జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా ఫార్మర్స్ కోపరేటివ్ సొసైటీ ఆవరణలో ఈరోజు నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆధునికీకరించిన కృష్ణ ఫార్మర్స్ సొసైటీ భవనాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. భవనంలో చేపట్టిన ఆధునికరణ పనులను పరిశీలించిన నెట్టెం రఘురాం, సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా రైతులకు మరింత సమర్థవంతమైన సేవలు అందించే దిశగా తీసుకున్న ఈ చర్యలను అభినందించారు. ముఖ్యంగా ఈ పనులను సమర్థవంతంగా అమలు చేసిన సొసైటీ చైర్మన్ యానాల గోపీచంద్ ని ప్రశంసించారు. ఈ సందర్భంగా 2021–22, 2022–23, 2023–24 సంవత్సరాలకు సంబంధించిన డివిడెండ్లను మొత్తం 2,926 మంది సభ్యులకు రూ.49,27,420లను పంపిణీ చేశారు. సమావేశంలో సంఘ ఆడిట్ నివేదికను ఆమోదించగా, సంఘం ఆర్థికంగా ప్రగతి పథంలో దూసుకెళ్తోందని చైర్మన్ యానాల గోపీచంద్ వివరించారు.
నెట్టెం రఘురాం మాట్లాడుతూ… 2025–26 ఆర్థిక సంవత్సరంలో సంఘం రూ.1.36 కోట్లు లాభాలు సాధించిందని తెలిపారు. ఇప్పటివరకు రూ.9 కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించి, రూ.45 కోట్ల రుణ వ్యాపారాన్ని విజయవంతంగా విస్తరించినట్లు పేర్కొన్నారు. సంఘం సమర్థవంతమైన నిర్వహణకు పాలకవర్గం మరియు సిబ్బందిని అభినందించారు. రైతులకు సకాలంలో రుణ చెల్లింపులపై వడ్డీ రాయితీ, అకాల మరణం చెందిన రైతు కుటుంబాలకు రూ.1 లక్ష వరకు బీమా, ప్రమాదవశాత్తు మరణించిన వారికి రూ.2 లక్షల వరకు కెడీసీసీబీ ద్వారా బీమా సదుపాయం అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా, గతంలో రూ.1 లక్ష వరకు ఉన్న వడ్డీ మాఫీ పరిమితిని రూ.3 లక్షలకు పెంచి, అసలు చెల్లించిన రైతులకు పూర్తి వడ్డీ మాఫీని 60:40 నిష్పత్తిలో బ్యాంకు మరియు సంఘం భరిస్తాయని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా రైతులకు మద్దతు అందిస్తున్నట్లు తెలిపారు. నీటి వినియోగం, డిమాండ్ ఆధారిత పంటలు, ఆధునిక వ్యవసాయ సాంకేతికత, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా రైతులు ఆదాయం పెంచుకోవాలని సూచించారు. 2025లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో గండ్రాయి సంఘాన్ని ముక్త్యాల సహకార సంఘంలో విలీనం చేయగా, సభ్యుల అభ్యర్థన మేరకు తిరిగి విభజన చేయాలని సర్వసభ్య సమావేశం తీర్మానం ఆమోదించి ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు.
కృష్ణా ఫార్మర్స్ కోపరేటివ్ సొసైటీని ఆధునికీకరణ దిశగా ముందుకు తీసుకెళ్తూ రైతులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో సంఘం ముందడుగు వేస్తోందని, కెడీసీసీబీ ద్వారా నెట్టెం రఘురాం నాయకత్వంలో రైతులకు నాణ్యమైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని అన్ని సొసైటీ చైర్మన్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మల్లెల సీతమ్మ, పిఎసిఎస్ అధ్యక్షులు ముల్లంగి రామకృష్ణారెడ్డి, కట్టా వెంకట నరసింహారావు, దూళిపాళ్ల లక్ష్మణరావు, మాజీ అధ్యక్షులు వెలమాటి చంద్రమౌళి, రైతు ప్రతినిధులు కొట్టారు సత్యనారాయణ ప్రసాద్, గడ్డం హుస్సేన్, మాజీ జడ్పిటిసి అమ్మనబోయిన రాణి, కెనాల్ చైర్మన్ కానూరు కిషోర్, దర్శి విజయ నరసింహారావు, కస్కుర్తి శ్రీనివాసరావు, సర్పంచ్ మైనేని రాధాకృష్ణ, కెడీసీసీ బ్యాంక్ సిబ్బంది, సంఘ సీఈఓ నారాయణరావు మరియు 13 గ్రామాలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News