– బీఎల్‌వోల ద్వారా 5,95,296 ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ-సర్ ప్రక్రియకు సంబంధించి ఇంటింటి సర్వే సాఫీగా జరుగుతోందని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
సర్ ప్రక్రియకు సంబంధించి జిల్లాలో 17,13,445 మంది ఓటర్లు ఉన్నారని, బీఎల్‌వోలు ఇప్పటివరకు 5,95,296 మంది (34.74%) ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించినట్లు, అదేవిధంగా 29,146 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తయినట్లు వెల్లడించారు. సర్ ప్రక్రియను సజావుగా నిర్వహించడంలో ఈ.ఆర్.ఓ.లు, ఏ.ఈ.ఆర్.వో.లు, బీ.ఎల్.వో.లు, సూపర్ వైజర్లు కీలక పాత్ర పోషించేలా దిశానిర్దేశం చేసినట్లు పేర్కొన్నారు. ఇంటింటి సర్వేలో భాగంగా జులై 14వ తేదీ వరకు బీఎల్‌వోలు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తారని, నింపిన వాటిని తిరిగి సేకరిస్తారని, ఇందుకు ప్రతి ఇంటికీ కనీసం మూడుసార్లు వెళ్లనున్నారని తెలిపారు. అర్హులను ఓటరు జాబితాలో ఉండేలా చేయడంతోపాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలసవెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉండటం వంటి వారి ఓట్లను తొలగించి స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితా లక్ష్యంగా చేపట్టిన ఈ సర్ ప్రక్రియలో ప్రజలు చైతన్యవంతంగా పాల్గొని ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు.
పోలింగ్ కేంద్రముల హేతుబద్దీకరణ: పోలింగ్ కేంద్రముల హేతుబద్దీకరణ విషయములో ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు పొందిన జాతీయ మరియు ప్రాంతీయ రాజకీయ పక్షముల ప్రతినిధులతో సమావేశమును త్వరలో ఏర్పాటు చేస్తామని, వారి వద్ద నుండి వచ్చిన సలహాలు, సూచనలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రముల జాబితాలను తయారు చేస్తామని, సవరించిన జాబితాలను ఈనెల 26 వ తేదీలోగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వారికి పంపుతామని, భారత ఎన్నికల కమిషన్ వారి ఆమోదం అనంతరం ఓటర్ల డేటా బేస్ యందు సవరణలను జూలై 14వ తేది లోపున పూర్తి చేస్తామని తెలిపారు.
Prajavartha Online Telugu News