-కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మేత సాగు, మేత నర్సరీల ఏర్పాటుకు హరిత గోపాలం పథకం పాడి రైతుల పాలిట వరమని, రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. విజయవాడలోని కృష్ణా మిల్క్ యూనియన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఛైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ, రాష్ట్రంలో మేత కొరతను సమర్థవంతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో, గ్రామీణ ప్రాంతాల్లో ఎంజి ఎన్ఆర్ఎజిఎస్ కింద పశు గ్రాసం సాగును ప్రోత్సహిస్తూ, పశుగ్రాస క్షేత్రాలు, మేతనర్సరీల ఏర్పాటుకు హరిత గోపాలం పథకం ద్వారా కూటమి ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడం హర్షణీయమని తెలిపారు. ఈ నిర్ణయం కూటమి ప్రభుత్వం పాడి రైతులకు అందించిన నూతన సంవత్సరపు కానుకగా అభివర్ణించారు. సమితి పాలకవర్గ సమావేశంలో, ఈ పథకాన్ని మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు. పశుగ్రాసం సాగు ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఈ పథకం దోహదపడుతుందన్నారు. పశు గ్రాస క్షేత్రాలు, మేత నర్సరీల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇవ్వడం రైతుల సంక్షేమం అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వ నిబద్ధతకు స్పష్టమైన నిదర్శనమని తెలిపారు. కృష్ణా మిల్క్ యూనియన్ పరిధిలోని పాడి రైతులకు మేలైన పశుగ్రాస విత్తనాలు, కనుపులు అందించి వారిని పశుగ్రాస క్షేత్రాలు, మేత నర్సరీల ఏర్పాటుకు ప్రోత్సహించి, ఈ హరిత గోపాలం పథకానికి యూనియన్ తమ వంతు సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వర బాబు, బోర్డు డైరెక్టర్లు దాసరి బాలవర్ధనరావు, వేమూరి సాయి, కృష్ణా మిల్క్ యూనియన్ పాలక వర్గ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు ఫీడ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News