Breaking News

మెరుగ్గా పౌర సేవలందించాలి

-గ్రామసభల ఆమోదంతోనే పనులు… నరేగాకూ ఇదే నిబంధన
-రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు సమర్ధంగా ప్రజల్లోకి వెళ్లాలి
-వాతావరణం సహా 42 అంశాలతో త్వరలో అవేర్ యాప్ విడుదల
-రియల్ టైమ్ గవర్నెన్సుపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వివిధ ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలు మరింత మెరుగ్గా అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు సమర్ధంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచనలు జారీ చేశారు. సోమవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రంలో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజామోదం మేరకే మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో పనులు చేపట్టేలా చూడాలని.. అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ గ్రామ సభల అనుమతి లేకుండా పనులు చేపట్టవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. నరేగా పనులకూ ఇదే నిబంధన వర్తించేలా చూడాలని స్పష్టం చేశారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమర్ధంగా వివిధ అంశాలను ప్రజల ముందు ఉంచాలని సీఎం సూచించారు. ప్రభుత్వ విభాగాలు సాంకేతికతను మరింతగా అందిపుచ్చుకోవటంతో పాటు సామర్ధ్యాలను పెంచుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సుపరిపాలన లాంటి మోడల్ ఆఫ్ గవర్నెన్సు ద్వారానే ప్రజల్లో సంతృప్త స్థాయి పెరుగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు మంచి సేవలు అందించటం ద్వారానే దీనిని సాధించవచ్చని అన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, పౌరసేవలకు సంబంధించి ప్రతీ అంశంలోనూ జవాబుదారీతనం అనేది కీలకమైన అంశంగా పరిగణించాలని సీఎం స్పష్టం చేశారు. దీనికి సంబంధించి 175 నియోజకవర్గాల్లోనూ కెపాసిటీ బిల్డింగ్ కూడా జరగాలని అన్నారు. ప్రజల్లో సానుకూలత పెరిగేలా సూక్ష్మ స్థాయి వరకూ విశ్లేషణ జరగాలని అన్నారు. ఇటీవల రాష్ట్రంలో ఉత్పన్నమైన మొక్క జొన్న, కాటన్, అరటి పంటల్లో సమస్యను పరిష్కరించి రైతులకు ధర దక్కేలా చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ శాఖలు ఆర్ధిక, ఆర్థికేతర అంశాలను ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేయాలని తద్వారా ప్రజల్లో సానుకూల ధోరణి పెరిగేందుకు వీలుగా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. నిరంతరం డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. పౌర సేవల్ని అందించటంలో నిర్లక్ష్యంగా ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

త్వరలో ప్రజలకు అందుబాటులోకి అవేర్ యాప్

వాతావరణ హెచ్చరికలు సహా 42 అంశాల్లో నిరంతర సమాచారం కోసం అవేర్ యాప్ ను ప్రజల వినియోగం కోసం విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖలూ డేటా లేక్ కు అనుసంధానం కావాలని సూచనలు జారీ చేశారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో బ్యాండ్ విడ్త్ కనెక్టివిటీని పెంచాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లలోని తాగు నీరు, పరిశుభ్రత తదితర అంశాలపై పర్యవేక్షణ జరగాలని సూచించారు. దీనిపై ఓ యాప్ రూపోందించి రోజువారీగా తనిఖీ చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. తిరుమలలో టీటీడీ భక్తులకు అందించే సేవలు, క్రౌడ్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ లాంటి అంశాలను అధ్యయనం చేసి ఇతర దేవాలయాల్లో అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కాలుష్య నియంత్రణ మండలితో కలిసి ఎయిర్ క్వాలిటీ సెన్సార్లు ఏర్పాటు చేసి ఆ వివరాలను కూడా ప్రజలకు అందించాలని పేర్కొన్నారు. సుపరిపాలనా అంశాలపై డిసెంబరులో ఎమ్మెల్యేలు, ఎంపీలతో వర్క్ షాప్ నిర్వహించనున్నట్టు సీఎం స్పష్టం చేశారు. అధికారుల్లోనూ పాలనా సామర్ధ్యాలు పెరిగేలా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *