-చినగొల్లపాలెంలోని గడప గడపకు మన ప్రభుత్వం పర్యటనలో మంత్రి జోగి రమేష్
చినగొల్లపాలెం/గౌడపాలెం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాల పట్ల ప్రజలందరు సంతృప్తిగా ఉన్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. గురువారం ఆయన కృత్తివెన్ను మండలం, చినగొల్లపాలెంలో మూడవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై లబ్ధిదారులను ఆరా తీశారు. ఆ కుటుంబానికి ఇప్పటివరకు అందిన పథకాల లబ్ధిని గురించి ఆయన వారికి పథకాల వారీగా వివరించారు. మంత్రి అరవ లక్ష్మీ ఇంటికి వెళ్లి, ఎలా ఉన్నాయి పరిస్థితులు అప్పటికీ ఇప్పటికీ అని ఆమెను అడగ్గా, అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పుణ్యం వల్ల ఉప్పుటేరు మీద మా గ్రామానికి రెండు వంతెనలు వేసి గొప్ప మేలు చేశారని, ఇప్పుడు ఆయన కొడుకు వచ్చి మాకు ఏమీ అవసరమో వాటిని మా ఇంటి గుమ్మాలోకి వచ్చేవిధంగా వాలంటీర్ల ద్వారా అందిస్తున్నారన్నారు. అందుకు ఆమె ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసింది. తమకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని బట్రాజు అన్నపూర్ణ అనే మహిళ మంత్రి దృష్టికి తీసుకురాగా ఆ సమస్యను పరిష్కరించాలని వెంట ఉన్న విద్యుత్ అధికారులకు ఆయన సూచించారు. మధ్యాహ్నం ఆయన భోజన విరామ సమయంలో మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కుల, మత, పార్టీలకతీతంగా ప్రజల గడప వద్దకే సంక్షేమ పథకాలను చేరుస్తున్నారన్నారు. నవరత్నాల పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా చేరుతున్నాయా లేదా అని తెలుసుకోవడంతో పాటు ప్రజలకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజాప్రతినిధులకు ఉపయోగపడుతుందన్నారు. గ్రామంలో కొద్దిపాటి నీటి సమస్య ఉందని, త్వరలో దానిని పరిష్కరిస్తామన్నారు. పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలందరు సంతృప్తికరంగా ఉన్నారని తెలిపారు. కృతివెన్ను మండలం జెడ్పీటీసీ మైలా రత్న కుమారి, ఎంపీపీ గరుడ ప్రసాద్, గ్రామ సర్పంచ్ పెనుమాల సునీల్, ఆర్బీకే చైర్మన్ సూరిబాబు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వైసీపీ నాయకులు తదితరులు మంత్రి వెంట ఉన్నారు.
Prajavartha Online Telugu News