Breaking News

జాతీయ చేనేత ప్రదర్శన, అమ్మకం 2022

-మార్చి 4 నుండి జాతీయ చేనేత ప్రదర్శన, అమ్మకం
-19 రాష్ట్రాల నుండి వందలాది నేత కళాకారుల వస్త్ర శ్రేణి
-ప్రత్యేక రాయితీలతో ఆప్కో విక్రయ కేంద్రం
-చేనేత జౌళి శాఖ సంచాలకురాలు నాగరాణి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
చేనేత రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో మార్చి 4వ తేదీ నుండి 18వ తేదీ వరకు విజయవాడ వేదికగా జాతీయ చేనేత ప్రదర్శనను నిర్వహించనున్నట్లు రాష్ట్ర చేనేత జౌళి శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మార్కెటింగ్ వ్యూహాలను అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం ఈ రెండింటినీ అనుసంధానం చేయడం ప్రధాన ధ్యేయంగా దేశ వ్యాప్తంగా జాతీయ స్ధాయి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి విజయవాడ మొగల్రాజపురం లోని ఎ-ప్లస్ కన్వెన్షన్ సెంటర్ ఈ పదిహేను రోజుల ప్రదర్శనకు వేదిక కానుందన్నారు. చేనేత సంఘాలు, నేత కార్మికులు ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌లకు అనుగుణంగా రూపొందించిన తమ విభిన్న ఉత్పత్తులు, వినూత్న డిజైన్లను నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి దేశీయ మార్కెటింగ్ ఈవెంట్‌లు నిర్వహిస్తారని నాగరాణి పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ కేంద్ర చేనేత జౌళి మంత్రిత్వ శాఖ అభివృద్ది కమీషనర్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. అన్ని రాష్ట్రాలకు చెందిన సుమారు 90 అపెక్స్ చేనేత సొసైటీలు, ప్రైమరీ వీవర్స్ సొసైటీలు, అవార్డు విజేతలు తమ ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో చేనేత ప్రేమికులకు అందుబాటులో ఉంటాయన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత మూడు సంవత్సరాల నుండి వైఎస్ ఆర్ నేతన్న నేస్తం పధకం ద్వారా మగ్గం కలిగిన ప్రతి చేనేత కార్మికునికి ఏటా రూ.24 వేల చొప్పున దాదాపు రూ.600 కోట్లను వారి ఖాతాలకు జమ చేసిందని తద్వారా వారి మగ్గాలను ఆధునీకరించుకుని నూతన డిజైన్లను రూపొందించి డిమాండ్ కలిగిన వస్త్రాశ్రేణిని తయారు చేసి ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారని చేనేత జౌళి శాఖ సంచాలకులు నాగరాణి పేర్కొన్నారు. నూతనంగా రూపొందించిన వస్త్ర శ్రేణితో ఈ ప్రదర్శనలో ఆప్కో చేనేత ప్రేమికులను అలరిస్తుందని ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు తెలిపారు. ఆప్కో వస్త్రాలపై ప్రత్యేక రాయితీని సైతం అందిస్తున్నామని వివరించారు.

భిన్న రాష్ట్రాలు , విభిన్న డిజైన్లు : ఆంధ్రప్రదేశ్ నుండి ధర్మవరం, ఉప్పాడ, వెంకటగిరి చీరలు, చీరాల, మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్, పొందూరు కాటన్, సిల్క్ షర్టింగ్‌లు, కాటన్ షర్టింగ్‌లు, తెలంగాణ నుండి పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట సిల్క్ చీరలు, పోచంపల్లి, కొయ్యలగూడెం టై అండ్ డై బెడ్‌షీట్లు, వరంగల్ డర్రీస్, కరీంనగర్, హుజూరాబాద్ బెడ్‌షీట్లు, టవల్స్ అందుబాటులో ఉంటాయన్నారు. తమిళనాడు నుండి కంచి పట్టు చీరలు, మధురై చీరలు, సేలం కాటన్ ధోతీలు, చెన్నిమలై బెడ్‌షీట్లు, పాండిచ్చేరి నుండి బెడ్ షీట్లు, తువ్వాళ్లు, దిండు కవర్లు, కర్ణాటక నుండి మైసూర్ పట్టు చీరలు, ఇక్కత్ చీరలు, కేరళ నుండి బలరాంపురం చీరలు ఈ ప్రదర్శనలో లభిస్తాయన్నారు. ఒడిస్సా నుండి సంబల్‌పూర్ ఇక్కత్ చీరలు, బొంకాయి సిల్క్, కాటన్ చీరలు, పశ్చిమ బెంగాల్ కాటన్ చీరలు, పట్టు చీరలు, ముగా పట్టు, మధ్యప్రదేశ్ నుండి మహేశ్వరి, చందేరీ చీరలు, చందేరీ డ్రెస్ మెటీరియల్స్, ఉత్తర ప్రదేశ్ నుండి బెడ్ కవర్లు, లక్నో చికాన్ వర్క్స్ మొదలైనవి అందుబాటు ధరలలో విక్రయిస్తారన్నారు. ఢిల్లీ బెడ్ షీట్లు, కర్టెన్ క్లాత్, హర్యానా బెడ్ కవర్లు, బీహార్ – నలంద బెడ్ షీట్లు, భాగల్పూర్ చాదర్ సిల్క్, కాటన్ షర్టింగ్, గుజరాత్ లో ప్రత్యేకంగా లభించే పటోలా చీరలు, అరి ఎంబ్రాయిడరీ బెడ్ షీట్లు, సిల్క్-వర్క్ బెడ్ షీట్లు, లేస్ కాటన్ బెడ్ షీట్లు, రాజస్థాన్ – కోటా చీరలు, గోల్డ్ ప్రింటెడ్ రాజస్థానీ సల్వార్ సూట్లు, జమ్మూ కాశ్మీర్ తివాచీలు, శాలువాలు, ప్రత్యేక జాకెట్లు, బెడ్ షీట్లు, క్రివల్ బెడ్ షీట్లు, రాఫెల్ సూట్లు జాతీయ చేనేత ప్రదర్శనలో ప్రత్యేక అకర్షణగా నిలుస్తాయన్నారు.

చేనేత రంగం గురించి సంక్షిప్తంగా : దేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత రంగం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. వ్యవసాయం తర్వాత 65 లక్షల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధిని అందించే అతిపెద్ద ఆర్థిక కార్యకలాపాలలో ఇది ఒకటి. సమర్థవంతమైన ప్రభుత్వ జోక్యం, ఆర్థిక సహాయం, వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు ద్వారా ఈ రంగం పవర్ లూమ్, మిల్లుల నుండి పోటీని తట్టుకోగలిగింది. చేనేత రంగం దేశంలో ఉత్పత్తి చేయబడిన మొత్తం వస్త్రంలో దాదాపు 19శాతం వాటాను అందించటమే కాక, విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా గణనీయంగా జోడిస్తుంది. చేనేత యొక్క బలం వినూత్న డిజైన్‌లను పరిచయం చేయడంలో ఉంది,ఇది పవర్ లూమ్ రంగానికి ప్రత్యామ్నాయం కాదు. చేనేత భారతదేశ వారసత్వంలో ఒక భాగం, మన దేశం యొక్క గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని చూపుతూ నేత కార్మికుల కళాత్మకతకు ఉదాహరణగా నిలుస్తుంది. భారతదేశం పత్తి, పట్టు, జనపనార, నార, ఉన్ని మొదలైన వాటితో తయారు చేయబడిన సాంప్రదాయ చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది. వివిధ రాష్ట్రాల్లోని అనేక జిల్లాలు వాటి స్వంత నేత నమూనాలు, శైలులు, పద్ధతులను కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రాచీన కాలం నుండి చేతితో నేసిన వస్త్రానికి ప్రసిద్ధి చెందింది. సహకార, సహకారేతర విభాగాలలో దాదాపు 1.50 లక్షల చేనేత కుటుంబాలు ఉన్నాయి. కళాత్మకత, తక్కువ మూలధన పెట్టుబడి, కుటుంబ ఆధారిత నైపుణ్యాల కారణంగా చేనేత పరిశ్రమ ఎటువంటి అధికారిక శిక్షణ లేకుండా తరం నుండి తరానికి బదలాయింపబడట ప్రత్యేకత. దాదాపు 9 లక్షల మంది జనాభా చేనేత నేత, డైయింగ్, వైండింగ్, వార్పింగ్, సైజింగ్, డ్రెస్సింగ్, పీసింగ్ వర్క్స్ మొదలైన వాటిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *