

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాతృభాషను మరిచిపోతే మనుగడ ఉండదని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ పిళ్ళం గోళ్ళ శ్రీలక్ష్మి అన్నారు అన్నారు. ఫిబ్రవరి21న అంతర్జాతీయ మాతృభాషదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం విజయవాడలో ని హోటల్ శ్రీపాద కాన్ఫరెన్స్ హాల్ లో సభ ఏర్పాటయ్యింది. ఫిలాంత్రోపిక్ సొసైటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు డా.అద్దంకి రాజా పర్యవేక్షణలో శ్రీ శ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షుడు డా.కత్తిమండ ప్రతాప్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి ఆమె మాట్లాడుతూ పరభాషా వ్యామోహం లో పడి మాతృభాషను మర్చిపోవడం సిగ్గుపడే విషయమన్నారు. సుదీర్ఘ చరిత్ర గలిగి తెలుగు జాతి అభివృద్ధి పరచుకున్న జీవభాష తెలుగు భాషని ఆమె కొనియాడారు. పిఠాపురం రాజా వారసులు రాజారావువెంకట మహీపతిరామారావ్ మాట్లాడుతూ ఆదికవి నన్నయ నుంచి నేటివరకు తెలుగు భాష గద్య పద్యాత్మకంగా వివిధ ప్రక్రియలగా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.మాతృభాషను పరిరక్షించుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలుగు భాషాభివృద్ధి కి సాహిత్య అకాడమీ ఎంతో కృషి చేస్తుందని వెళ్ళడించారు. క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు మాట్లాడుతూ తూర్పు చాళుక్యుల కాలం నుంచి విజయనగర రాజుల కాలం వరకు తెలుగుకు ఇచ్చిన సముచిత స్థానాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం తెలుగుకు ప్రాధాన్యత ఇస్తూనే భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకుని ఆంగ్ల భాషకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెళ్ళడించారు. ఫిలాంత్రోపిక్ సొసైటీ అధ్యక్షుడు డా.అద్దంకి రాజా మాట్లాడుతూ దేశ భాషల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుని ‘లెస్సా’ అనిపించుకున్న తెలుగు భాషపట్ల నిర్లక్ష్యం తగదన్నారు. విదేశీయుడైన సి.పి.బ్రౌన్ తెలుగు భాష మాధుర్యాన్ని గుర్తించి తెలుగు భాషాభివృద్ధి కి ఎనలేని సేవ చేశారన్నారు. సభాధ్యాక్షులు డా.కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ మన భావాలు వెళ్ళడించడంలో మాతృభాషకు మించిన భాష మరొకటి లేదన్నారు. ప్రతిఒక్కరు మాతృభాషాభివృద్ధికి పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. కోలంక రాజ వంశీకులు రాజారావు వేంకటరాజ గోపాలకృష్ణ సూర్యారావు బహుదూర్, ఉయ్యూరు సంస్థాన రాజ వంశీకులు ఎం.ఎం.ఆర్.వి అప్పారావు బహుదూర్, శ్రీ శ్రీనాధ కవి సార్వభౌములు వారసులు డా.కావూరి శ్రీనివాస శర్మ,విశ్వనాథ సత్యనారాయణ వారసులు విశ్వనాథ సత్యనారాయణ, తెలుగు భాషాభివృద్ధి సమితి రాష్ట్ర అధ్యక్షుడు డా.గూటం స్వామి, పాల్గొని తెలుగు భాష గొప్ప తనాన్ని ప్రశంసిస్తూ ప్రసంగించారు. అనంతరం తెలుగు భాషకు విశిష్ట సేవలు అందించిన పలువురు కి తెలుగు తేజం జాతీయ పురస్కారాలను అందించి సత్కరించారు. తెలుగు తేజం జాతీయ పురస్కారగ్రహీతలు ప్రముఖ వాస్తునిపుణులు కే.వి. రెడ్డి, నల్లా సత్య కృష్ణ కిరణ్ ప్రసాద్ నల్లా విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఉండి తదితరులు మాట్లాడుతూ మనం ప్రపంచంలో ఎక్కడవున్నా మాతృ భాషను మరవకూడదన్నారు. మాతృ భాషాభివృద్దికి కృషి చేస్తామన్నారు. భావితరాలవారికి మన సంస్కృతి, సంప్రదాయాలు అందచేయవలిసిన భాద్యత మన అందరిదీ అని అన్నారు. మాతృభాషకు మించిన భాష మరొకటి లేదన్నారు. ఆద్యంతం ఎంతో వైభవంగా జరిగిన ఈ లలిత కళా ఉత్సవ్ కార్యక్రమంలో పుర ప్రముఖులు, సాహితీ వేత్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News