*మంగళవారం రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య మొంథా తీరం దాటే అవకాశం
*ఎంపీ భరత్, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తో కలిసి వివరాలు వెల్లడించిన అజయ్ జైన్
విశాఖపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త :
మొంథా తుపాను మంగళవారం సాయంత్రం 5.00 గంటల సమయానికి కాకినాడ తీరానికి 120 కి.మీ. దూరంలో ఉందని, రాత్రి 10 నుంచి 12 గంటల మధ్యలో రాజోలు వద్ద తీరం దాటే అవకాశం ఉందని కోస్తాంధ్ర 9 జిల్లాల తుపాను ప్రత్యేకాధికారి, రాష్ట్ర స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ పేర్కొన్నారు. ఈ 12 గంటలు చాలా కీలకమని, మనమంతా మరింత అప్రమత్తంగా ఉందామని పిలుపునిచ్చారు. అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు చాలా వరకు ఆస్తి, ప్రాణ నష్టం చేకూరకుండా సత్ఫలితాలను ఇచ్చాయని ఉద్ఘాటించారు. విశాఖపట్టణం ఎంపీ శ్రీభరత్, కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ లతో కలిసి కలెక్టరేట్ వీసీ హాలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మొంథా తుపాను తాజా వివరాలను వెల్లడించారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు ఉన్న తొమ్మిది జిల్లాల్లో మొంథా ప్రభావం ఉంటుందని, ప్రధానంగా కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పారు. 9 జిల్లాల్లో 554 క్యాంపులు ఏర్పాటు చేశామని, 31,600 మందిని తరలించామన్నారు. కోనసీమ జిల్లా వాసులు బైటకు రావద్దని హెచ్చరికలు చేస్తున్నామన్నారు. కొబ్బరి, పామ్ ట్రీలు విరిగిపడే ప్రమాదం ఉందని, కోనసీమలో పవర్ సప్లైకి విఘాతం కలిగే అవకాశం ఉందని అజయ్ జైన్ పేర్కొన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా 18 వేల విద్యుత్ స్తంభాలను సిద్ధంగా ఉంచామని వివరించారు. కోనసీమ జిల్లా మామిడికుదురులో చెట్టుపడి 48 ఏళ్ల మహిళ దురదృష్టవశాత్తు మృత్యువాత పడిందని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన మినహా ఎక్కడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. మరీ అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రతి చోటా తక్షణ సహాయక బృందాలను అందుబాటులో ఉంచాం ః జిల్లా కలెక్టర్
27వ తేదీ ఉదయం నుంచి 28వ తేదీ ఉదయం 8.30 గంటల వరకు విశాఖపట్టణం జిల్లాలో 147 మి.మీ. వర్షపాతం నమోదైందని, 28వ తేదీ ఉదయం 8.30 నుంచి సాయంత్రం 3.00 గంటల వరకు 1.3 సెం.మీ. వర్షపాతం నమోదైందని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారంతో పోల్చితే మంగళవారం జిల్లాలో వర్షపాతం తగ్గిందని స్పష్టం చేశారు. ఎక్కడా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, జీవీఎంసీ పరిధిలోని 10 జోన్లలో జోన్ కు రెండేసి చొప్పున క్యూ.ఆర్.టి. బృందాలను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఎప్పటికప్పుడు చెట్ల కొమ్మలను, డ్రెయిన్లలో పూడికను తొలగిస్తున్నామని వివరించారు. కొండవాలు ప్రాంతాల్లో ప్రజలను సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించామని పేర్కొన్నారు. ప్రస్తుతం 8 క్యాంపుల్లో 144 మంది పునరావాసం పొందారని వివరించారు. ములగాడ, సీతకొండ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయని, ఇతర చోట్ల రాళ్లు జారాయని పేర్కొన్నారు. మేఘాద్రి గెడ్డలో 6,000 క్యూసెక్కులు ఇన్ ఫ్లో, 7,000 క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉందని చెప్పారు. జిల్లాలోని 14 చెరువులు ప్రమాదరకర స్థితిలో ఉన్నాయని, ప్రజలను అప్రమత్తం చేయటంతో పాటు పునరావాస కేంద్రాలకు తరలించామని పేర్కొన్నారు.
119 చెట్లు కూలిపోగా 60 తొలగించామన్నారు. 9 విద్యుత్ స్తంభాలు పడిపోగా ఏడింటిని పునరుద్ధరించామన్నారు. 16 యూజీడీ డ్రెయిన్లు పొంగిపొర్లగా మంగళవారం సాయంత్రం నాటికి తొమ్మిదింటిని సరి చేశామని, పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. 29 చోట్ల నీరు నిలిచిపోగా 22 చోట్ల పునరుద్దరణ చర్యలు చేపట్టామన్నారు. 8 గోడలు కూలిపోగా 4 చోట్ల చర్యలు చేపట్టామన్నారు. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా 35 ట్యాంకులను అందుబాటులో ఉంచామని కలెక్టర్ వివరించారు. 2 ఎన్డీఆర్ఎఫ్, 1 ఎస్టీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని, వాటిలో 90 మంది సిబ్బంది ఉంటారని పేర్కొన్నారు. ప్రజలు ఏమైనా అత్యవసరమైతే హెల్ప్ లైన్ 0891-2590100, 96669 09192, 180042 500009 నంబర్లను సంప్రదించాలని సూచించారు. తుపాను తీవ్రత దృష్ట్యా బుధవారం కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించామని కలెక్టర్ పేర్కొన్నారు.
సరదాలకు ఇది సమయం కాదు.. ఎవరూ బయటకు రావొద్దు ః ఎంపీ
కొంతమంది బీచ్ లో సెల్ఫీలు తీసుకోవటం కనిపించిందని, దయచేసి అలా ఎవరూ చేయొద్దని, సరదాలకు ఇది సమయం కాదని ఎంపీ శ్రీభరత్ హితవు పలికారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. అధికార యంత్రాంగం బాగా పని చేసిందని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించానని, అధికారులు, సిబ్బంది పక్కా చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఫర్వాలేదు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉంటుందని, కావున ప్రజలు సమాచారం కోసం ఫోన్లను ఛార్జింగ్ పెట్టుకోవాలని సూచించారు. 11 ఏళ్ల క్రితం హుద్ హుద్ చేసిన నష్టం గురించి మనందరికీ తెలుసు.. ఇప్పుడు అలాంటి నష్టం వాటిల్లకూడదని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. కాకినాడ, కోనసీమ ప్రజలకు ఏమీ కాకూడదని, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకూడదని భగవంతున్ని వేడుకుంటున్నానని ఎంపీ భరత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో, జిల్లాల్లో అనుభవం కలిగిన నేతలు, అధికారులు ఉన్నారని, అనుకోని రీతిలో ఏమైనా జరిగినా తక్షణమే పునరుద్దరించే శక్తి వారికుందని ధీమా వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News