మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం సజావుగా చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర రావు ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లకు సూచించారు. జనాభా లెక్కల సేకరణ 2027 కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఎక్కడికక్కడ ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా మచిలీపట్నం మండలంలో జనాభా లెక్కలలు సేకరించే ఎన్యూమేరేటర్లకు, సూపర్వైజర్లకు మొదటి దశ రెండవ రోజు శిక్షణా తరగతులు మచిలీపట్నంలోని వై జె ఆర్ డి ఎం ఎస్ ఇంజనీరింగ్ కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించారు.
ఈ శిక్షణా తరగతులకు డిఆర్ఓ చంద్రశేఖర రావు ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ జనాభా లెక్కల సేకరణ రెండు దశలలో జరుగుతుందని, మొదటి దశలో ఇండ్ల జాబితా ఇండ్ల గణన, రెండవ దశలో జనాభా లెక్కల సేకరణ జరుగుతుందన్నారు. ఇండ్ల జాబితా ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఇండ్ల గణన కార్యక్రమంలో ఏ ఒక్క ఇల్లు తప్పిపోకుండా అన్ని ఇండ్ల వివరాలను సజావుగా సేకరించాలన్నారు. సేకరించిన వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనాభా లెక్కల మాస్టర్ ట్రైనర్లు ఎల్.మురళీ కిషోర్, కే. నాంచారయ్య, తహసీల్దారులు నాగభూషణం, కల్పన, సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News