గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను పూర్తి స్థాయిలో కల్పించి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక ప్రకారం కృషి చేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, నగరపాలక సంస్థ మేయర్ కోవెలమూడి రవీంద్ర , శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ అహ్మద్, నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ తో కలిసి నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనుల పురోగతి, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనుల నాణ్యత పర్యవేక్షణకు సిటిజన్ చార్టర్ ద్వారా ప్రజలను బాగస్వామ్యం చేసే విధానం అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో ప్రధాన రహదారుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రజలకు ఇబ్బంది లేకుండా సత్వరమే పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం నగర ప్రధాన రహదారుల విస్తరణ, కాలువలు నిర్మాణ పనులు రానున్న రెండు నెలల్లో పూర్తి చేయాలని అప్పటి వరకు నూతన పనులు ప్రారంభించవద్దన్నారు. పనుల పురోగతిపై జరిగిన సమీక్షలు కేంద్రమంత్రి అధికారులకు సూచనలు ఇస్తూ శంకర్ విలాస్ ఆర్వోబి పనులు వేగవంతం చేయాలని, పెండింగ్ ల ఉన్న. భూసేకరణను పూర్తి చేయాలన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ 3 పనులు నిర్దేశిత సమయంలో పూర్తి అయ్యేలా కాంట్రాక్టర్ల పనులు సజావుగా నిర్వహించుకునేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి రిజర్వాయర్ల మరమత్తు పనులు నిర్వహించాలని, అమృత్ 2.0 మంజూరు చేసిన మంచినీటి రిజర్వాయర్ల పనులు, గోరంట్ల రిజర్వాయర్ పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీవీకే నాయుడు మార్కెట్, మానస సరోవరం, నల్లపాడు చెరువు పీపీపీ విధానంలో అభివృద్ధికి ఎపిటీఐసీఓ అధికారులు వెంటనే డిపిఆర్ అందించాలన్నారు. నగరంలో పూర్తిస్థాయిలో పారిశుధ్య నిర్వహణతో పాటు, ఈ – ఆటో లు, ఇతర ట్రాక్టర్లు, డంపర్ బిన్ లు అవసరం మేరకు సమకూర్చుకోవాలన్నారు. నగరపాలక సంస్థ లో పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన గ్లౌజులు ఇతర రక్షణ సామగ్రి ని అందించాలన్నారు. మే చివరినాటికి ప్రధాన, అంతర్గత డ్రైయిన్లు క్లీనింగ్ పూర్తి చేయాలన్నారు. నగరంలోని రహదారులపై పాట్ హోల్స్ మరమ్మత్తులు నిరంతరం నిర్వహించాలన్నారు. నగరంలోని పార్కులను స్థానిక వాకర్సు తో అసోసియేషన్ లను ఏర్పాటు చేసి వారితో నిర్వహణ చేసేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలన్నారు. హిందూ కళాశాల సెంటర్, బృందావన్ గార్డెన్స్, బొంగరాలబీడు రోడ్డు రహదారి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసి ప్రజలకు అసౌకర్యం లేకుండా పనులు నిర్వహించాలన్నారు. నగరంలో ఆర్ అండ్ బీ నుంచి నగరపాలక సంస్థ కు బదిలీ అయిన రహదారుల్లో ప్రతి ఆరునెలలకు ఒక రహదారిని సిమెంట్ రోడ్డు గా అభివృద్ధి చేయాలన్నారు. వీధిదీపాలు నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. వీధి కుక్కలకు వాక్సినేషన్ తో పాటు, ఎబిసి ఆపరేషన్లు ప్రస్తుతం సిద్ధం చేస్తున్న సెంటరుతో పాటు, మరో రెండు సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
అనంతరం కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో దాదాపు రూ. 400 కోట్ల విలువైన పనులను గుంటూరు పరిధిలో చేపట్టామన్నారు. అందులో ముఖ్యంగా 20 అంశాలపై సమీక్ష నిర్వహించామని. పనులు పురోగతిపై అధికారులతో సమీక్షించి మరింత వేగవంతం అయ్యేందుకు సూచనలు అందించామన్నారు. శంకర్ విలాస్ ఆర్వోబి ల్యాండ్ అక్విజేషన్ కు రాని, 20 మందికి నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ – 3 ఈ సంవత్సరం చివరకు పూర్తి చేయాలని సూచించామని, నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం కొన్నాళ్లుగా పనులు పెండింగ్లో ఉండగా, టెండర్ పిలిచామని,పనులు వేగవంతం జరిగేలా చర్చించడం జరిగిందన్నారు. శానిటేషన్, వాటర్ సప్లై కి సంబంధించి సమస్యలపై చర్చించామని, శానిటరీ వర్కర్లకు కావలసిన టాయిలెట్స్, సౌకర్యాలపై వసతులు కల్పించాలని కమిషనర్ గారికి వివరించామన్నారు. రోడ్లపై ఎక్కడ పెడితే అక్కడ డ్రైన్లలో వ్యర్ధాలను వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాము. గ్రీనరీ, ఎవెన్యూ ప్లాంటేషన్, పార్కుల నిర్వహణ తదితర అంశాలపై కాంట్రాక్ట్ ను మాడిఫైడ్ చేయాలి అని చర్చించామన్నారు. గుంటూరు నగర పరిధిలోని పలు ప్రధాన రహదారులలో ఇరువైపులా విస్తరణ నిమిత్తం డెమోలిష్ పనులు సగంలో ఆగాయి.ఆ పనులను త్వరగా పూర్తిచేసి వ్యాపారులకు ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులకు స్పష్టం చేశామన్నారు . ఆ పనులు త్వరగా పూర్తయిన తర్వాతే కొత్త టెండర్లు పిలవాలని చెప్పామని. ఆయా పనుల నిమిత్తం ప్రజలకు ఎకౌంటబిలిటీ ఉండే విధంగా కమిటీలను నిర్వహణ నిమిత్తం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించామన్నారు..రాబోయే 1-2 సంవత్సరాల్లో గుంటూరును అభివృద్ధి పథంలో నడిపించి మరింత వేగవంతంగా పనులు పూర్తి అయ్యేలా చూస్తామన్నారు. జి ఎం సి కి బాధ్యతలు నూతనంగా స్వీకరించిన కమిషనర్ మయూర్ అశోక్ గారు చాలా ఫాస్ట్ గా పనులు పూర్తయ్యేలా చూస్తున్నారని ప్రశంసించారు.
పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గల్లా మాధవి మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న కార్పొరేషన్ పనులపై చర్చించామన్నారు. ఏవైతే ఆగిన పనులు ఉన్నాయో వాటన్నింటినీ త్వరగా పూర్తిచేయాలని అధికారులకు తెలిపామన్నారు. పీవీకే నాయుడు మార్కెట్, నార్ల ఆడిటోరియం, కుక్కల బెడద వంటి పెండింగ్ సమస్యలపై దృష్టి పెట్టాలని తెలిపామన్నారు.
తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న అనేక పనులను గడిచిన 18 నెలల్లో పూర్తిచేసేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి రాబోయే సంవత్సరంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మానస సరోవర్ పార్క్ అభివృద్ధి నిమిత్తం కూడా ప్రభుత్వం వచ్చిన దగ్గరనుంచి ప్రయత్నిస్తున్నారని, .కనీస నిర్వహణ కూడా లేకుండా ఇబ్బందుల్లో ఉన్న పార్కుల నిర్వహణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చామన్నారు.
నగరపాల సంస్థ మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ శంకర విలాస్ ఆర్ఓబికి పెండింగ్ లో ఉన్న భూసేకరణకు షాపు యజమాను సహకరించి నగర అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం భూములు ఇచ్చినవారికి మెరుగైన పరిహారం అందిస్తున్నామన్నారు. నగరంలో పర్యాటక అభివృద్ధికి దీర్ఘకాలికంగా అభివృద్ధికి నోచుకోని మానవ సరోవరం పీపీపీ పద్ధతిలో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో నగరం నుంచి జాతీయ రహదారికి అనుసంధాన రహదారులను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరంలో అభివృద్ధి పనులు పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లకు సకాలంలో విధులు మంజూరు చేస్తున్నామని, నగరంలో జరిగిన రూ. 400 కోట్ల పనులలో ఇప్పటికే దాదాపు రూ. 310 కోట్లు చెల్లించారని, మిగిలిన నగదును దశలవారీగా చెల్లిస్తున్నారన్నారు. నగర అభివృద్ధిపై కేంద్ర మంత్రి నిరంతరం సమీక్షలు జరుపుతూ అధికారులకు మార్గ నిర్దేశం చేస్తున్నారన్నారు.
నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కేంద్రమంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర ప్రజాప్రతినిధులు సూచనలు పరిగణనలోకి తీసుకుని మరింత మెరుగైన చర్యలు తీసుకుంటామన్నారు. వర్షాకాలం నాటికి నగరంలోనికి డ్రైయిన్లు పూడికతీత పనులు పూర్తి చేయటం జరుగుతుందన్నారు. పుర సేవలోను, పీజీఆర్ఎస్ లో అందించిన అర్జీలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, ఆర్డీవో శ్రీనివాసులు, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ మేయర్ షేక్ సజీల, నగరపాలక సంస్థ ఎస్ఈ జి వెంకటేశ్వర్లు, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనివాసు, ఆర్ అండ్ బీ, మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News