Breaking News

ఊరూరా అన్న‌దాత సుఖీభ‌వ‌-పీఎం కిసాన్ పండ‌గ‌

– రైతుల ఖాతాల్లో రెండో విడ‌త నిధులు జ‌మ‌
– ఎన్‌టీఆర్ జిల్లాలో రూ. 79.72 కోట్ల మేర ల‌బ్ధి
– అన్న‌దాత‌ల కుటుంబాల్లో ఆనంద‌మే ల‌క్ష్యంగా ప‌థ‌కం అమ‌లు
– కార్య‌క్ర‌మంలో పాల్గొన్న క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ,
జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ తాత‌య్య‌, కేడీసీసీబీ ఛైర్మ‌న్ నెట్టెం ర‌ఘురాం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్న‌దాత‌ల కుటుంబాల్లో ఆనంద‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం అన్న‌దాత సుఖీభ‌వ‌-పీఎం కిసాన్ ప‌థ‌కాన్ని అత్యంత పార‌ద‌ర్శ‌కంగా అమ‌లుచేస్తోంద‌ని.. రైతులు ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ, జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ తాత‌య్య‌, కేడీసీసీబీ ఛైర్మ‌న్ నెట్టెం ర‌ఘురాం అన్నారు.
బుధ‌వారం జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం, బండిపాలెంలో అన్న‌దాత సుఖీభ‌వ‌-పీఎం కిసాన్ ప‌థ‌కం 2025-26కు సంబంధించి రెండో విడ‌త నిధుల‌ను రైతుల ఖాతాల్లో జ‌మ‌చేసే కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ, జ‌గ్గ‌య్య‌పేట శాస‌న‌స‌భ్యులు శ్రీరాం రాజ‌గోపాల్ తాత‌య్య‌, కేడీసీసీబీ ఛైర్మ‌న్ నెట్టెం ర‌ఘురాం త‌దిత‌రులు పాల్గొన్నారు. జిల్లాలో అన్న‌దాత సుఖీభ‌వ‌-పీఎం కిసాన్ ప‌థ‌కం కింద మొద‌టి విడ‌త‌లో ఒక్కో రైతు ఖాతాలో రూ. 7వేలు జమకాగా, ఇప్పుడు రెండోవిడ‌త‌లో మ‌రో రూ. 7 వేలు చొప్పున మొత్తం 1,18,629 మంది రైతుల ఖాతాల్లో రూ. 79.72 కోట్లు జ‌మ‌చేశారు. జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి మెగా చెక్‌ను రైతుల‌కు అంద‌జేశారు.
ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ ప్రాథ‌మిక రంగాల్లో ప్ర‌గ‌తి స్వ‌ర్ణాంధ్ర‌, విక‌సిత్ భార‌త్ ల‌క్ష్యాల సాధ‌న‌కు కీల‌క‌మ‌ని… వ్య‌వ‌సాయ‌, అనుబంధ రంగాల ద్వారా మెరుగైన ఆదాయాలు రావాల‌నే ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం వివిధ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను అమ‌లుచేస్తున్న‌ట్లు తెలిపారు. రైతులు ఉద్యాన పంట‌ల‌కు కూడా ప్రాధాన్య‌మివ్వాల‌ని.. ఈ పంట‌ల వ‌ల్ల అధిక ఆదాయాలు పొందొచ్చ‌న్నారు. త‌ల‌స‌రి ఆదాయం, జిల్లా స్థూల దేశీయోత్ప‌త్తి (జీడీడీపీ), జీవీఏల్లో వృద్ధి ల‌క్ష్యంగా వినూత్న ఆలోచ‌న‌ల‌తో సాగు కార్య‌క‌లాపాలు చేప‌ట్టాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. డ్రోన్ల‌ను, జీవ ఎరువుల‌ను ఉప‌యోగించుకోవ‌డం, ప్ర‌కృతి సాగును అనుస‌రించ‌డం, ప‌శు పోష‌ణ త‌దిత‌రాల ద్వారా ల‌భించే ఆర్థిక చేయూతతో రైతుల జీవన ప్ర‌మాణాలు మెరుగ‌వుతాయ‌ని అన్నారు. సాంకేతిక‌త‌ను కూడా పంట‌ల సాగుకు అందిపుచ్చుకోవాల‌ని సూచించారు.
సాగును లాభ‌సాటిగా మార్చేందుకు ప్ర‌భుత్వం చేయూత‌: ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్‌
సాగును లాభసాటిగా మార్చేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అన్న‌దాత‌ల‌కు చేయూత‌నిస్తున్నాయ‌ని.. వీటిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ అన్నారు. ఇచ్చిన మాట ప్ర‌కారం ప్ర‌భుత్వం అన్న‌దాత సుఖీభ‌వ‌-పీఎం కిసాన్ ప‌థ‌కం ద్వారా రైతుల‌కు ఆర్థిక సాయం అందిస్తోంద‌న్నారు. త‌క్కువ పెట్టుబ‌డితో ఎక్కువ ఆదాయం పొందేలా రైతులు సేంద్రియ వ్య‌వ‌సాయానికి, యాంత్రీక‌ర‌ణ‌కు చేరువ‌కావాల‌న్నారు. విచ్చ‌ల‌విడిగా ర‌సాయ‌న ఎరువులు, పురుగుమందులు వాడొద్ద‌ని.. ప్ర‌కృతి సేద్యంతో బ‌హుళ ప్ర‌యోజ‌నాలున్నాయ‌న్నారు. ప‌శు పోష‌ణ‌, జీవాల పోష‌ణ వ‌ల్ల అద‌న‌పు ఆదాయాల‌ను పొందొచ్చ‌ని సూచించారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంట‌ల సాగును చేప‌ట్టాల‌ని సూచించారు. వ‌ర్ష‌పు నీటి సంర‌క్ష‌ణ అనేది క‌రువు ప‌రిస్థితుల నుంచి గ‌ట్టెక్కిస్తుంద‌ని.. అందువ‌ల్ల రైతులు త‌మ పొలాల్లో పంట కుంట‌ల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని శాస‌న‌స‌భ్యులు శ్రీరాం రాజ‌గోపాల్ సూచించారు.
కేడీసీసీబీ ఛైర్మ‌న్ నెట్టెం ర‌ఘురాం మాట్లాడుతూ రైతుల క్షేమం, సంక్షేమం ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం వివిధ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను అమ‌లుచేస్తున్న‌ట్లు తెలిపారు. విప‌త్తుల స‌మ‌యంలోనూ రైతుల‌కు ఇబ్బంది లేకుండా ఆదుకుంటోంద‌ని పేర్కొన్నారు. ప్ర‌కృతి వ్య‌వ‌సాయ సేద్య విధానాల‌ను అనుస‌రించ‌డం ద్వారా ఆరోగ్య‌క‌ర స‌మాజ నిర్మాణం సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. జిల్లాలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లోనూ అన్న‌దాత సుఖీభ‌వ‌-పీఎం కిసాన్ కార్య‌క్ర‌మాలు సందడిగా సాగాయి. జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌, వ్య‌వ‌సాయ అధికారి డీఎంఎఫ్ విజ‌య‌కుమారి ఈ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షించారు. ఆర్‌డీవోలు.. ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి వివిధ ప్రాంతాల్లో కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.
కార్య‌క్ర‌మంలో నందిగామ ఆర్‌డీవో కె.బాల‌కృష్ణ‌, వ్య‌వ‌సాయ శాఖ ఏడీ సి.భ‌వాణీ, పీఏసీఎస్ ల ఛైర్మ‌న్లు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, రైతులు, ప్రకృతి వ్య‌వ‌సాయ విభాగం సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *