తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో శాప్ లీగ్‌లో భాగంగా నిర్వహించిన స్టేట్ లెవెల్ చెస్ టోర్నమెంట్‌ను శాప్ చైర్మన్ రవి నాయుడు ఆధ్వర్యంలో టిటిడి బోర్డు సభ్యురాలు, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, హ్యాండ్లూమ్స్ & హ్యాండీక్రాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ హరి ప్రసాద్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య, శాప్ ఎండీ భరణి, మహేష్ యాదవ్, తోట వాసుదేవ్, శ్రీధర్ గారితో కలిసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్బంగా డా. హరిప్రసాద్ గారు మాట్లాడుతూ… “చెస్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు, అది ఆలోచనా శక్తికి అద్దం పట్టే విద్య. యువతలో ఏకాగ్రత, వ్యూహరచన, సహనం, నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించే మహత్తర క్రీడ. గ్రామీణ ప్రాంతాల్లో అపార ప్రతిభ ఉంది. ఆ ప్రతిభను వెలికితీసి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం ప్రభుత్వ సంకల్పం” అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, పేద మరియు గ్రామీణ క్రీడాకారులకు ఆర్థిక సహాయం, శిక్షణా సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. “మన రాష్ట్రం నుంచి ప్రపంచ స్థాయి చెస్ గ్రాండ్‌మాస్టర్లు తయారవ్వాలి. ఈ టోర్నమెంట్ ఆ దిశగా ఒక బలమైన అడుగు” అని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు పాల్గొని విజయవంతం చేశారు.
Prajavartha Online Telugu News