-సీఎం చంద్రబాబు విజన్ తోనే భోగాపురం ఎయిర్పోర్ట్ సాకారం
-అడ్డుకున్నవారే క్రెడిట్ కోసం పాకులాడుతున్నారు
-భోగాపురంతో మారనున్న ఉత్తరాంధ్ర దశ – దిశ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతం కావడంపై పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో తాను భాగస్వామి అయి పాలుపంచుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలివచ్చి, కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ఉత్తరాంధ్ర ప్రజలకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం మరియు కమిటీ సభ్యుల సమన్వయ కృషి వల్లే ఈ కార్యక్రమం ఇంతటి ఘన విజయాన్ని సాధించిందని ఆయన కొనియాడారు.
ఈ సందర్భంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ తమదేనంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు నాంది పలికింది, పూర్తి చేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనని ఆయన స్పష్టం చేశారు. నాడు కనీసం ఎర్ర బస్సు కూడా రాని ప్రాంతానికి ఈరోజు అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌పోర్ట్‌ను తీసుకువచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని గర్వంగా చెప్పగలమన్నారు.
గతంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ఎన్నో కుట్రలు పన్నిన వారు, నేడు దాని క్రెడిట్ కోసం పాకులాడటం సిగ్గుచేటన్నారు. క్రెడిట్ కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పడుతున్న తాపత్రయం, ట్విట్టర్ వేదికగా చేస్తున్న వ్యాఖ్యలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి, నిరంతర పర్యవేక్షణ వల్లే ఈ బృహత్తర ప్రాజెక్టు సకాలంలో సాకారమైందని తెలిపారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర ప్రాంతం పారిశ్రామికంగా, పర్యాటకంగా సరికొత్త దూకుడు కనబరుస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రజల దశ-దిశను మార్చబోతోందని అన్నారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మించినా, నేడు నవ్యాంధ్రలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మించినా.. అది కేవలం చంద్రబాబు నాయుడి విజన్ వల్లే సాధ్యమైందని కొనియాడారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు.
Prajavartha Online Telugu News