Breaking News

విద్యుత్ డిస్కాముల బలోపేతం తక్షణ అవసరం


-విద్యుత్ సంస్థలు ఆర్థికంగా, బలంగా ఉంటేనే రాష్ట్రానికి , వినియోగదారునికి మేలు
-24X7 విద్యుత్ సరఫరా కొనసాగేందుకు ఆర్థిక వృద్ధి సాదించేందుకు ,ఆర్థికంగా బలమైన డిస్కాములు అవసరం
-ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి సాధించడంలో నిరంతర విద్యుత్ ది కీలక పాత్ర
-ఏ పీ ఈ ఆర్ సి చైర్మన్ జస్టిస్ సి వీ నాగార్జున రెడ్డి
-24 x 7 విద్యుత్ సరఫరా కోసం కొన్ని సమయాల్లో యూనిట్ కు రూ 20 వెచ్చించి బహిరంగ మార్కెట్లో కొనుగోలు
-ఏపీఈఆర్సి చైర్మన్ కు “ది గ్రేట్ సన్ అఫ్ ఇండియా ” అవార్డు సందర్భంగా ఏపీసిపీడీసిఎల్ సన్మానం
-డిస్కాముల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం — ఇంధన శాఖ కార్యదర్శి , బీ శ్రీధర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో విద్యుత్ పంపిణి సంస్థలను ( డిస్కాములు ) ఆర్థికంగా బలోపేతం చేయడానికి తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ ఎలక్ట్రిసిటీ రేగులేటరీ కమిషన్ (ఏపీఈఆర్సి ) చైర్మన్ జస్టిస్ సి వీ నాగార్జున రెడ్డి పేర్కొన్నారు . రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు మున్ముందు మనుగడ సాగించాలన్నా, వినియోగదారులకు 24X 7 నాణ్యమైన విద్యుత్ సరఫరా మరింత పటిష్టంగా కొనసాగాలన్నా , అలాగే రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు మరింత పుంజుకోవాలన్నా డిస్కాములను ఆర్థికంగా బలోపేతం చేయడం తప్పనిసరి అని ఆయన తెలిపారు.
ఏపీఈఆర్సి చర్మన్ జస్టిస్ సి వీ నాగార్జున రెడ్డి కు రాష్ట్ర గవర్నర్ విశ్వ భూషణ్ హరిచంద్రన్ ప్రతిష్టాత్మకమైన “ది గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా” అవార్డు ను బహుకరించిన సందర్భంగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ(సి పీ డీ సి ఎల్) సిఎండీ జె పద్మ జనార్ధన రెడ్డి నేతృత్వంలో ఆయనకు సన్మాన సభ జరిగింది. ఈ సందర్భంగా ఏపీఈఆర్సి చైర్మన్ మాట్లాడుతూ డిస్కాములను ఆర్థికంగా సాంకేతిక పరంగా బలోపేతం చేయటం ద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన నాణ్యమైన సేవలు అందేలా చేయటమే ఏపీఈఆర్సి లక్ష్యమని తెలిపారు . రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి సాధించాలంటే ఆర్థికంగా పటిష్టమైన విద్యుత్ వ్యవస్థ అత్యావశ్యకమని ఆయన స్పష్టం చేసారు. త్వరతగతిన అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా మున్ముందు ఆంధ్ర ప్రదేశ్ లో పట్టణీకరణ పెరగడం తో పాటు ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయని దీని వల్ల విద్యుత్ డిమాండ్ అనేక రేట్లు పెరిగిపోతుందని ఆయన తెలిపారు.
ఈ దృష్ట్యా సమర్ధవంతమైన , ఆరోగ్యకరమైన , సాంకేతికంగా ఆర్థికంగా బలంగా ఉన్న విద్యుత్ సంస్థలను నిర్మించుకోవాల్సిన అవసరం రాష్ట్రానికి ఎంతైనా ఉందన్నారు . విద్యుత్ సంస్థలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతుండడం రాష్ట్రానికి శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు . ఈ దృష్ట్యా రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల పరిష్కరించి విద్యుత్ రంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేరొన్నారు . రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా వినియోగదారులకు 24×7 నాణ్యమైన విద్యుత్ భవిష్యత్ లో కొనసాగాలన్నా ఈ చర్యలు తప్పనిసరి అని పేర్కొంన్నారు .
విద్యుత్ సంస్థల ఆదాయ-వ్యయాలకు మధ్య అంతరం పెరిగిపోతున్నదని , దీనిని తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు . విద్యుత్ కాస్ట్ అఫ్ సర్వీస్ 2016-17 లో యూనిట్ కు రూ 5.33 ఉండగా అది 2020-21 నాటికి రూ 6.87 కు పెరిగింది. అలాగే 24x 7 నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించే లక్ష్యం తో డిస్కాములు కొన్ని సమయాల్లో యూనిట్ కు రూ 20 వెచ్చించి బహిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనుగోలు చేసి వినియోగదారులకు సరఫరా చేస్తుందని తెలిపారు . దీని వల్ల విద్యుత్ సంస్థల పై పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. ఇదే గాక మరికొన్ని ఇతర కారణాల వల్ల కూడా విద్యుత్ సంస్థలు తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ఈ దృష్ట్యా డిస్కాములను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వినియోగదారులు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఏపీసీపీడీసిఎల్ నిర్వహించిన సన్మానం అనంతరం చైర్మన్ స్పందిస్తూ , సమాజానికి సేవ చేయాలనే నిబద్ధత తో కృషి చేసిన ప్రతి ఒక్కరిని సమాజం గుర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే గుర్తింపుతో నిమిత్తం లేకుండా ప్రతీ ఒక్కరు తాను నివసిస్తున్న సమాజానికి ఎదో ఒక మేలు చేసేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు . సేవే లక్ష్యంగా ప్రతీ ఒకరు బాధ్యతతో మెలగాలన్నారు . విద్యుత్ సంస్థల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ప్రతి నిత్యం సమాజానికి సేవ చేసే భాగ్యం లభిస్తుందన్నారు. దీనిని ప్రతి ఉద్యోగి సద్వినియోగం చేసుకునే అవసరముందన్నారు .
ఇంధన సామర్ధ్య జీవన శైలిని అలవరుచుకోవటం ద్వారా ప్రతి ఒక్కరు పర్యావరణానికి తద్వారా సమాజానికి ఎంతో మేలు చేసిన వారవుతారని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో ఇంధన సామర్ధ్య చర్యలను ప్రోత్సహించడం ద్వారా విద్యుత్ సంస్థల పై ఆర్థిక భారం తగ్గడంతో పాటు వినియోగదారుల ప్రయోజనాలు పరిరక్షించేందుకు దోహదపడుతుందని తెలిపారు. అలాగే దైనందిన జీవితం లో ఇంధనం సామర్ధ్య చర్యలను అవలంబిచే వినియోగదారులకు విద్యుత్ బిల్లులు కొంత మేర తగ్గే అవకాశం ఉందన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ సంస్థలన్నీ సంయుక్తంగా కృషి చేయడం ద్వారా ఇంధన సామర్థ్యం పెంపొందించడం తో పాటు పర్యావరణానికి , వినియోగదారులకు కూడా మేలు జరుగుతుందని పేర్కొన్నారు .
గత రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో డిస్కాములను ఆదుకుందేందు ప్రభుత్వం రూ 30000 కోట్ల మేర ఆర్థిక సహకారం అందించిందని ఇంధన శాఖ కార్యదర్శి, బీ శ్రీధర్ తెలిపారు. విద్యుత్ సంస్థలను ఆదుకునేందుకు రాష్ట్రంలలో ఇంత పెధ్ద ఎత్తున ఆదుకున్న రాష్ట్రం మారేది ఉండకవచ్చునని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతగా ఆర్థిక, నైతిక సహకారం అందిస్తునప్పటికీ ఏటా రెవిన్యూ గ్యాప్ పెరిగిపోతూనే ఉందన్నారు. ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి , మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిల సహకారం తో విద్యుత్ సిబ్బంది వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు . రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఉండటం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఏపీఈఆర్సి ఈ నెల 30 న తిరుపతి లో నూతన టారిఫ్ ఆర్డర్(2022-23) ను విడుదల చేసే అవకాశం ఉంది.
జేఎండీ హెహ్ ఆర్ డీ / ఏ పీ ట్రాన్స్కో , ఐ పృద్వి తేజ్ , జె ఎం డీ విజిలెన్సు , బీ మల్లా రెడ్డి , డిస్కామ్ సి ఎం డీలు , హెచ్ హరనాథ రావు, జె పద్మ జనార్ధన రెడ్డి , కే సంతోష రావు ఇతర సీనియర్ అధికారులు, సమాజానికి ముఖ్యంగా పర్యావరణానికి చేసిన విశిష్ట సేవలకు గాను ఏపీ గవర్నర్ నుంచి ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నందుకు ఏపీఈఆర్సీ చైర్మన్ను అభినందించారు.

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *