విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు అందుబాటులోకి వచ్చిన ఓపెన్ హార్ట్ సర్జరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ జె నివాస్ కోరారు. ప్రభుత్వ నూతన జనరల్ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ విభాగం 5 వ ఫ్లోరునందు ఓపెన్ హార్ట్ సర్జరీ, ప్రపంచ స్థాయి 8 మాడ్యులార్ ఆపరేషన్ ధియేటర్లను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ జె.నివాస్, కో చైర్మన్, శాసనసభ్యులు మల్లాది విష్ణు, జాయింట్ కలెక్టర్ ఎల్ శివ శంకర్ లు ప్రారంభించారు.
సర్వమత ప్రార్థనలు అనంతరం కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ మార్చి నాలుగో తేదీ నుండి ఓపెన్ హార్ట్ సర్జరీ స్పెషాలిటీ ఆపరేషన్ థియేటర్లు రోగులకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇది ఒక శుభ పరిణామమని, గతంలో ఓపెన్ హార్ట్ సర్జరీ కి సంబంధించి గుంటూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్ళవలసి వచ్చేదని, నేడు ఆ సౌకర్యాలు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చాయన్నారు. కార్పొరేట్ స్థాయి అత్యాధునిక వైద్య సేవలు నిరుపేదలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చి ఆధునిక వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ఈ సదుపాయాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయని ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
శాసనసభ్యులు మల్లాది విష్ణు వర్ధన్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య రంగంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమూలమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. ఇది ఒక మైలురాయి అని, అత్యాధునిక వైద్య సేవలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అందుబాటులోకి రావడం రోగులకు మరింత ప్రయోజనకారిగా ఉంటుందన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో నూతన ఒరవడికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని దీనిలో భాగంగానే కొత్తగా మెడికల్ కళాశాలలు ఏర్పాటు, అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. మార్చి 4వ తేదీ నుండి ఓపెన్ హార్ట్ సర్జరీ స్పెషాలిటీ ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి వస్తాయని ఈ సదుపాయాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ్యులు విజ్ఞప్తి చేశారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎల్.శివ శంకర్, సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్, సిద్ధార్థ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రాజ్యలక్ష్మి, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా॥వై.కిరణ్ కుమార్, సిఎస్ఆర్ఎమ్ఓ. డా. ఏ. హనుమంతరావు, డిప్యూటీ సూపర్డెంట్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఇన్చార్జ్ డా.సూర్యశ్రీ, డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డా. శోభ, ఆసుపత్రి హెచ్ఓడిలు, నర్సింగ్ విభాగం హెడ్స్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News