-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉన్నత విద్యావ్యవస్ధలో జాతీయ విద్యా విధానం 2020 కీలక మార్పులకు శ్రీకారం చుట్టిందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. కడప యోగి వేమన విశ్వవిద్యాలయం తొమ్మిది, పది స్నాతకోత్సవాలు శుక్రవారం నిర్వహించారు. విశ్వవిద్యాలయ కులపతి హోదాలో రాజ్‌భవన్ నుంచి హైబ్రీడ్ విధానంలో ప్రసంగించిన బిశ్వభూషణ్ హరిచందన్ విద్యా విధానంలో సమూల మార్పులను తీసుకు వస్తూ విద్యార్ధులకు విలువలు సైతం నేర్పుతున్న నూతన విద్యావిధానం ఆచరణీయమన్నారు. విశ్వవిద్యాలయాలు విలువ ఆధారిత కోర్సులు రూపొందించటానికి నైపుణ్యం పెంపుదల కు అవసరమైన వనరులు సమకూర్చటానికి నూతన విధానం సహకరిస్తుందన్నారు. స్ధాపించిన పదిహేనేళ్ల వ్యవధిలో యోగి వేమన విశ్వవిద్యాలయం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌ను సాధించి తొలి 150 విద్యాసంస్థల్లో ఒకటిగా నిలవడంతో పాటు న్యాక్ ‘బి’ గుర్తింపు పొందటం ముదావహమన్నారు.
75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను జరుపుకుంటోందన్నారు. సైయంట్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, పద్మశ్రీ డా.బి.వి.ఆర్. మోహన్ రెడ్డికి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను అందించటం అభినందనీయమని గవర్నర్ పేర్కొన్నారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరిచే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని ఆమోదించిందన్నారు. పాఠశాల, ఉన్నత విద్యా స్థాయిలో దీని అమలును ఇప్పటికే ప్రారంభించామన్నారు.
గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, రీసెర్చ్ స్కాలర్లు, గోల్డ్ మెడల్ అవార్డు గ్రహీతలను ఈ సందర్భంగా కులపతి అభినందించారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషి చేసినందుకు ఉపకులపతి డాక్టర్ ఎం. సూర్య కళావతి, విశ్వవిద్యాలయ అధ్యాపక, అద్యాపకేతర బృందాన్ని గవర్నర్ ప్రశంసించారు. విజయవాడ రాజ్ భవన్ నుండి గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా పాల్గొనగా, విశ్వవిద్యాలయంకు చెందిన డాక్టర్ ఎస్.రఘునాథరెడ్డి, డాక్టర్ పి.చంద్ర ఓబుల్ రెడ్డిలు గవర్నర్‌ను జ్ఞాపికతో సత్కరించారు.
Prajavartha Online Telugu News