అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా (మైనారిటీల సంక్షేమం) అంజాద్ భాషా షేక్ బిపారి మంగళవారం మద్యాహ్నం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం మూడో బ్లాక్ మొదటి అంతస్తులోని ఆయన ఛాంబరులో ముస్లిం మత పెద్దల ఆశీర్వచనం అనంతరం ఉప ముఖ్యమంత్రిగా (మైనారిటీల సంక్షేమం) ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం మైనారిటీల సంక్షేమ శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ ఇంతియాజ్, కర్నూలు శాసన సభ్యులు అబ్దుల్ హఫీజ్ ఖాన్ తో పాటు పలువురు అధికారులు, అనధికారులు ఉప ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రెండోసారి కేబినెట్ లో అవకాశం కల్పించినందుకు యూవత్ మైనారిటీల తరపున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ఈ అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మైనారిటీల పై ఉన్న ప్రేమను ముఖ్యమంత్రి ఈ విధంగా చాటుకున్నారన్నారు. ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటానన్నారు. గత మూడేళ్ల కాలంలో ఎన్నోగడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, ఆదాయ వనరులు తగ్గినప్పటికీ సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాలకు ఎటు వంటి ఆటంకం లేకుండా అమలు పర్చిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిగారికి దక్కుతుందన్నారు. విద్య, వైద్య, ఆరోగ్యం, వ్యవసాయం, గృహ నిర్మాణం, పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత తదితర అంశాలకు ప్రాధాన్యత నిస్తూ నవరత్నాలు పథకాలను పెద్ద ఎత్తున అమలు పర్చి సంతృప్తికర స్థాయిలో పథకాలను పేదలకు అందజేయడం జరిగిందన్నారు. జగనన్న చేయూత పథకం ఎంతో గొప్ప పథకం అని, 45-60 ఏళ్ల మద్య నున్న మహిళలు తమ కాళ్లపై వారు నిలబడే విధంగా చిన్నచిన్న పారిశ్రామిక వేత్తలుగా వారిని తీర్చిదిద్దడం జరుగుచున్నదన్నారు. మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యానికి నాంధిపలుకుతూ గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రజల ముంగిటకే పాలనను తీసుకు వెళ్లి పరిపాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర చరిత్రలోనే మైనారిటీల సంక్షేమానికై చారిత్రాత్మకమైన రెండు బిల్లులను బడ్జెట్ సెషన్ లో ఆమోదించడం జరిగిందన్నారు. దేశంలోనే తొలిసారిగా మైనారిటీ జనాభా ప్రాదిపదికన సుమారు 14 శాఖల నుండి మైనారిటీల సంక్షేమానికై వెచ్చించాల్సిన నిధులను తప్పకుండా వెచ్చించే విధంగా మైనారిటీల కాంపొనెంట్ బిల్లు ను మరియు ఉర్దూ భాషను రెండవ అధికార భాషగా ప్రకటించే బిల్లు ను తీసుకువచ్చి మైనారిటీల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని ముఖ్యమంత్రి పొందారని ఆయన అభినందించారు. దివంతగనేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మైనారిటీల సంక్షేమాన్ని కాంక్షిస్తూ విద్యా, ఉపాధి రంగాల్లో 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తే, ఆయన తనయుడు అయిన వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మైనారిటీలకు రాజకీయ సాధికారత కల్పించే విధంగా పెద్ద ఎత్తున మైనారిటీలకు పదవులను కట్టబెట్టారన్నారు. నన్ను ఉప ముఖ్యమంత్రిగా చేయడమే కాకుండా శాసన మండలిలో నలుగురు ముస్లింలకు అవకాశం కల్పించారని, ఒక ముస్లిం మహిళకు శాసన మండలిలో డిప్యూటీ చైర్ పర్సన్ గా పదవిని ఇవ్వడం ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికే చెల్లిందన్నారు. నామినేటెడ్ పధవుల్లోకూడా మైనారిటీలకు పెద్ద పీఠ వేయడం జరిగిందని, రాష్ట్ర స్థాయి చైర్మన్ పధవుల్లో సుమారు 12 మంది మైనారిటీలకు అవకాశం కల్పించడం జరిగిందని, 12 మున్సిఫల్ మేయర్ల పదవుల్లో ఇద్దరు మైనారిటీలకు అవకాశం కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు. అదే విధంగా మున్సిఫల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్, ఎం.పి.టి.సి.లు, జడ్.పి.సి.లు, మార్కెట్ యార్డు చైర్మన్ పదవుల్లో కూడా మైనారిటీలకు పెద్ద ఎత్తున అవకశాలు కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఎంతో నిర్లక్ష్యానికి గురైందని, తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుండి మైనారిటీ శాఖను గాడిలో పెట్టడం జరిగిందని, అవినీతికి పాల్పడిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. వక్పు బోర్డు ఆస్తులు ఎంతగానో అన్యాక్రాంతం అయ్యాయని, తాను బాధ్యతల స్వీకరించిన తదుపరి సుమారు 580 ఎకరాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో అన్ని జిల్లాలో పర్యటిస్తూ వక్పు బోర్డు ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటానని, మైనారిటీ సామాజిక వర్గాల సంక్షేమానికి కృషిచేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News