గుంటూరు/పెదకాకాని, నేటి పత్రిక ప్రజావార్త :
మహాశివరాత్రి పవిత్ర సందర్భంగా గుంటూరు జిల్లా పెదకాకానిలోని ప్రసిద్ధ శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దంపతులు స్వామివారిని, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు మంత్రి దంపతులకు ఆశీర్వచనం అందచేసి, స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందచేశారు. భక్తిశ్రద్ధలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో శివనామస్మరణతో వాతావరణం ఆధ్యాత్మికతతో పరవశించింది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మహాశివరాత్రి వంటి పర్వదినం రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, శుభం, శ్రేయస్సు ప్రసాదించాలి. పరమేశ్వరుడి కృపతో రాష్ట్రం సుభిక్షంగా, సుసంపన్నంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. శివుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు నిలవాలి అని ఆకాంక్షించారు. అలాగే ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. దేవస్థానం ఈవో పర్యవేక్షణలో దర్శనాలు, క్యూలైన్లు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సహాయం వంటి సదుపాయాలను సమర్థవంతంగా ఏర్పాటు చేశారని ప్రశంసించారు. భక్తులు ప్రశాంతంగా పూజలు నిర్వహించేలా ఆలయ సిబ్బంది శ్రమించడం అభినందనీయమని పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో జరుపుకోవాలని, శివనామస్మరణతో జీవితంలో ధైర్యం, దైవబలం పొందాలని మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Prajavartha Online Telugu News