మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అనాదిగా మహిళలకు గౌరవం ఇచ్చే సంస్కృతి మనదని, కొన్ని జాఢ్యాల వల్ల మూఢత్వం పెరిగి మహిళల పట్ల చిన్నచూపు చూడటం ప్రారంభమైందని ఫలితంగా ఎన్నో ప్రతికూల ప్రభావాలు పలుచోట్ల కనిపిస్తున్నాయిని అందుకే సమాజంలో మహిళలకు తగిన గౌరవంతో పాటు సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ప్రతి పురుషునిపై ఉందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) నిర్వచించారు
మంగళవారం ఆయన రెండవ రోజు శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ప్రయాణమవుతూ ఉదయం 6:30 గంటల సమయంలో తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకొని వారి ఇబ్బందులను అడిగి తెలుసుకొని అనేక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.
తొలుత 1 వ డివిజన్ కు చెందిన కొల్లూరి రాజేశ్వరి తన తల్లి, కార్పొరేటర్ జోగి చిరంజీవితో వచ్చి మంత్రి పేర్ని నానిను కల్సింది. ఇటీవల తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో ఇంటర్నేషనల్ వండర్ వరల్డ్ సంస్థ రవి మచ్చాయ్ యు ట్యూబ్ ఛానెల్ సంయుక్త నిర్వహణలో 1000 మంది బాలికలతో జానపద నృత్య పోటీలు ఘనంగా నిర్వహించారని, ఆ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించినందుకు తనకు నిర్వాహకులు ప్రశంసాపత్రం బహుకరించారని తెలిపి తనను ఆశీర్వదించాలని ఆమె కోరింది. ఈ విషయమై స్పందించిన మంత్రి పేర్ని నాని ఆమెతో మాట్లాడుతూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున శుభవార్తను తనకు తెలియచేసినందుకు అభినందనలు దీవెనలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. మారుమూల ప్రాంతాల నుంచి ప్రతిభతో ఎందరో మహిళలు స్వయం ప్రకాశికులుగా వెలుగొందుతున్నారని ఇది ఎంతో అభినందించదగ్గ విషయమని అన్నారు. ఒలింపిక్స్ లో సైతం మన కీర్తిని ప్రపంచ దేశాలకు మహిళలే చాటుతున్నారన్నారు. ఇటీవలి కాలంలో విద్యారంగంలో అమ్మాయిలు, అబ్బా యిలతో పోటీపడటమే కాక వారికంటే మెరుగైన ఫలితాలను సాధిస్తున్న నేపథ్యం గమనార్హమన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా ఎస్ఎస్సీ, ఇంటర్మీ డియట్, ఎంసెట్ పరీక్షల్లో బాలికల హవా కొనసాగడం చూస్తున్నామని ఇది తెలుగు రాష్ట్రాల అనుభవమే కాదని, ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానాలో కూడా ఇదే కనిపిస్తున్నదని మంత్రి చెప్పారు. జాతీయ స్థాయిలోని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షల్లో కూడా బాలికలు తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారని తెలియచేస్తూ ఆర్గనైజేషన్ ఆఫ్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (ఓఈసీడీ) అధ్యయనం సైతం దాదాపు ప్రతి ఏటా బాలికలే టాపర్లుగా నిలుస్తున్నారని తేల్చిందని మంత్రి వివరించారు.
మచిలీపట్నం మండలం పెద యాదర గ్రామానికి చెందిన లింగం చంటి బాబు మంత్రిని కలిసి తన భార్య తీవ్రమైన జబ్బుతో బాధపడుతుందని వైద్యానికి ఎంతో ఖర్చు అవుతుందని, తన భార్యకు ఏదైనా పింఛన్ వచ్చేలా సహాయం చేయాలని అభ్యర్ధించారు.
స్థానిక కోటావారితుళ్ల సెంటర్ కు చెందిన ప్రవీణ్, కరగ్రహారానికి చెందిన జీవన్ లు మంత్రిని కలిసి తమ ఇబ్బందిని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇశ్రమ్ పోర్టల్ అందుబాటులోకి తీసుకువచ్చిందని పలువురు కార్మికులుఈ వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే వారికి కేంద్ర ప్రభుత్వం ఇశ్రమ్ కార్డును అందిస్తోందని ఇప్పటి వరకు దేశంలో 8 కోట్లకు పైగా అసంఘటిత రంగంలోని కార్మికులు ఇశ్రమ్ పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నవారికి ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన బెనిఫిట్ లభిస్తుందని తెలిపారు. తొలి ఏడాది కేంద్ర ప్రభుత్వమే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రీమియాన్ని చెల్లిస్తుందని పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న వారికి ఉచితంగా రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా కవరేజ్ లభిస్తుందన్నారు. కామన్ సర్వీస్ సెంటర్ అర్హత లేనివారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డులు లేనివారు కార్మికులను మోసం చేస్తూ మన ప్రాంతంలో ఇశ్రమ్ రిజిస్ట్రేషన్లు పెద్ద మొత్తంలో చేస్తున్నారని దీంతో కార్మికులకు వచ్చే సబ్సిడీలు దక్కవని, కామన్ సర్వీస్ సెంటర్ అర్హత ఉన్న తమపై తగాదాలకు కొంతమంది పాల్పడుతున్నట్లు తెలిపారు.
మచిలీపట్నం మండలం భోగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన దాసీ నాంచారమ్మ అనే వృద్ధురాలు మంత్రిని కలిసి తన సమస్య తెలిపింది. తనకు కాళ్ళు నొప్పులు చురుకులు, మంటలు బాగా ఉన్నాయని, పనికి వెళ్లలేని పరిస్థితి ఉందని షుగర్ , బీపీ తనకు ఉందని పింఛన్ ఏదైనా మంజూరు చేస్తే, ఆర్ధిక ఇబ్బందులు తెలియకుండా జీవితం కొనసాగిస్తానని తెలిపింది.
Prajavartha Online Telugu News