సీఎం వైఎస్ జగన్ తోనే సామాజిక న్యాయం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-26వ డివిజన్ 31 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలోనే సామాజిక న్యాయాన్ని చేతల్లో అమలు చేసి చూపిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. బుధవారం 26 వ డివిజన్ 31 వ వార్డు సచివాలయం పరిధిలో వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి అంగిరేకుల నాగేశ్వరరావు గొల్లభామ, పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వార్డు సచివాలయ పరిధిలోని 960 గృహాలలో, 284 గడపలను సందర్శించారు. నార్ల వారి వీధి, బుల్లెమ్మ వీధి, కుటుంబరావు గారి వీధులలో పర్యటించిన ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రజల నుంచి ఆత్మీయ ఆదరణ లభించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమకు అండగా నిలుస్తున్నాయని, ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నాయని ప్రజలు చెప్పారు. వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్లలో నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేశామని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. డివిజన్ లోనూ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కుటుంబరావు వీధిలో నూతన రోడ్లు, సైడ్ డ్రెయిన్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అప్పటివరకు వర్షాకాలంలో ఎక్కడా డ్రైనేజీ సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.

అగ్రవర్ణ పేదలకు ఈబీసీ నేస్తం ఓ వరం
ఈబీసీ నేస్తం పథకం ద్వారా లబ్ధి పొందిన పలువురు అక్కచెల్లెమ్మలతో ఎమ్మెల్యే మల్లాది విష్ణు కాసేపు ముచ్చటించారు. ప్రతి సంక్షేమ పథకంలోనూ మహిళలనే ప్రధాన లబ్దిదారులుగా జగనన్న ప్రభుత్వం ఎంపిక చేస్తోందని ఈ సందర్భంగా వెల్లడించారు. అగ్రవర్ణాలలోనూ పేదలు ఉన్నారని గుర్తించిన తొలి ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాత్రమేనని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినా రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర అగ్రవర్ణ సామాజికవర్గాల్లోని పేద మహిళలకు కూడా మేలుచేయాలన్న సత్సంకల్పంతో ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. నియోజకవర్గంలో 1,947 మందికి గత ఆర్థిక సంవత్సరం రూ. 2 కోట్ల 92 లక్షల 5 వేల మేర లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. అటువంటి ప్రభుత్వానికి అండగా నిలవాలని అక్కచెల్లెమ్మలను కోరారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. స్వతంత్య్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ గతంలో సామాజిక ధర్మం పాటించలేదని, ఆంధ్రప్రదేశ్‌ లో మాత్రమే సీఎం వైఎస్ జగన్‌ సామాజిక న్యాయం పాటించారని మల్లాది విష్ణు అన్నారు. మంత్రివర్గం కూర్పు నుంచి నామినేటెడ్ పదవుల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దఎత్తున పదవులు కేటాయించడం ద్వారా జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారన్నారు. మూడేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న సామాజిక న్యాయాన్ని మేధావులు సైతం కీర్తిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి గిరిజన మహిళ ద్రౌపది ముర్ము గారిని ఎన్డీయే ఎంపిక చేసిన నేపథ్యంలో.. సామాజిక న్యాయానికి కట్టుబడిన పార్టీగా వైఎస్సార్ సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. కానీ ఎస్టీ, మైనారిటీలకు నాలుగున్నరేళ్లు కేబినెట్ లో స్థానం కల్పించని చంద్రబాబు.. ముర్ము గారిని బలపరచడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెగ నటించేస్తున్నారని మల్లాది విష్ణు విమర్శించారు. నటనలో చంద్రబాబు స్వర్గీయ ఎన్టీఆర్ నే మించిపోయారని ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయం అనే పదం ఉచ్ఛరించే ముందు అణగారిన వర్గాలకు ఏం చేశారో ప్రతిపక్షనేత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని.. ఇందులో భాగంగా ఇప్పటికే హైపర్‌ కమిటీని నియమించినట్లు మల్లాది విష్ణు తెలిపారు. అప్పటివరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, ఏఈ(ఇంజనీరింగ్) వెంకటేష్, డివిజన్ కోఆర్డినేటర్ కోలా నాగాంజనేయులు, నాయకులు భోగాది మురళి, శంకర్, రమణ, పారా ప్రసాద్, శివ, ఆనంద్, బాడిత వెంకట్రావు, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *