– ఆర్‌టీఐహెచ్ తోడ్పాటుతో పరిశ్రమల ఏర్పాటు దిశగా అడుగులు
– ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యువ మేధస్సు నవ ఆవిష్కరణలకు దోహదం చేస్తోందని.. రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్) తోడ్పాటుతో పరిశ్రమల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్-విజయవాడ స్పోక్ ఆధ్వర్యంలో ఇగ్నైట్ సెల్‌లో యువత వివిధ సమస్యలకు చూపిన సాంకేతిక పరిష్కారాలను ప్రదర్శించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడళ్ల కంటే 60 శాతం తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే ప్రోస్తెటిక్ చేతిని విష్ణు అసిస్టివ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రదర్శించింది. అదేవిధంగా ఎస్ఆర్ఎం వర్సిటీ-టీమ్ స్కైవర్క్స్ బృందం స్వయం నియంత్రిత డ్రోన్ లాస్ట్-మైల్ డెలివరీ వ్యవస్థను ప్రదర్శించింది. మారిస్ స్టెల్లా కళాశాల విద్యార్థులు సామాజిక ప్రభావం కలిగించే పలు సాంకేతికతలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఇలక్కియ మాట్లాడుతూ యువ ఆవిష్కర్తలు, విద్యార్థి పరిశోధకులను ఆర్‌టీఐహెచ్‌తో పాటు కలెక్టరేట్‌లోని ఇగ్నైట్ విభాగం ప్రోత్సహిస్తోందని, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనను వేగవంతం చేసేందుకు ఈ చర్యలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలోప్రోగ్రామ్ అసోసియేట్స్ జి.సుజాత, సౌమ్యా మనోజ్, ఆర్‌టీఐహెచ్ సీఈవో జి.కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News