– సాంకేతికత వినియోగం, భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత సాంకేతిక యుగంలో టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేస్తున్నప్పటికీ, అదే సమయంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతికతను వినియోగించే ప్రతిఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, సైబర్ భద్రత విషయంలో రాజీపడొద్దని స్పష్టం చేశారు.
శనివారం కేబీఎన్ కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ విభాగం, నక్ష్ ఫౌండేషన్ (ప్రాజెక్ట్ సైబర్ షీల్డ్ ఇనీషియేటివ్) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన వర్క్‌షాప్‌లో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మనం చేసే ప్రతి ఆన్‌లైన్ చర్యపై పూర్తి అవగాహనతో ముందుకు సాగాలని సూచించారు. చిన్న పొరపాటు కూడా సైబర్ నేరగాళ్లకు అవకాశం కల్పించి, మన కష్టార్జితాన్ని కోల్పోయే పరిస్థితికి దారితీయవచ్చని హెచ్చరించారు. ప్రత్యేకంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు, ఈ-కామర్స్ కొనుగోళ్లు, సోషల్ మీడియా వినియోగం విషయంలో అప్రమత్తత చాలా అవసరమని తెలిపారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌లు, ఈమెయిల్స్‌కు స్పందించకుండా ఉండాలని, అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయరాదని సూచించారు. ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోకూడదని స్పష్టం చేశారు. ఈ వయసు ఆ వయసు అనే తేడా లేకుండా ఏ వయసు వారైనా తప్పనిసరిగా సైబర్ భద్రతపై అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యార్థులు సాంకేతికతను సమర్థంగా ఉపయోగించడమే కాకుండా, దాని భద్రతా అంశాలపై కూడా పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు. సైబర్ నేరాల నివారణలో అవగాహనే ప్రధాన ఆయుధమని, ఇలాంటి వర్క్‌షాప్‌లు విద్యార్థులను భవిష్యత్తుకు సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, సైబర్ భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డీసీపీ కృష్ణ ప్రసన్న తెలిపారు.
కార్యక్రమంలో కేబీఎన్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి, కార్యదర్శి టి.శ్రీనివాస్, ఏవో వి.నారాయణరావు, డీసీపీ కృష్ణ ప్రసన్న, నక్ష్ ఫౌండేషన్ ఫౌండర్ రిషబ్ సింగ్, కో ఫౌండర్ రాషి భాటియా, ప్రాజెక్ట్ సైబర్ షీల్డ్ సౌత్ జోనల్ కోఆర్డినేటర్ యశశ్విని, విద్యార్థులు హాజరయ్యారు. సైబర్ నేరాల నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలన్న అంశాలపై విద్యార్థులు స్పష్టత పొందారు.
Prajavartha Online Telugu News