-A.K.T.P.M. పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-అదనపు తరగతి గదుల నిర్మాణ పనుల పరిశీలన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రతి ప్రభుత్వ పాఠశాల ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మౌలిక సదుపాయాలు కల్గి ఉన్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలోని A.K.T.P.M పాఠశాలలో అభివృద్ధి పనులను పర్యవేక్షించవలసిందిగా స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తి ఎమ్మెల్యే ని కోరగా.. ఆయన ఆకస్మికంగా పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు తరగతి గదుల నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నెల రోజులలో పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విజయవాడ నగరంలోనే అత్యధికంగా 1,860 మంది విద్యార్థులు చదువుతున్న ఏకైక పాఠశాల A.K.T.P.M పాఠశాల అని మల్లాది విష్ణు అన్నారు. అటువంటి పాఠశాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు.. రూ. 42 లక్షలతో 6 అదనపు గదులను నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. పనులు పూర్తి చేసేందుకు మరో రూ. 8 లక్షలు అవసరమవుతుందని అంచనా వేసినట్లు తెలియజేశారు. దీనిని నగర కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి.. పనులు పూర్తిచేసే దిశగా కృషి చేస్తామన్నారు. దీనికి తోడు నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా పాత బ్లాక్ లో మరో 5 అదనపు తరగతుల గదుల నిర్మాణానికి పర్మిషన్ వచ్చిందని.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. మరోవైపు పాఠశాలలో ఏటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని.. ఒకటి, రెండు తరగతుల విద్యార్థులను సమీపంలోని సందక పరశురాములు పాఠశాలలోని అంగన్వాడీ స్కూల్ కు మార్చే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలియజేశారు. దీని ద్వారా హైస్కూల్ కు సంబంధించి ఎక్కువ మంది విద్యార్థులకు అడ్మిషన్ కల్పించేందుకు వీలు ఏర్పడుతుందని వివరించారు. అటు విద్యాప్రమాణాలను, ఇటు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి సర్కారీ స్కూళ్లను సరికొత్తగా తీర్చిదిద్దే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు గారు మరోసారి స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు యల్లాప్రగడ సుధీర్, ఎస్. శ్రీనివాస్, కె.ఫణి, కోలవెన్ను కొండ, కొప్పవరపు మారుతి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News