
-మధుమేహ వైద్య చికిత్సల్లో ఎదురవుతున్న సవాళ్లు, నూతన ఆవిష్కరణలపై విస్తృత చర్చ
-దాదాపు 600 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం
-సమావేశంలో భాగంగా ఆర్ఎస్ఎస్డీఐ ఏపీ చాప్టర్ నూతన కార్యవర్గ పదవీ ప్రమాణం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 17న రాష్ట్ర స్థాయి మధుమేహ వైద్య సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్డీఐ (రీసెర్చ్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా) ఏపీ చాప్టర్ కార్యదర్శి, ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ డాక్టర్ యలమంచి సదాశివరావు తెలిపారు. నగరంలోని మనార్ ఫుడ్ ప్లాజాలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆదివారం నగరంలోని నోవోటెల్ హోటల్లో మధుమేహ వైద్య సదస్సు జరుగుతుందని ప్రకటించారు. వివిధ విభాగాల్లో ప్రఖ్యాతిగాంచిన 25 మంది వైద్య నిపుణులు ఈ సదస్సులో ప్రసంగిస్తారని, దాదాపు 600 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారని తెలియజేశారు. మధుమేహ వ్యాధి చికిత్సలో ఎదురవుతున్న సవాళ్లు, నూతన ఆవిష్కరణలు, ఆధునిక చికిత్సా విధానాల గురించి సదస్సులో విస్తృతంగా చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. వైద్య విధానాల గురుంచి అవగాహన పెంపొందించుకునేందుకు, నూతన చికిత్సా పద్ధతులను అభ్యసించేందుకు వైద్య విద్యార్థులకు ఈ సదస్సు చక్కగా ఉపయోగపడుతుందని అన్నారు. ఆదివారం ఉదయం జ్యోతి ప్రజ్వలనతో సదస్సు ప్రారంభవుతుందని, అనంతరం వరుసగా వివిధ అంశాలపై నిపుణులు ప్రసంగిస్తారని వివరించారు. ఒక్కో అంశంపై ప్రసంగం ముగిసిన అనంతరం సంబంధిత అంశానికి సంబంధించిన సందేహాలను నిపుణులు నివృత్తి చేస్తారని తెలిపారు. మధుమేహవ్యాధి నియంత్రణ, మధుమేహ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, మధుమేహ వ్యాధిగ్రస్తులకు అత్యుత్తమ చికిత్సలను అందుబాటులోకి తేవడమే లక్ష్యాలుగా ఈ 6వ రాష్ట్రస్థాయి మధుమేహ వైద్య సదస్సును నిర్వహిస్తున్నట్లు డాక్టర్ సదాశివరావు పేర్కొన్నారు. అనంతరం ఆర్ఎస్ఎస్డీఐ అధ్యక్షులు డాక్టర్ సీహెచ్. వసంత్ కుమార్ మాట్లాడుతూ సమావేశంలో భాగంగా ఆర్ఎస్ఎస్డీఐ ఏపీ చాప్టర్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరుగుతుందని డాక్టర్ వసంత్ కుమార్ అన్నారు. మీడియా సమావేశంలో ఆర్ఎస్ఎస్డీఐ ఏపీ చాప్టర్ నూతన అధ్యక్షులు, వైద్య సదస్సు నిర్వాహక కమిటీ గౌరవాధ్యక్షులు డాక్టర్ అలోక్ సచన్, కోశాధికారి డాక్టర్ పి. కృష్ణ ప్రశాంతి, సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఎల్. వెంకట రమణారెడ్డి, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు డాక్టర్ కందుల సాయి, డాక్టర్ సీహెచ్. మనోజ్ కుమార్, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ ఎ. మైథిలి, డాక్టర్ యలమంచి ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News