరించాలన్నారు. ఇందుకోసం అవసరమైన విద్యుత్ రంపాలను, క్రేన్లను తదితర యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
గర్భవతులు 8 మందిని, డయాలసిస్ రోగులు ముగ్గరిని, కీమోతెరపి రోగులను ఇద్దరినీ ఆసుపత్రులకు పంపించారా లేదా అని విచారించి, పంపించారని చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని కూడా జిల్లా కలెక్టర్ పరిశీలించారు

తదనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మోంత తుఫాను వలన జిల్లాలో ఈనెల 27, 28, 29 తేదీలలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు.
ఈ నెల 28వ తేదీన తుఫాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురు గాలులు వీచడంతోపాటు బీభత్సమైన వర్షము కురుస్తుందన్నారు.
జిల్లా యంత్రాంగం మొత్తం గ్రామ, మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అందరినీ అప్రమత్తం చేశామన్నారు

లోతట్టు ప్రాంతాలు, కాలువ గట్లు, పూరిల్లు, తాటిపాకలు పెంకుటిల్ల లో నివసిస్తున్న ప్రజలను వెంటనే తుఫాను వలన ఇబ్బంది కలగకుండా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు 188 పునరావాస కేంద్రాలను గుర్తించి సిద్ధం చేశామన్నారు.
ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో పరిశీలించేందుకు జిల్లా ఎస్పీతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామన్నారు.

జిల్లాలో ఈనెల 27, 28, 29 తేదీలలో అన్ని విద్యాసంస్థలకు సెలవు దినాలుగా ప్రకటించామని గత బుడమేరు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ వారి ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని ఎవరు కూడా బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

పూరిల్లు, పాకలు, బలహీనమైన ఇళ్లల్లో ఉండే వారు వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు స్వచ్ఛందంగా రావాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ప్రజలందరూ సహకరించాలన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎవరికి ప్రాణం నష్టం జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. పునరావాస కేంద్రాలలో మంచినీరు ఆహారంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు.
ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం ఇప్పటికే మచిలీపట్నం చేరుకుందని మరో బృందం గుడివాడకు రానుందన్నారు.

తదుపరి జిల్లా కలెక్టర్ గుడివాడ ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించి అక్కడ ఏర్పాటుచేసిన కంట్రోల్ విభాగాన్ని పరిశీలించారు.
అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి తుఫాను ముందస్తు జాగ్రత్తలపై శాఖల వారీగా సమీక్షించారు. ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకుండా అందరూ బాధ్యత వహించాలని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ ఎస్పీ వెంట రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ ఆర్డిఓ జి బాలసుబ్రమణ్యం, గృహ నిర్మాణ సంస్థ ఈ ఈ వెంకటరావు, నందివాడ ప్రత్యేక అధికారి డిఐసి జిఎం ఆర్ వెంకటరావు, డి ఎల్ డి ఓ సునీత శర్మ, గుడివాడ మున్సిపల్ కమిషనర్ మనోహర్రావు, గుడివాడ ప్రత్యేక అధికారి సరళ, నందివాడ తహసిల్దారు గురుమూర్తి డిప్యూటీ ఎంపీడీవో భాష, డ్రైనేజీ డి ఈ నాగేంద్ర కుమారు పంచాయతీరాజ్ ఏఈ సూరిబాబు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రూపేష్,, గుడివాడ ఎంపీడీవో విష్ణు ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో జి శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కిస్మత్ రాణి, వ్యవసాయ అధికారి అనంతలక్ష్మి జల వనరుల శాఖ ఏఈ బేగ్ ఎంఈఓ బాలాజీ తదితర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *