Breaking News

ప్రకృతి వ్యవసాయానికి కేంద్ర బడ్జెట్‌లో పెద్దపీట

– ఏపీ అభివృద్ధికి బలమైన పునాది
– కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందనలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర బడ్జెట్‌లో ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌లో దాని విస్తరణకు రూ.155.32 కోట్ల కేటాయింపులు చేయడం కేంద్ర ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతు సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ దేశ వ్యవసాయ రంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ఆయన కొనియాడారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతుల ఆదాయం పెరగడంతో పాటు భూమి సారాన్ని కాపాడుకునే అవకాశం కలుగుతుందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలకు ఈ కేటాయింపులు ఎంతో ఉపయోగకరంగా మారతాయని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ బడ్జెట్ బలమైన పునాదిగా నిలుస్తుందన్నారు. రైతుల ఆదాయ వృద్ధికి స్పష్టమైన దిశ ఈరోజు కేంద్ర బడ్జెట్‌లో చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోవడం హర్షణీయమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి కేంద్రంగా రూపొందిన ఈ బడ్జెట్ రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని అన్నారు. రిజర్వాయర్లలో చేపల పెంపకం, మత్స్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా గ్రామీణ ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని చెప్పారు. అలాగే పశు సంవర్ధక శాఖకు ప్రోత్సాహకాలు పెంచడం పాడి రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు.

అధిక విలువ కలిగిన పంటలకు ప్రోత్సాహం

వ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ కలిగిన పంటలకు కేంద్రం ప్రోత్సాహం ఇవ్వడం దూరదృష్టితో తీసుకున్న నిర్ణయమని మంత్రి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం వంటి పంటల సాగుకు ప్రోత్సాహం ఇవ్వడం దీర్ఘకాలికంగా రైతులకు లాభదాయకంగా మారుతుందని తెలిపారు. కొబ్బరి ఉత్పత్తి పెంపునకు ప్రత్యేక ప్రోత్సాహక పథకం ప్రకటించడం, కాయలు కాయని పాత చెట్ల స్థానంలో కొత్త చెట్ల నాటకానికి సాయం అందించడం ద్వారా తోటల ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని స్పష్టం చేశారు.

ఎన్డీఏ ప్రభుత్వంలో ఏపీ అభివృద్ధి వేగం

ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్న విశ్వాసాన్ని ఈ బడ్జెట్ మరింత బలపరుస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సమగ్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *