– గండి తెగిన చెరువులు, పరిస్థితులు పరిశీలన
– తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ
– తుఫాను పరిస్థితులపై ప్రజలకు సూచనలు…
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార మరియు పౌరసంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం పర్యటించారు. ఏలూరుజిల్లా, నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం, నెక్కలం గొల్లగూడెం, ఆగిరిపల్లి గ్రామాల్లో మంత్రి పార్థసారథి అధికారులతో కలిసి పర్యటించారు. భారీ వర్షాల నేపథ్యంలో గండ్లు తెగిపోయిన చెరువుల వద్ద మంత్రి పర్యటించారు. అక్కడి పరిస్థితులపై మంత్రి అధికారులను అడిగి ఆరా తీశారు. తీసుకోవాల్సిన నష్టనివారణ చర్యలపై అధికారులు, స్థానిక ప్రజలతో చర్చించారు. మొంథా తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని ఆదేశించారు. గండ్లు తెగిపోయిన చెరువుల వద్ద తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. స్థానిక ప్రజలకు తుఫాను ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై అవగాహన కల్పించారు. ప్రజలంతా సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని, అధికారులు చెప్పే సూచనలు తూచ తప్పకుండా పాటించాలని కోరారు. తుఫాను తీరం దాటి, వాతావరణం అనుకూలించే వరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజలకు అందించాల్సిన సహాయ సహకారాలపై మంత్రి స్థానికులకు వివరించారు. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు గండ్లు తెగిన చెరువుల వద్ద నిఘా పెట్టాలని, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండలస్థాయి అధికారులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News